వైరా సీటుపై ఎంపీ ఫిట్టింగ్‌…!

ఖ‌మ్మం జిల్లా వైరా నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మ‌ద‌న్ లాల్ పై ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు.. ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. ఖ‌మ్మం ఎంపీ సీటు కూడా ఓడిపోతుంద‌ని నివేదిక ఇచ్చార‌ట‌. ఇది ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గ‌త కొంత‌కాలంగా ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. సెప్టెంబ‌ర్ లోనే అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఎంపీ రాసిన లేఖ క‌ల‌క‌లం రేపుతోంది. 2014లో ఇద్ద‌రూ వైపీపీ త‌ర‌పున గెలిచారు… ఎమ్మెల్యే విజ‌యానికి ఒర‌కంగా ఎంపీ కూడా సాయ‌ప‌డ్డారు. కానీ టిఆర్ఎస్ లో చేరిన త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్యా విబేధాలు ర‌చ్చ‌కెక్కాయి. వేదిక‌ల‌పై వ్య‌తిరేకంగా నినాదాలు చేసుకునేదాకా వ‌చ్చాయి. ఎమ్మెల్యేపై నియోజ‌క‌వ‌ర్గంలో కూడా తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అయితే తుమ్మ‌ల జోక్యంతో నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు ఎమ్మెల్యేకు ద‌గ్గ‌ర‌య్యారు. కానీ ఎంపీ వ‌ర్గం మాత్రం మ‌రింత దూర‌మైంది. ఖ‌మ్మం ఎంపీగా మ‌ళ్లీ పోటీచేయాల‌ని పొంగులేటికి కేసీఆర్ సూచించార‌ట‌. ఆర్ధికంగా, సామాజికంగా బ‌లంగా ఉన్న శ్రీనివాస‌రెడ్డి అయితే నామా నాగేశ్వ‌ర‌రావును ఢీకొడ‌తార‌ని బావించారు. అయితే శ్రీనివాస‌రెడ్డి ఎమ్మెల్యేగా బ‌రిలో దిగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ సీఎం ఆదేశాల‌తో ఎంపీగా బ‌రిలో దిగేందుకు ఒప్పుకున్నారు.. అయితే కొన్ని ష‌ర‌తులు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొంద‌రు సిట్టింగుల‌ను మార్చాల‌ని ఆయ‌న చెప్పార‌ట‌. ముఖ్యంగా వైరాలో మ‌ద‌న్ లాల్ కు ఎట్టిప‌రిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్ద‌ని స్ప‌ష్టం చేశార‌ట‌. మ‌ద‌న్ లాల్ పోటీచేస్తే ఓట‌మి ఖాయ‌మ‌ని.. ఎంపీ సీటుపై కూడా ప్ర‌భావం ప‌డుతుంద‌ని చెప్పార‌ట‌. మాజీ ఎమ్మెల్యే చంద్రావ‌తికి టికెట్ ఇవ్వాల‌ని శ్రీనివాస‌రెడ్డి సూచించిన‌ట్టు తెలుస్తోంది. వైరాలో ఎమ్మెల్యే తీరు కార‌ణంగా ఇప్ప‌టికే కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతుంద‌ని… టికెట్ ఇస్తే ఓట‌మి ఖాయ‌మ‌ని సంకేతాలు ఇచ్చార‌ట‌. మొత్తానికి వైరా సీటుపై ఎంపీ పొంగులేటి లేఖ ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందో చూడాలి.

Watch also:

Recommended For You