తెలంగాణ బీజేపీలో “కార్”చిచ్చు..?

తెలంగాణ బీజేపీలో కారు క‌ల్లోలం రేగుతోంది. 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర పడుతున్నాయి. రెండేళ్లు మాత్ర‌మే గ‌డువుంది. కానీ రాజ‌కీయంగా ఎలాంటి వ్యూహం అనుస‌రించాలన్న అంశంపై స్ప‌ష్ట‌త లోపించింది. దీంతో క్యాడ‌ర్‌లో అయోమ‌యం.. నాయ‌క‌త్వంలో గంద‌ర‌గోళంగా మారింది. అదిష్టానం సొంతంగా అధికారంలోకి రావ‌డానికి కృషి చేయాల‌ని ఆదేశిస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సొంతంగా పోటీ చేస్తే ఇప్పుడు ఉన్న సీట్లు కూడా కాపాడుకోవ‌డం క‌ష్ట‌మే అని కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. టీడీపీతో పొత్తు కొన‌సాగినా ప్ర‌యోజ‌నం లేద‌న్న భావ‌న రాష్ట్ర నాయ‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో టిఆర్ఎస్‌కు అనుకూల వైఖ‌రి తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. అధికార పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా అవ‌స‌ర‌మైతే 2019లో రాజ‌కీయంగా పొత్తులు పెట్టుకోవ‌చ్చ‌న్న వాద‌న ఉంది. జాతీయ‌స్థాయిలో ఎంపీ సీట్లు కూడా క‌లిసి వ‌స్తాయని అధిష్టానం పెద్ద‌లకు నివేదిక‌లు పంపార‌ట‌. పైగా కేసీఆర్ కూడా మోడీకి ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. కేంద్రంతో క‌ల‌హం కంటే స‌ఖ్య‌త కోరుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో గులాబీతో క‌లిసి క‌మ‌లం డ్యూయెట్ పాడుకోవ‌డం మంచిద‌న్న అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో వ్య‌క్తమ‌వుతోంది. అయితే ఇక్క‌డ రెండు స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ట‌.. జాతీయ‌స్థాయిలో టీడీపీతో పొత్తు ఉంది. పొరుగురాష్ట్రంలో అధికారం పంచుకుంటున్న స‌మ‌యంలో ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న అభిప్రాయం హైక‌మాండ్ వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో టిఆర్ఎస్ కూడా త‌మ‌కు బ‌ద్ద శ‌త్ర‌వు అయిన ఎంఐఎంతో స‌హ‌వాసం చేయ‌డం రెండో స‌మ‌స్య‌.

అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు వ‌ల్ల‌ న‌ష్ట‌మే కానీ.. ఒరిగేదేమీ లేద‌ని బీజేపీ రాష్ట్ర నాయ‌కుల్లో ఓ వ‌ర్గం బ‌లంగా చెబుతోంది. పైగా రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం వ‌ల్ల‌ భ‌విష్య‌త్తులో కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ద‌ప‌డే అవకాశాలున్నాయ‌ని గుర్తు చేస్తున్నారు. ఇటీవ‌ల పాలేరు ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో క‌లిపి పోటీ చేసిన తీరును ఉద‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీతో తెలంగాణ‌లో తెగ‌తెంపులు చేసుకుని.. కారు పార్టీతో షికారు చేస్తే బాగుంటుంద‌న్న‌ది రాష్ట్ర‌పార్టీలో ఓ వ‌ర్గం వాద‌న‌. అయితే అధిష్టానం మాత్రం మ‌రోలా ఆలోచిస్తోంది. రాష్ట్రంలో ఉన్న హిందూ సంస్థ‌లు, హైద‌రాబాద్ ప్ర‌త్యేక ప‌రిస్థితులు, ఆర్ఎస్ఎస్ భావ‌జాలం దృష్టిలో పెట్టుకుని క‌ష్ట‌ప‌డితే పార్టీకి సొంతంగా సీట్లు పెరుగుతాయ‌ని చెబుతోంది. కానీ అంత సుల‌భం కాదంటున్నారు స్థానిక నాయ‌కులు. స‌ర్వేల‌న్నీ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయ‌ని… ఇప్ప‌ట్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావ‌డం సాద్యం కాద‌ని విస్ప‌ష్టంగా చెబుతున్నారు. బ‌లంగా ఉన్న కాంగ్రెస్ పార్టీనే ఏమీ చేయ‌లేక‌పోతుంద‌ని.. ఇప్పుడు సొంతంగా పోవ‌డం కంటే అధికార పార్టీతో ఉండి.. బ‌లం పెంచుకోవ‌డం మంచిద‌ని సూచిస్తున్నారు.

మ‌రి టిఆర్ఎస్ కూడా క‌మ‌ల‌నాధుల‌తో క‌లిపుకపోవడానికి ముందుకొస్తుందా? త‌న కోసం ద‌శాబ్ధాల కాంగ్రెస్ స్నేహాన్ని వదులుకుని వ‌చ్చిన ఎంఐఎంకు హ్యాండిస్తుందా? ఇవ‌న్నీ త్వ‌ర‌లోనే స‌మాధానం దొర‌కాల్సిన ప్ర‌శ్న‌లు. నిజంగా బీజేపీ- టీడీపీ మ‌ధ్య జ‌ట్టు క‌లిస్తే.. రాజ‌కీయంగా స‌రికొత్త స‌మీక‌ర‌ణాలు చూడాల్సి వ‌స్తుంది. కాంగ్రెస్-టీడీపీ-ఎంఐఎం -వామ‌ప‌క్షాలు క‌లిసి మ‌హాకూటమిగా అధికార‌పార్టీని ఢీకొట్ట‌డానికి సిద్దం అవుతాయి. ఏదైనా 2017లో కొత్త స‌మీక‌ర‌ణాల‌కు పునాదులు ప‌డ‌డం ఖాయం.

Recommended For You

Comments are closed.