రేవంత్‌ రెడ్డి గెలుస్తారా? ఆయనకు మెజార్టీ ఎంత వస్తుంది?

కొడంగల్‌ లో ఓటమి చెందిన రేవంత్‌ రెడ్డి మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ సీటు నుంచి పోటీచేశారు. మొదట్లో గెలుస్తాడని పెద్దగా ఆశలు లేకపోయినా.. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్‌.. మాటల్లో దూకుడుతనంతో ఆశలు రేకెత్తించాయి. జనాలను ఆకట్టుకునేలా ప్రచారం చేయడంతో ముందున్నారు. కాంగ్రెస్‌ కు అసలు ఓట్లు పడతాయా అన్న వ్యాఖ్యల నుంచి మల్కాజ్‌ గిరిలో గట్టి పోటీ ఉంది అనే దాకా తీసుకొచ్చారు. ఎన్నికల జరిగేరోజు వరకూ రేవంత్‌ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. గెలుస్తారేమో అన్న అభిప్రాయం కూడా వినిపించింది. కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు.. శివారుప్రాంతాల్లో ఉన్న సెటిలర్లు, తెలుగుదేశం కేడర్‌ అంతా మద్దతు ఉండడంతో రేవంత్‌ రెడ్డి కూడా రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేశారు. కానీ పోలింగ్‌ శాతాలు చూసిన తర్వాత ఆశలు మళ్లీ సన్నగిల్లాయి. రేవంత్‌ రెడ్డి గెలవడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. వాస్తవానికి రేవంత్‌ రెడ్డికి నగరంలో మంచి స్పందన వచ్చింది. ర్యాలీలకు, మీటింగులకు జనాలు భారీగా వచ్చారు. సోషల్‌ మీడియాలో విసృతంగా ప్రచారం జరిగింది. అయితే ఇదంతా ప్రచారానికి పరిమితం అయింది. ఓటుగా మారలేదన్న వాదనలున్నాయి. నగరంలో ఓటర్లు ముఖ్యంగా ఆయనకు మద్దతుగా ఉంటారని భావించిన ఆంధ్రా ఓటర్లు ఇక్కడ కంటే ఏపీలో ఓటేయడానికి మొగ్గుచూపారు. అంతా వెళ్లిపోయారు. నగరం ఖాళ అయింది. ఇక మిగిలింది గ్రామాలు.. మేడ్చల్‌ వంటి ప్రాంతాల్లో ప్రత్యర్ధి రాజశేఖరరెడ్డి మామ మల్లారెడ్డి ప్రాభల్యం ఉన్న ప్రాంతాలు. అక్కడ ఓట్లన్నీ ఆయనకే పడ్డాయి. టిఆర్ఎస్‌ కు గ్రామాల్లో భారీగా ఓటింగ్‌ పెరిగింది. నగరంలో వస్తాయనుకున్న ఓట్లు కాంగ్రెస్‌ కు పడలేదు. అతితక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో రేవంత్‌ రెడ్డి గెలవడం కష్టమని తేలిపోతోంది. పైగా గ్రామాల్లో అధికారపార్టీ డబ్బు, అధికారబలం పనిచేశాయి. రేవంత్‌ రెడ్డి బూత్‌ ఎజెంట్ల విషయంలో కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మొత్తానికి గట్టి పోటీ ఇచ్చినా.. గెలుపు మాత్రం కష్టమేనంటున్నారు. మరి రేవంత్‌ రెడ్డి ఏం చేస్తారన్నది చూడాలి.

Watch full Video:

Recommended For You