తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు కొత్త కష్టాలు

తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగరా మోగింది. ఎంపీటీసీ, జెడ్పటీసీ ఎన్నికల సందడి గ్రామాల్లో మొదలైంది. దీంతో కాంగ్రెస్‌ నాయకులు కూడా సన్నాహక సమావేశాలు పెట్టారు. గాంధీభవన్‌ లో విసృతంగా చర్చించారు. అయితే రివ్యూలు సంగతి అటుంచితే.. గ్రామాలకు వెళుతున్న నాయకుల పరిస్థితి దారుణంగా ఉంది. వెళ్లిన చోటల్లా నాయకులకు జనాల నుంచి కేడర్‌ నుంచి ఎదరయ్యే ప్రశ్న ఒక్కటే. మిమ్మల్ని గెలిపించిన ఉపయోగమేంటి? మళ్లీ అధికార పార్టీ గూటికి చేరతారుగా.. మీకెందుకు ఓటెయ్యలి అని నిలదీస్తున్నారు. దీంతో నాయకులు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావడం లేదు. Contnu… down
Watch Video:


గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు అంతా కూడా కారెక్కుతున్నారు. సిఎల్పీ కూడా విలీనం చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టికెట్ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఏం చేయాలో అంతుచిక్కడం లేదు. ఎవరిని నమ్మాలో.. మరెవరిని నమ్మకూడదో అర్ధం కావడం లేదు. జనాలు కూడా ఓటేసి గెలిపించినా మళ్లీ టిఆర్ఎస్‌ లోకి వెళతారు.. ఎందుకు వేయడమన్న నిర్ణయానికి వస్తున్నారు. గత సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పలు జిల్లాల్లో మంచి సీట్లు వచ్చాయి. గట్టి పోటీ ఇచ్చింది కానీ గెలిచిన తర్వాత చాలామంది సర్పంచ్‌లు పార్టీ వీడిపోయారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎన్నికల తర్వాత కూడా జెడ్పీ ఛైర్మన్‌, ఎంపీపీ పదవుల కోసం పార్టీ మారతారన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది. దీంతో కాంగ్రెస్‌ నాయకులు టికెట్లు ఇచ్చేముందు వారి నుంచి లీగల్‌ బాండ్‌ తీసుకోవాలని భావిస్తున్నారు. గెలిచినా ఓడినా పార్టీ మారబోమని.. న్యాయపరంగా చెల్లుబాటు అయ్యే విధంగా బాండ్‌ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఎంతవరకు పనిచేస్తుందన్నది చూడాలి. నాయకులను కాపాడుకోవడానికి తమకు ఓటు వేసినా ఉపయోగం లేదన్న భావన ప్రజల నుంచి తొలగించడానికి కాంగ్రెస్‌ తెగ కష్టాలు పడాల్సి వస్తుంది. ప్రజల్లో తమ పట్ల విశ్వాసం కల్పించడం వారికి కత్తిమీదసాముగా మారింది. మరి ఈ గండం నుంచి హస్తం నేతలు ఎలా బయటపడతారో చూడాలి.

Recommended For You