న‌యీం కేసు కంచికేనా..!

నిజాలకు పాతరేస్తారా?

కథ కంచికేనా?
కథ కంచికేనా?

న‌యీం కేసులో ఆ న‌లుగురు… ఈ ముగ్గురు… మరో ఇద్ద‌రు… రాజ‌కీయ నేత‌లు, అధికారులు అంటూ విన‌డ‌మే కానీ ఇంత‌వ‌ర‌కూ ఒక్క పేరు కూడా బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌త్య‌క్షంగా న‌యీంలో ఉండి సెటిల్మంట్లు చేసిన చోటా నేతల పేర్లే కానీ.. మాఫియా నాయ‌కుడికి ప్రభుత్వ స్థాయిలో ఉండి స‌హ‌క‌రించిన వారి జాత‌కాలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఇంకా పాల‌కులు చేస్తాం.. చూస్తాం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

వాస్త‌వానికి రాష్ట్రంలో కీల‌క కేసులన్నీ నీరుగారిపోతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అలాగే ఒక్క‌క్క‌టిగా పాత బ‌డుతున్నాయి. పాత్ర‌లు, పాత్ర‌ధారుల పేర్లు బ‌య‌ట‌కు రాకుండానే తెర‌మ‌రుగు అవుతున్నాయి.

ల‌క్ష‌ల మంది విద్యార్ధుల జీవితాల‌తో చెల‌గాట‌మాడిన ఎంసెట్ లీకు కేసు ఏమైంది. ఇందులో పెద్ద‌ల పాత్ర లేదా.. లేకుండానే పదుల కోట్లు చేతులు మారాయా? మ‌రి ఎవ‌రిని కాపాడ‌టానికి కేసును నీరుగారుస్తున్నారు. ఇంత‌వ‌ర‌కూ ఈ కేసులో సాధించిన ప్ర‌గ‌తి ఏంటి? అన్యాయం అయిన విద్యార్ధులు మ‌ళ్లీ దేవుడా రాముడా అంటూ ప‌రీక్ష రాశారు. కానీ పాపాల‌కు కార‌ణ‌మైన పెద్ద‌లు.. ల‌క్ష‌లు పెట్టి పేపర్ కొని సీట్లు కాజేద్దామ‌ని చూసిన కోటీశ్వ‌రులు ఎందుకు అరెస్టు కాలేదు. లీకైన పేప‌ర్ కొన్న వారు కూడా ఎవ‌రో కూడా తెలియలేదా? ఆధారాలు లేవా? ఈ కేసులో పెద్ద‌ల‌ను కాపాడేందుకు కుట్ర జ‌రుగుతుంద‌ని వస్తున్న విమర్శలు నిజమే అనిపిస్తున్నాయి. కేసు ద‌ర్యాప్తు తీరు సైతం అనుమానాలకు తావిస్తోంది.

ఇప్పుడు నయీం కేసులో కూడా లీకులు త‌ప్ప‌.. అరెస్టులు ఉండ‌వ‌ని అర్ధ‌మ‌యిపోయింది. జనాలు కూడా అందుకు మానసికంగా సిద్దమైపోయారు. వాస్తవానికి మాఫియాతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన వారి పేర్లు ఆ పాటికే వెలుగు చూడాల్సి ఉంది. కేసులు కూడా నమోదు అయితీరాలి. కానీ రాలేదంటే అర్ధ‌మేంటి? ఎంసెట్ కేసు నుంచి న‌యీం ఎన్ కౌంట‌ర్ దృష్టి మ‌ర‌ల్చింది.. ఇప్పుడు ఈ కేసు నుంచి మ‌రో వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌స్తుంది. లేదంటే ఓటుకు నోటులా నాన్చి క‌థ కంచికి చేరుస్తారా? 

పాత పాల‌కుల‌కు భిన్నం అని చెప్పే కేసీఆర్ ప్ర‌భుత్వం నేర‌స్తుల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి.. న‌యీం నేరాలతో వేలాదిగా ఉన్న బాధితుల‌కు న్యాయం చేసి.. హంత‌కుడికి కొమ్ము కాసిన పెద్ద‌ల బండారాన్ని బ‌య‌ట‌కు తీయాలి. ఎమ్మెల్యేలున్నారు.. ఎమ్మెల్సీలున్నారు అని లీకులు మాత్ర‌మే ఇచ్చి వారిని వ‌దిలేస్తే… ర‌క్తం మ‌రిగిన జంతువులా అదే నాయ‌కులు మ‌ళ్లీ మ‌రో న‌యీంను త‌యారుచేస్తారు. జ‌నం మీద‌కు వ‌దులుతారు. అదే జ‌రిగితే ఆ పాపం ఇప్ప‌టి పాల‌కులే మోయాల్సి వ‌స్తుంది. మ‌రి కేసీఆర్ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో మాట‌లు కాకుండా చేతుల‌కు ప‌నిచెబుతుందా? సామాన్యుల్లో విశ్వ‌స‌నీయ‌త కాపాడుకుంటుందా? 

Recommended For You

Comments are closed.