వారొచ్చినా సిఎం స్థాయిలో ఏర్పాట్లు ఉండాల్సిందేన‌ట‌…..!

జిల్లాకు సిఎం వ‌స్తున్నారంటే చాలు హంగు, ఆర్బాటం ఉంటుంది. స్వాగ‌తం నుంచి వీడ్కోలు ప‌లికేవ‌ర‌కు సంద‌డి అంతా ఇంతా కాదు..ఖ‌ర్చు అయితే కోట్ల‌లోనే ఉంటుంది. అధికారికంగా ప్ర‌భుత్వ వ్య‌యం వేల‌ల్లోనే ఉంటుంది. కానీ ప్రయివేటుగా నాయ‌కులు జేబుల‌కు మాత్రం ల‌క్ష‌ల్లో చిల్లు ప‌డుతుంది. జిల్లా మంత్రి నుంచి సిఎం ప‌ర్య‌ట‌న ఉండే నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, జిల్లా,మండ‌ల‌నాయ‌కులు ఇలా అంద‌రికీ భారీగా ఖ‌ర్చుఅవుతుంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. స‌భ‌కు కార్య‌క‌ర్త‌లను త‌ర‌లించాలి.. భోజ‌నాలు పెట్టాలి. ఫ్లెక్సీలు వేయించాలి. సిఎంలు, ఇత‌ర మంత్రుల‌తో వ‌చ్చే అధికార‌, అన‌ధికారుల‌కు అవ‌స‌ర‌మైన స‌దుపాయాలు క‌ల్పించాలి. ఇక పార్టీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి వ‌చ్చేవారికి వాహ‌నాలు, వ‌స‌తి ఇలా చెప్పుకుంటూ పోతే ఖ‌ర్చుల జాబితా చాంతాడంత ఉంటుంది. అయితే ఇదంతా ఒక్క సిఎంకు అయితే ఫర్వాలేదు. ఎప్పుడో ఏడాదికి లేదంటే ఆరు మాసాల‌కు ఒక‌సారి వ‌స్తారు.. నాయ‌కుల‌కు కూడా పెద్ద‌గా భారం అనిపించ‌దు.. కానీ తెలంగాణ‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సిఎం కేసీఆర్ పెద్ద‌గా జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు రావ‌డం లేదు. ఎప్పుడో కానీ ఖ‌రారు కావ‌డం లేదు. కానీ వార‌సులు కేటీఆర్‌, క‌విత‌తో పాటు… నీటిపారుద‌లశాఖ మంత్రి హ‌రీష్‌రావులు వ‌చ్చినా జిల్లాల‌కు సిఎం ప‌ర్య‌ట‌న‌లాగే ఉంటుంద‌ట‌. వారి ప‌ర్య‌ట‌న ఖ‌రారు కావ‌డ‌మే ఆల‌స్యం.. రాష్ట్ర పార్టీ కార్యాల‌యం నుంచి ఆదేశాలు వ‌స్తున్నాయ‌ట‌. భారీ బ‌హిరంగ‌స‌భ‌లు పెట్టాలి. ఘ‌నంగా ఏర్పాట్లు చేయాలంటూ సంకేతాలు ఇస్తున్నార‌ట‌. దీనికి తోడు జిల్లాల్లో నాయ‌కులు కూడా త‌మ ప్రాభ‌ల్యం చూపించుకోవ‌డానికి కిందిస్థాయి నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నారు. దీంతో వారికి ఖ‌ర్చు త‌డిసిమోపడు అవుతుంద‌ని కొంద‌రు గొల్లుమంటున్నారు. కేటీఆర్ ప‌ర్య‌ట‌న ఉంది.. క‌విత వ‌స్తున్నారు ఘ‌నంగా స్వాగ‌త ఏర్పాట్లు చేయండి.. స‌భ‌లు పెట్టండి. జ‌నాన్ని త‌ర‌లించండి అంటూ ఆదేశాలు వ‌స్తున్నాయ‌ట‌. దీంతో జేబులు ఖాళీ అవుతున్నాయ‌ని జిల్లాల నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. ఇటీవ‌ల ఖ‌మ్మం జిల్లాలో కొంద‌రు నాయ‌కులు ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు పెట్టి తెగ బాధ‌ప‌డుతున్నారట‌. సిఎం వ‌చ్చినా ఇంత హ‌డావిడి లేదంటున్నారు. కేసీఆర్ స‌హా న‌లుగురిలో ఎవ‌రు వ‌చ్చినా సిఎం వ‌చ్చినంత ఖ‌ర్చు అవుతుంద‌ని ఇత‌ర జిల్లాల్లో నాయ‌కులూ అంటున్నారు. కేసీఆర్‌తో ఏమాత్రం తీసిపోవ‌డం లేద‌ని చెబుతున్నారు. జిల్లాల నాయ‌కులు కూడా ఏర్పాట్లు ఆస్థాయిలో చేస్తున్నారు. వారి అనుచ‌రులుగా ముద్ర‌ప‌డేందుకు తెగ హ‌డావిడి చేస్తున్నారు.

Recommended For You

Comments are closed.