తెలుగుదేశం విజ‌యానికి దారేది?

Andhra Pradesh

ఏపీలో తెలుగుదేశం బీజేపీని టార్గెట్ చేసింది. ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే సెంటిమెంట్ ఆయుధం త‌ప్ప మ‌రోమార్గం లేద‌ని భావించిన చంద్ర‌బాబునాయుడు క‌మ‌ల‌నాథుల‌ను సాధ్య‌మైనంత‌వ‌ర‌కూ దోషిగా చూపించి ప్ర‌జ‌ల్లో సానుభూతి.. సానుకూల ప‌వ‌నాలు పొందాల‌ని చూస్తున్నారు. అస‌లే నాటి మిత్రుడు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కళ్యాణ్ సొంతంగానే పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించారు. గ‌తంలో బీజేపీ, జ‌న‌సేన‌తో క‌లిసి పోటీచేస్తేనే  స్వ‌ల్ప ఓట్ల శాతంతో బ‌య‌ట‌ప‌డింది టీడీపీ. ఇప్పుడు మిత్రులు లేరు.. ఎవ‌రికి వారు ఒంట‌రిగా పోటీ త‌ప్ప‌దు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షం ఓట్లు చీలితే ఫ‌ర్వాలేదు.. కానీ టీడీపీకి అండ‌గా ఉంటార‌ని భావించిన‌ సామాజిక వ‌ర్గం ఓట్లు చీలితే అధికారం దూర‌మ‌వుతుంది. ఇదే ఆందోళ‌న టీడీపీలో ఉంది. ప‌వ‌న్ కళ్యాణ్‌, అటు బీజేపీ కూడా కాపులకు గాలం వేస్తోంది. ద‌ళితులు, మైనార్టీలు, క్రిస్టియ‌న్ ఓట్లు వైసీపీకి కాస్త ఎక్కువ ప‌డే అవ‌కాశం ఉంది. అటు కాపులు కూడా దూరం అయితే విజ‌యం అంద‌కుండా పోతుంద‌న్న ఆందోళ‌న‌ టీడీపీలో ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌క్కా వ్యూహంతోనే బీజేపీని టార్గెట్ చేసింది.  మ‌ళ్లీ ప్ర‌త్యేక హొదా, పోల‌వ‌రం, అమ‌రావ‌తి ఫార్ములా తెర‌మీద‌కు తీసుక‌వ‌చ్చారు. త్వ‌ర‌లో తెలంగాణ‌తో ముడిప‌డిన అంశాలు కూడా తెర‌మీద‌కు వ‌చ్చిన ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. సెంటిమెంటే ఇప్పుడు అస్త్రం. మ‌ళ్లీ అధికారం అందుకోవాల‌నంటే చంద్ర‌బాబు న‌మ్ముకుంది సంక్షేమ ప‌థ‌కాలు, సెంటిమెంట్‌. మ‌రి త‌న ఆయుధాల‌తో ప్ర‌త్య‌ర్ధుల‌కు చెక్ పెడ‌తారా?  లేక ముప్పేట జ‌రుగుతున్న దాడిలో న‌లిగిపోతారా?