అక్కడ గెలుపోటములపై పందేలు వెయ్యి కొోట్లు దాటాయి

పందాలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు.  ఈ ఎన్నికల్లో కూడా విశ్వరూపం చూపిస్తున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు వెయ్యి కోట్లకు పైగా బెట్టింగుల రూపంలో డబ్బు  చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. . ప్రతీ గ్రామంలో అభ్యర్ధుల గెలుపు ఓటముల పైనా, పార్టీ అధినేత గెలుపు – ఓటమిపైనే భారీ పందాలు కాస్తున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుండే పోటీ చేయడంతో భీమవరంలో పవన్ గెలుపుపై బెట్టింగుల వర్షం కురుస్తోంది. భీమవరంలో ఈసారి ఓట్లు వేసిన వారిలో యువత అత్యధికంగా ఉన్నారనేది విశ్లేషకుల అంచనా. ఏ ఏ పోలింగ్ బూత్ లో ఎంతమంది ఓట్లు వేశారు, ఏ ఏ వర్గాల ప్రజలు అత్యధికంగా ఓటింగ్ లో పాల్గొన్నాయి, వారి ఓటు ఎవరికి పడిందన్న అంచనాలపై బెట్టింగ్ రాయుళ్లు సమీక్షిస్తున్నారు. పవన్ విజయం సాధిస్తారంటూ కొందరు లక్షల్లో పందాలు కాస్తుంటే, పవన్ ప్రత్యర్ధి, వైసీపీ అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్ గెలుస్తారని మరికొందరు పందాలు కాస్తున్నారు. నర్సాపురం పార్లమెంట్ బరిలో నిలిచిన జనసేన అభ్యర్ధి నాగేంద్రబాబు, వైసీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు ఫలితాలపైనా బెట్టింగులు జరుగుతున్నాయి. దెందులూరు అసెంబ్లీ నుండి టీడీపీ అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్ విజయం పైనా ఈసారి బెట్టింగ్ లు భారీగా ఉన్నాయి. ప్రతీ ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ మెజార్టీ పై పందాలు కాసే బెట్టింగ్ రాయుళ్లు ఈసారి చింతమనేని విజయం పై బెట్టింగ్ కు పరిమితం కావడం విశేషం. తెలుగుదేశం పార్టీకి వంద స్థానాలు వస్తాయా.. రావా అనే అంశంపైనా పందాలు జరుగుతున్నాయి. ఇంకొందరైతే హంగ్‌ వస్తుందని కాస్తున్నారు. జనసేనతో కలిసి TDP ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొందరు అంటుండగా.. మరికొందరు వైసీపీ అధికారంలోకి వస్తుందని పందాలు కాస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఏదో విధంగా ముఖ్యమంత్రి అవుతారని కూడా పందెం కాస్తున్నారు. పందాల్లో కొందరు నగదును కాస్తుండగా.. మరికొందరు స్థిరాస్తులను పెడుతున్నారు. ఊహకందని స్థాయిలో దాదాపు వెయ్యి కోట్లకు పైగా దాటుతుందని పందెంరాయుళ్ల అంచనా. హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతి, బెంగళూరు వంటి నగరాలు.. కడప, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పెద్దఎత్తున బడాబాబులు పందాలు కాస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా, వాటిపై బెట్టింగులు కాసే వారు మాత్రం అయితే కోటీశ్వరులు… లేదంటే బికారులు కావడం ఖాయం.

Recommended For You