తెలంగాణ కాంగ్రెస్ కు అసలు సవాల్ ఇదేనా…!

అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తర్వాత కాంగ్రెస్‌ పరిస్తితి తెలంగాణలో అయోమయంగా మారింది. ఎవరిదారి వారిదే అన్నట్టుగా తయారైంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని విధంగా మూడుసీట్లు రావడంతో కాస్త జోష్‌ వచ్చినట్టు కనిపించింది. కానీ జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఓటమితో చతికలపడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రయత్నించినా ఫలితం రాలేదు. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడంతో చేతిపార్టీలో కలవరం మొదలైంది. టిఆర్ఎస్‌ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచి తాము ఎదగాలని పరివారం సాయంతో కమలనాథులు కత్తులు నూరుతున్నారు. ఈ సమయంలో పురపాలక సంఘాలకు జరుగుతున్న ఎన్నికలు కాంగ్రెస్‌ కు అగ్నిపరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్తాయిలో విజయం సాధిస్తే.. పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. వైఫల్యం మూటగట్టుకుంటే జనాల్లో కూడా కాంగ్రెస్‌ పట్ల ఆశలు సన్నగిల్లుతాయి. కాచుకుని కూర్చున్న బీజేపీకి ఈ పరిస్థితులు వరంగా మారుతాయి. దీంతో పురపాలక ఎన్నికలను పీసీసీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే వారికష్టం ఎన్నికల్లో ప్రతిఫలిస్తేనే భవిష్యత్తుపై ఆశలుంటాయి. లేదంటే ఆశలు వదులుకోవాల్సిందే. అయితే వరుస వైఫల్యాలు వెంటాడుతున్నా.. పార్టీ తనకు తాను సిద్దం చేసుకోవడం లేదు. నాయకత్వ లోపం వెంటాడుతోంది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా.. ఆయన మాటకు విలువిచ్చేవారు లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనపై అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. డీకే అరుణ వంటివాళ్లే కాదు… ఎమ్మెల్యేలు కూడా ఆయన్ను విమర్శిస్తూ పార్టీ మారారు. భట్టి విక్రమార్క విషయంలో కూడా విశ్వాసం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ఆర్ధికంగా బలంగా ఉండి.. మాస్‌ ఇమేజ్‌ ఉన్న నాయకుడికి పగ్గాలు అప్పగించాలని కేడర్‌ కోరుకుంటోంది. కానీ ఢిల్లీ నాయకత్వంలోనే సంక్షోభం ఉన్న ఈ పరిస్థితుల్లో పట్టించుకునే నాధుడు లేడు. దీంతో రాష్ట్రంలో కూడా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ వీడారు.. ఉన్నవాళ్లు కూడా రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఒకరు కేసీఆర్‌ ను పొగడుతారు.. మరొకరు పార్టీ మీటింగులకు రారు… ఇంకొందరు కమలనాథులతో టచ్‌ లోకి వెళతారు. ఇంతటి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని కాంగ్రెస్‌ పురపాలక ఎన్నికల్లో నిలబడితే… కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం మేమే అని చాటుకోవచ్చు. వాస్తవానికి జనాల్లో కాంగ్రెస్‌ పట్ల సానుకూలత ఉంది… పార్లమెంట్‌ ఎన్నికలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కానీ నాయకత్వ లోపమే శాపంగా మారింది. మరి మున్సిపల్‌ ఎన్నికల్లో అధిగమిస్తుందా? చూడాలి.

Recommended For You