అంద‌రూ క‌లిసి సాత్విక‌ని చంపేశారు…!

అంతా క‌లిసి ఓ నిండు ప్రాణం తీశారు. స్కూలు చదువు ముగించుకుని కాలేజీలో అడుగుపెట్టిన కొద్ది నెలలకే అమ్మాయికి అర్ధమైపోయింది. తన భవిష్యత్తును కూడా తానే తీర్చిదిద్దుకోలేకపోతున్నానని.. బలవంతంగా ఇష్టం లేకపోయినా పెద్దలు చెప్పింది చేయాల్సిందేనా అన్న ఆవేదన బలవన్మరణానికి కార‌ణ‌మైంది. పెద్దలను ఒప్పించలేక.. పరిస్థితులతో రాజీపడలేక తనువు చాలించింది. హైదరాబాద్లో కార్పోరేట్ కాలేజి ధ‌న‌దాహం, నిర్ల‌క్ష్యం మరో చిన్నారిని బలితీసుకుంది.

మియాపూర్ లోని శ్రీచైతన్య మహిళా జూనియర్ కాలేజిలో సాత్విక అనే విద్యార్ధిని ప్రాణాలు తీసుకుంది. పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. అయితే ఇది కొత్త కాదులే. కార్పోరేట్ కాలేజీల్లో ఏటా బలి అవుతున్న డజన్ల కొద్దీ విద్యార్ధుల్లో సాత్విక ఒకరు. ఎవరికీ ప్రాణం అంటే లెక్క‌లేదు. యాడ్స్ కోణంలో మీడియాకు ఇది వార్త అసలే కాదు. అదే ప్రభుత్వ కాలేజీలో గోడ కూలి విద్యార్ధికి చిన్న గాయం అయిన రోజంతా మరో బ్రేకింగ్ ఉండదు. తెల్లారి పేపర్ లో పత్రికల్లో పతాకశీర్షికల్లో ఉంటుంది. మరి ప్రయివేటు కాలేజీలో ప్రాణం పోయినా న్యూస్ ఎందుకు కాకుండాపోతోంది. ఇక పోలీసులు వచ్చి ఆత్మహత్యగా కేసు నమోదు చేస్తారు. కాలేజీకి సంబంధం లేదని తెల్లారి ఎఫ్ ఐ ఆర్ లో క‌నిపిస్తుంది. అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. లేదంటే డిప్రెషన్ తో చనిపోయింది అని తేల్చేస్తారు. యాజమాన్యం ఈ ఘటనపై అసలు స్పందించదు. ఏమీ జరగనట్టే మళ్లీ కాలేజీ తెల్లారి మిగిలిన విద్యార్ధుల‌పై ఒత్తిడి మొదలు. ఇంతకుమించి కేసులో మనం ఏమీ ఆశించలేం. ఏ రాష్ట్రం అయినా.. ఏ ప్రభుత్వం అయినా ఇంతే. కార్పోరేట్ కు దాసోహం అంటున్నాయి. అధిపతులకు మంత్రి పదవులు క‌ట్ట‌బెడుతున్నాయి. ప్రజాప్రతినిధులను చేస్తున్నాయి.

రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య చనిపోతే చట్టాలు కోసం పోరాడుతున్నాం.. హత్యగా చాటుతున్నాం. నిజమే అది వంద శాతం హత్యే. మరి ఇష్టం లేకపోయినా బలవంతంగా చదివించి సాత్విక ప్రాణాలు తీయడం హత్య కాదా? ఆమె భావాల‌ను అర్ధం చేసుకోని తల్లిదండ్రులు, మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకుని కాపాడాల్సిన‌ కాలేజి యాజమాన్యం కలిసి చేసిన పాశ‌విక హత్య కాదా. ముమ్మూటీకి సాత్విక‌ది హ‌త్యే. అంతా క‌లిసి చేసిన హ‌త్య‌.

సాత్విక లాంటి ఎంతో మంది అమాయ‌కుల‌ను పొట్టన‌పెట్టుకుంటున్న‌కార్పోరేట్ విద్యాసంస్థ‌ల‌పై ఈ రోజుకు ఒక్క‌కేసు అయినా న‌మోదు అయిందా..? ఎన్నిసార్లు విద్యార్ధులు ఆత్మ‌హ‌త్య అని విన్నాం.. ఒక్క కేసులో అయినా ఎవ‌రిది త‌ప్పో తేలిందా,. అరెస్టులు జ‌రిగాయా? ఏ కాలేజి అయిన మూత‌ప‌డిందా?. ఫీజులు చెల్లించ‌లేద‌ని బ‌యట‌కు పంపిస్తే దిల్ షుఖ్ న‌గ‌ర్ నారాయ‌ణ కాలేజి విద్యార్ధి గ‌త ఏడాది ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయినా కేసు లేదు. కాలేజీ మూత‌ప‌డ‌లేదు. అనుమ‌తులు లేకుండా కార్పొరేట్ సంస్థ‌లు వంద‌ల బ్రాంచ్‌లు న‌డిపించినా ప్ర‌భుత్వాల కంటికి క‌నిపించ‌వు. చిన్న గ‌దుల్లో వంద‌ల మంది విద్యార్ధుల‌తో ఏమాత్రం భ‌ద్ర‌త లేని కాలేజీల్లో చ‌ద‌వులు చెబుతున్నా విద్యాశాఖ మొద్దు నిద్ర వ‌ద‌ల‌దు. అంతే పాల‌కులు క‌ళ్లు తెర‌వ‌నంత కాలం.. త‌ల్లిదండ్రుల్లో మార్పు రానంత వ‌ర‌కు సాత్విక లాంటి అమాయ‌కులు బ‌లి అవుతూనే ఉంటారు. కార్పోరేట్ ధ‌న‌దాహం కొన‌సాగుతూనే ఉంటుంది. స‌మాజం ఇలా క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తూనే ఉంటుంది.

Recommended For You

Comments are closed.