100 మంది అధికారులు.. 9 డెన్‌లు.. 106 కోట్ల న‌గ‌దు

త‌వ్విన కొద్దీ బంగారు బిస్కెట్లు, నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని ప్రముఖ కాంట్రాక్టర్ శేఖ‌ర్ రెడ్డి ఆయ‌న సంబంధీకుల‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాల‌యాల్లో సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే 106 కోట్లు విలువైన న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. 127 కేజీల బంగారం బ‌య‌ట‌ప‌డింది. 96 కోట్లు పాత నోట్లు కాగా.. 10 కోట్లు కొత్త‌గా ఆర్బిఐ విడుద‌ల చేసిన 2వేల నోట్లు ఉన్నాయి. ఇదంతా రాజకీయ నాయకులు,  ఇతర ప్రముఖులు నోట్లు మార్చమని బ్లాక్ మనీ శేఖర్ రెడ్డికి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వారంతా ఈ క గండం నుంచి బయటపడేందుకు లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

శేఖ‌ర్‌రెడ్డితో పాటు.. ఆయ‌న అనుచ‌రుడు, పారిశ్రామిక‌వేత్త శ్రీ‌నివాస‌రెడ్డి, మ‌రో స‌న్నిహితుడు ప్రేమ్‌కుమార్ ఇళ్ల‌లో కూడా దాడులు జ‌రుగుతున్నాయి. మొత్తం 100 మంది ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు. ముందురోజు రెండు గ‌దుల తాళాలు త‌న‌వ‌ద్ద లేవ‌ని తెర‌వ‌డానికి శేఖ‌ర్‌రెడ్డి అంగీక‌రించ‌లేదు. త‌ర్వాత రోజు త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి చూడ‌గా బంగారం, న‌గ‌దు బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్‌గా ఉన్న శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న అన్నాడిఎంకే పార్టీ నాయ‌కుడు. అంతే కాదు పార్టీ ఆర్ధిక వ్య‌వ‌హారాల్లో కూడా సాయంగా ఉంటాడ‌ట‌. స్వ‌యంగా దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత గ‌తంలో టీటీడీ బోర్డు మెంబ‌ర్‌గా నియ‌మించాల‌ని చంద్ర‌బాబుకు లేఖ రాశారు. అంటే ఆయ‌న స్థాయి అర్ధ‌మ‌వుతుంది. ప‌న్నీర్‌సెల్వానికి కూడా అత్యంత ఆప్తుడు. ఐటీ సోదాల్లో దొరికిన న‌గ‌దు, బంగారం అంతా త‌న‌దేన‌ని అధికారుల‌కు శేఖ‌ర్ రెడ్డి చెబుతున్నారు. అయితే దీనిపై లెక్క‌లు తేలాల్సి ఉంద‌ని.. అకౌంట్లు చెక్ చేసిన త‌ర్వాత వివ‌రాలు చెబుతామ‌ని అధికారులు అంటున్నారు.

Recommended For You

Comments are closed.