చిన్న‌మ్మ అంటూనే చుక్క‌లు చూపిస్తున్నాడా…!

త‌మిళ‌నాడులో ఆస‌క్తిక‌ర రాజ‌కీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు రాజ‌కీయ ఎత్తులు, పైఎత్తులు. మ‌రోవైపు ఐటీ దాడులు. ఇలా ప‌రిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అయితే రెండూ వేర్వేరు కాద‌ని.. ఒక‌దానితో ఒక‌టి ముడిప‌డి ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రిగా ఉన్నా ప‌న్నీర్‌సెల్వం.. పార్టీపైనా, ప్ర‌భుత్వంపైనా ఆధిప‌త్యం కావాల‌నుకుంటున్న శ‌శిక‌ళ‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ఆధిప‌త్య యుద్ధం అంటున్నారు. అయితే ఆస‌క్తిక‌రంగా ప‌న్నీర్ సెల్వం ఇంకా కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి ముందు చిన్న‌మ్మ‌ను క‌లుస్తూనే ఉన్నారు. నిత్యం పోయెస్ గార్డెన్‌కు వెళ్లి ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు. అయితే ఇదంతా పైకి క‌న‌ప‌డుతున్న సఖ్య‌త అని.. చిన్న‌మ్మ‌కు చెక్ పెట్టి సిఎం ప‌ద‌వి శాశ్వ‌తం చేసుకోవ‌డానికి ప‌న్నీర్ మంచి మ‌సాలా కూర తెర‌వెన‌క వండుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో భాగంగానే ఇంత‌కాలం జ‌య‌ల‌లిత‌కు, శ‌శిక‌ళ‌కు స‌న్నిహితంగా ఉన్న కీల‌క వ్య‌క్తి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్మోహ‌న్‌రావుపై ఐటీ దాడులు జ‌రిగాయంటున్నారు.  శ‌శిక‌ళ‌, రామ్మోహ‌న్ క‌నుస‌న్న‌ల్లోనే ఇంత‌కాలం పాల‌న సాగింది. ఇప్పుడు ఆయ‌న‌కు ప‌న్నీర్ చెక్ పెట్టారు. దీంతోనే ఆగ‌లేదు.. శ‌శిక‌ళ‌కు అత్యంత స‌న్నిహితుడుగా ఉన్న ప‌ళ‌నిస్వామి, ఆయ‌న బంధువు న‌ట‌రాజ‌న్ ఇంట్లో కూడా సోదాలు జ‌రిగాయి. అంటే శ‌శిక‌ళ‌ను ఇరికించ‌డానికి భారీ కుట్రేన‌ని ఆమె వ‌ర్గీయులు అంటున్నారు. సిఎస్‌ను తొల‌గించి మంచి అధికారిగా గుర్తింపు ఉన్న గిరిజా వైద్య‌నాధ‌న్‌ను నియ‌మించ‌డం ద్వారా ప‌న్నీర్ మంచి మార్కులే ప‌డ్డాయి. వాస్త‌వానికిఆమె ప‌ట్ల శ‌శిక‌ళ‌కు అంత స‌ఖ్య‌త లేదని ప్ర‌చారం. అంటే ప‌న్నీర్ పూర్తిగా త‌న అనుకూల మ‌నుషుల‌ను ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వుల్లో నియ‌మించుకుంటున్నారు. అయితే ఇప్ప‌టికీ పోయెస్ గార్డెన్ నుంచే కీల‌క నిర్ణ‌యాలు జ‌రుగుతున్నాయి.త్వ‌ర‌లోనే ప‌న్నీర్ సెల్వం ప‌ట్టు సాధించి శ‌శిక‌ళ‌ను దూరంగా పెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. శ‌శిక‌ళ‌ను కాద‌ని పార్టీని, ప్ర‌భుత్వాన్ని న‌డిపించే శ‌క్తి ప‌న్నీర్‌కు లేద‌ని.. ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆమెకు ఇంకా భ‌క్తులుగానే ఉన్నార‌ని కొంద‌రు గుర్తు చేస్త‌న్నారు. అయితే ఎప్పుడు విబేధాలు భ‌గ్గుమంటాయా.. సొమ్ము చేసుకుందామ‌ని డిఎంకే పార్టీ రెడీగా ఉంది. మ‌రి తాజా ప‌రిణామాలు ఎటు దారి తీస్తోయో చూడాలి.

Recommended For You

1 Comment

Leave a Reply

Your email address will not be published.