రేవంత్ దారెటు.. తెలంగాణ‌లో సైకిల్ ప‌య‌న‌మెటు?

త‌న జీవితంలో అత్యంత దుర్ధినం.. చీక‌టిరోజు అంటూ తెలంగాణ విభ‌జ‌న జ‌రిగిన రోజును చంద్ర‌బాబునాయుడు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ జీవితాల్లో వెలుగు వ‌చ్చిన రోజుగా భావిస్తే ఆయ‌న తన జీవితంలో అత్యధికంగా బాధపడిన రోజు… చీక‌టి రోజు అంటున్నారు. అంటే ఆయ‌న ఏపీకి ప‌రిమితం అయ్యాన‌ని..నా రాష్ట్రం ఏపీ అని కుండ‌బ‌ద్దలు కోట్టిన‌ట్టేనా? అవునంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. ఇక తెలంగాణ‌లో పార్టీని ప‌క్క‌న పెట్టి.. కేవ‌లం ఏపీనే త‌న డిస్టినేష‌న్ అని చంద్ర‌బాబు చెప్ప‌క‌నే చెప్పారు. ఇటీవ‌ల వ‌ర‌స‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలు, తాజా ప్ర‌క‌ట‌న అన్నీ చూస్తే చంద్ర‌బాబు తెలంగాణ పార్టీని కూడా పూర్తిగా వ‌దిలేసిన‌ట్టేన‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే లోకేష్‌ను మంత్రిగా చేసి ఏపీకి ప‌రిమితం చేయాల‌నుకున్నారు. అంటే తన కుటుంబం ఇక తెలంగాణ పార్టీ చూడ‌ద‌న్న సంకేతాలు ఇచ్చారు. ఇక్క‌డి నాయ‌కుల‌కే పార్టీని వ‌దిలి.. మీ సంగ‌తి మీరు చేసుకోండి అన్న‌ట్టు తెలుస్తోంది.

ఇటీవ‌ల చంద్రబాబు తెలంగాణ సిఎంతో స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. భ‌విష్య‌త్తులో ఇక్కడ పార్టీ ఉండ‌ద‌న్న అబిప్రాయం వ‌చ్చాకే కేసీఆర్ చంద్ర‌బాబుకు స్నేహ‌హ‌స్తం అందించిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ పార్టీ ఉన్నా.. టిఆర్ఎస్‌కు తోక‌పార్టీగానే ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇక్క‌డే ఇద్ద‌రు నేత‌ల‌కు స‌మ‌స్య‌ల్లా రేవంత్ రెడ్డి. ఆయ‌న నాయ‌క‌త్వాన్ని ఎట్టి ప‌రిస్తితుల్లో కేసీఆర్ అంగీక‌రించ‌రు. మ‌రి రేవంత్‌రెడ్డిని ఏం చేస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఒక‌వేళ తెలుగుదేశం పార్టీ కొన‌సాగించి కేసీఆర్‌తో సంబంధాలు మెరుగుప‌డాలంటే రేవంత్ రెడ్డిని బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాలి. మ‌రి చంద్ర‌బాబు అలా వ‌దిలించుకోవ‌డం సాద్య‌మ‌వుతుందా? .. రేవంత్‌కు హ్యాండిస్తే ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబును ఇరికించే స‌మ‌స్య ఉండ‌దా? ఇదే టీడీపీలో చ‌ర్చనీయాంశంగా మారింది. కేవ‌లం రేవంత్ రెడ్డి కోస‌మే ఇంత‌కాలం పార్టీని చంద్ర‌బాబు న‌డిపిస్తూ వ‌చ్చార‌ని.. త్వ‌ర‌లోనే అన్నీ స‌ర్థి.. సెటిల్ చేస్తార‌ని ప్ర‌చారం మాత్రం జరుగుతోంది.

త్వ‌ర‌లోనే తెలంగాణ టీడీపీ భ‌విష్య‌త్తు తేలిపోతుంద‌ని పార్టీ వ‌ర్గాల్లో విసృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి సైకిల్ ప‌య‌నం ఎటుపోతుందో చూడాలి. అంత‌కంటేముందు రేవంత్ రెడ్డి దారెటు అన్న‌ది తేలాలి.

Recommended For You

Comments are closed.