ఆ ఎమ్మెల్యేల్లో అంత‌ర్మ‌థనం..!

ధికార పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త లేదు.. టిఆర్ఎస్ నాయ‌క‌త్వం ప‌ట్ల అసంతృప్తి లేదు. కానీ ఎమ్మెల్యేలంటేనే జ‌నాలు భ‌గ్గుమంటున్నారు. వారి ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త గూడుక‌ట్టుకుంది. ఇది వారికి కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోందట‌. అయినా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ‌స్థితి. ఈ ప‌రిస్థ‌తి ఎవ‌రికో కాదు.. హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇత‌ర పార్టీల్లో గెలిచి.. త‌ర్వాత కాలంలో అధికార పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల దుస్థితి.  రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాల్లో ఎక్క‌డ చూసినా ఇదే టాపిక్ న‌డుస్తోంది. గ్రేట‌ర్ ప‌రిధిలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొంద‌రు ఆప‌రేష‌న్ ఆక‌ర్శ్‌లో భాగంగా కారెక్కారు. టీడీపీ బ‌ల‌హీన‌ప‌డ‌డం.. కాంగ్రెస్ లోకి వెళ్ల‌లేక‌.. మ‌రో ప్ర‌త్యామ్నాయం లేక టిఆర్ఎస్‌లోకి వెళ్లారు. మొద‌ట్లో స‌ర్దుకున్న‌ట్టే క‌నిపించినా.. త‌ర్వాత‌రర్వాత ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా మారుతూ వ‌చ్చాయి. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో జ‌నాలు కేసీఆర్ మాట‌లు.. కేటీఆర్‌పై విశ్వాసంతో గెలిపించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యేల పాత్ర నామ‌మాత్రం అని అర్ధ‌మ‌వుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు వ‌చ్చినా.. కార్య‌క‌ర్త‌లు ఎలా ఉన్నా.. ప్ర‌జ‌లు మాత్రం పెద్ద‌గా స్పందించ‌డం లేదు.  ఆయా కాల‌నీ సంక్షేమ సంఘాల‌ను ప‌ట్టుకుని కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకోవ‌డం త‌ప్ప‌.. ప్ర‌జ‌ల్ని భాగ‌స్వామ్యులు చేయ‌లేక‌పోతున్నారు. దీనికి కార‌ణం ఎమ్మెల్యేల తీరుపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి కార‌ణ‌మంటున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు ప‌ర్య‌ట‌న‌లు చేసే ప‌రిస్థితి లేదు. పార్టీ మార‌డం వారికి మైన‌స్‌గా మారింది. త‌మ స్వార్ధం కోసం జెండా మార్చార‌న్న అభిప్రాయం జ‌నాల్లోకి బ‌లంగా పోయింది. ఏ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు క‌లుసుకున్నా.. వారి మ‌ధ్య ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీ మారి త‌ప్పు చేశామా? అన్న అంత‌ర్మ‌థ‌నంలో ఉన్నార‌ట‌. మార‌కుంటే భ‌విష్య‌త్తు లేదు.. మారినా కూడా ఫ్యూచ‌ర్ పై భ‌రోసా లేకుండా పోయింద‌ని స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నార‌ట‌. దీనికి తోడు ఉద్య‌మంలో మొద‌టి నుంచి ఉండి.. త‌మ‌పై పోటీ చేసిన టిఆర్ఎస్ నాయ‌కులు కూడా ఏకుమేకుగా మారారు. వారూ టికెట్లు కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు రాజ‌కీయాలు పెరిగాయి. ఇవన్నీ చూస్తుంటే వారి రాజకీయ భవిష్యత్తపై భయం పట్టుకుంది.

Recommended For You