శ‌శిక‌ళ‌కు అంత సీనుందా..?

త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. రాత్రికి రాత్రి అంతా స‌ర్దుకున్న‌ట్టు క‌నిపించినా.. మ‌ళ్లీ సీను మారుతోంది. సంక్షోభం దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. ఇంత‌కాలం తెర‌వెన‌కుండి అన్నీ తానై న‌డిపించిన జ‌య‌ల‌లిత నిశ్చెలి.. శ‌శిక‌ళ ఇప్పుడు వార‌సురాలుగా కూడా త‌న‌కే అర్హ‌త ఉందంటున్నారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారు. ప్లాన్ ప్ర‌కారం న‌డుచుకుంటున్నారు. జయ మరణించిన వెంట‌నే ప్ర‌మాణం చేస్తే ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు సంకేతాలు పోతాయ‌ని భావించి.. ముందు ప‌న్నీర్‌సెల్వానికి ప‌గ్గాలు అప్ప‌గించారు. రోజులు గ‌డిచిన త‌ర్వాత ఇప్పుడు త‌న ప్లాన్ అమ‌లు చేస్తున్నారు. సిఎం పీఠంపై కూర్చోడానికి మద్దతు కూడగడుతున్నారు. మ‌రి మంత్రులు ముఖ్యంగా సిఎం ప‌న్నీర్‌సెల్వం ఇందుకు అంగీక‌రిస్తారా? జ‌య‌కు, ఆమె అభిమానానికి తాను బానిస‌ను.. ఇత‌రుల‌కు కాద‌ని బ‌ల‌మైన సంకేతం శశికళకు ఇస్తాడా..? శ‌శిక‌ళ‌కు సిఎం పీఠం వ‌దులుకుంటాడా.. ఇప్పుడు సీట్లో కుదురుకుంటే దీర్ఘ‌కాలం సిఎంగా ఉండే అవ‌కాశం ఉంది దీనిని ప‌న్నీర్ వ‌దులుకుంటారా?

కానీ శ‌శిక‌ళ వ‌దలబొమ్మాళీ అంటోంది. ప‌ద‌వుల కోసం మంత్రాంగం మొద‌లుపెట్టింది. ఇప్ప‌డిదాకా పోయెస్ గార్డెన్.. ఇక నుంచి మ‌న్నార్‌గుడి మంత్రాంగ‌మే రాష్ట్రానికి ర‌క్ష అంటోంది. అందుకే జ‌య‌కు న‌చ్చ‌క ఇంత‌కాలం దూరంగా పెట్టిన త‌న కుటుంబాన్ని అండ‌గా తీసుకోచ్చుకున్నారు. ఒంట‌రిదాన్ని కాద‌ని.. కుటుంబంతో పాటు.. తాను గెలిపించిన ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌ని తెలిపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జ‌య ఆసుప‌త్రిలో చేరింది మొద‌లు.. అంత్య‌క్రియ‌ల వ‌ర‌కూ శ‌శిక‌ళ మాత్ర‌మే క‌నిపించారు. మంత్రులు నామ‌మాత్రంగానే మిగిలారు. ఆమె త‌న ప్రాభ‌ల్యాన్ని చాటుకోవ‌డానికి జ‌య అంతిమ ఘ‌డియ‌ల‌ను వేదిక‌గా మ‌లుచుకున్నార‌న్న విమ‌ర్శ‌లు పెరుగుతున్నాయి. అంతే కాదు జ‌య స్వ‌యంగా వ్య‌తిరేకించి ఇంటి నుంచిగెంటేసిన శ‌శిక‌ళ‌ కుటుంబస‌భ్యులు ఇప్పుడు చెన్నైలో హ‌ల్‌చ‌ల్‌చేస్తున్నారు. భ‌ర్త న‌ట‌రాజ‌న్ నుంచి సోద‌రుడు ధివహ‌ర‌న్ ఇప్పుడు పార్టీకి పెద్ద‌దిక్కు మేమే అంటూ ఎమ్మెల్యేలో స‌మావేశాలు, రహస్య మంతనాలు జరుపుతున్నారు.

జ‌య మృత‌దేహం స్ట్రెచ‌ర్‌పై ఉండ‌గానే ఇలాంటి సంక్షోభాలు వ‌స్తాయని తెలిసి కేంద్రం ప్రతినిధులను పంపి అర్ధ‌రాత్రి ద‌గ్గ‌రుండి ప‌న్నీర్‌సెల్వం చేత ప్ర‌మాణం చేయించింది. కానీ ఈ వ్యూహం ప‌లించ‌లేదు. ముందు అంగీక‌రించిన శ‌శిక‌ళ పార్టీ కంటే ప‌ద‌వికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఆమె కేవ‌లం పార్టీ అధ్య‌క్షురాలుగా మాత్ర‌మే ఉండాల‌నుకోవ‌డం లేదు. జ‌య త‌ర‌హాలో స‌ర్వం తానే కావాల‌నుకుంటున్నారు. పార్టీ, ప‌ద‌వి రెండూ త‌న చేతిలో ఉండాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారు. మ‌రి కార్య‌క‌ర్త‌లు ఇందుకు స‌మ్మ‌తిస్తారా? మ‌న్నార్‌గుడి మాఫియాగా ఒక‌ప్పుడు విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ముఠా ఇప్పుడు ర‌క్ష‌కులుగా మార‌తామంటే కార్య‌క‌ర్త‌లు అంగీక‌రిస్తారా.. చూడాలి. కేవ‌లం జ‌య‌ల‌లిత స్నేహం మాత్ర‌మే వార‌సురాలు కావ‌డానికి పార్టీని కాపాడ‌టానికి అర్హ‌త అవుతుందా?

Recommended For You

Comments are closed.