అక్ర‌మార్కుల పాపాల‌కు ప్ర‌జాధ‌నం ప‌రిహార‌మా..?

హైద‌రాబాద్‌లో ఏడంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు. లంచాల‌కు క‌క్కుర్తి ప‌డ్డ అవినీతి అధికారుల అండ‌దండ‌ల‌తో అక్ర‌మార్కులు య‌ధేచ్చ‌గా నిబంధ‌న‌లు ఉల్లంఘించారు. ఆకాశాన్ని తాకే అక్ర‌మాలు క‌ళ్లముందు క‌న‌ప‌డుతున్నా.. కూల్చేయాల‌న్న ఆలోచ‌న రాలేదు. రాజ‌కీయ నాయ‌కుల జోక్యం అద‌న‌పు అర్హ‌త‌గా మారింది. వీరందరి పాపాల‌కు అమాయాకులు బ‌ల‌య్యారు. పూడ్చ‌లేని విషాదం కుటుంబాలకు మిగిలింది. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్టు పాల‌కులు ఇప్పుడు ప‌రిహారం ప్ర‌కటించారు. 10ల‌క్ష‌ల ఇస్తామంటున్నారు. హ‌డావిడిగా ఇద్ద‌రుముగ్గురు అధికారుల‌ను స‌స్సెండ్ చేసి.. అవినీతి అంతం.. మా పంతం అంటే సరిపోతుందా? ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు అస‌లు స‌మ‌స్య ప‌రిహారం. ప‌రిహారం ప్ర‌భుత్వం ఎందుకు ఇవ్వాలి.  ప్ర‌జాధ‌నం ఇచ్చే హ‌క్కు ప్ర‌భుత్వానికి ఎక్క‌డిది.? మృతుల‌కు న్యాయం చేయాలి. వారిని ఆదుకోవాలి. కానీ ఇది ప్ర‌భుత్వం మ‌ధ్య‌వ‌ర్తిగా ఉండి వారికి అండ‌గా నిల‌వాలి త‌ప్ప‌.. ప్ర‌జాధనాన్ని  బాధితుల‌కు ప‌రిహారంగా ఇవ్వ‌డం ఏమాత్రం స‌మ‌ర్ధ‌నీయం కాదు. అక్ర‌మాల‌కు కార‌ణ‌మైన వారిని దోషులుగా నిల‌బెట్టి వారి ఆస్తులు వేల‌మేసి అప్ప‌టిక‌ప్పుడే బాధితుల‌కు న్యాయం చేయాలి. ఎవ‌రైతే కార‌ణ‌మో వారే ఈ న‌ష్టాన్ని భ‌రించాలి. కేసులు పెట్టి జైలుకు పంపాలి. కానీ మ‌న‌దగ్గ‌ర అలా జ‌ర‌గ‌డం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఘటనకు కారణమైన ఉద్యోగుల‌ను డిస్మిస్ చేయాలి. వారి స్థానంలో బాథితుల కుటుంబాల నుంచి ఒక‌రి చొప్పున ఉద్యోగాలు భ‌ర్తీ చేయాలి. యజమాని భ‌వ‌నం ఉన్న స్థ‌లం అమ్మి నష్టప‌రిహారంగా, క్షతగాత్రుల ఆసుపత్రుల ఖర్చులకు ఇవ్వాలి. స‌రిపోక‌పోతే ఇంకా వారి ఆస్తులు గుర్తించి తెగ‌న‌మ్మాలి. అలాంటి క‌ఠిన చ‌ట్టాలు వ‌స్తే త‌ప్ప ప‌రిస్థితిలో మార్పు రాదు. అప్ప‌డే భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌గ్గుతాయి. భ‌యం పెరుగుతుంది.

Recommended For You

Comments are closed.