రిజ‌ర్వేషన్లతో కాదు తెలివితేట‌ల‌తో బ‌త‌క‌డం నేర్పాలి..!

ప్రాంతీయ పార్టీలు ఇంకా మ‌తాల మంట‌లు రాజేస్తున్నాయి. సెక్యుల‌ర్ వాదుల‌మంటూనే.. కులాల కుంప‌ట్ల పెడుతున్నాయి. ఓట్ల కోసం రిజ‌ర్వేషాలు వేస్తున్నాయి. ఇందుకు ఏ పార్టీ మిన‌హాయింపు కాదు.. మ‌రే రాష్ట్రం విభిన్నం కాదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇష్టారాజ్యంగా వ‌రాలు ఇస్తున్నారు. ఇప్ప‌టికే ఉచిత ప‌థ‌కాల‌తో ఆక‌ట్టుకుంటున్న పార్టీలు.. అంత‌టితో ఆగ‌డం లేదు. రిజ‌ర్వేష‌న్లు కూడా క‌ల్పిస్తామంటే లేనిపోని ఆశ‌లు క‌ల్పిస్తున్నాయి. రాజ్యాంగం 50శాతం కంటే ఇవ్వ‌డం సాద్యం కాద‌ని చెబుతోంది. మ‌తాలు, కులాల ప్రాతిప‌దిక‌న కోటాలపై అత్యున్న‌త న్యాయ‌స్థానాలు అభ్యంత‌రం చెబుతున్నాయి. ప‌లుమార్లు ఆయా రాష్ట్రాలు ఇచ్చిన రిజ‌ర్వేష‌న్లను కూడా కోర్టులు ర‌ద్దు చేశాయి. ఒక్క త‌మిళ‌నాడు మిన‌హా మ‌రే రాష్ట్రం కూడా ప‌రిమితి మించిన రిజ‌ర్వేష‌న్ల‌కు .. రాజ్యాంగ‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ సాధించుకుంది. ఇది మిన‌హా మ‌రే రాష్ట్రంలో మీరిన కోటాల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త లేదు. సొంతంగా అసెంబ్లీలో బిల్లులు పెట్టుకుని అమ‌లు చేస్తున్నాయి. కొన్నిచోట్ల కోర్టులు కోటాల‌ను ర‌ద్దు చేశాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కులాలు, మ‌తాల వారీగా రిజ‌ర్వేష‌న్లు పెంచి రాజ్యాంగ బ‌ద్దం చేయ‌డం అసాద్యం. అయినా పార్టీలు ఓటు రాజ‌కీయాల కోసం ఈ విష‌యంలో అల‌వికానీ వాగ్ధానాలు ఇస్తునే ఉన్నాయి.

తెలంగాణ మైనార్టీల‌కు ఇస్తామంటున్న రిజ‌ర్వేష‌న్లు ఇందుకు భిన్నం కాదు. మ‌తాల ప‌ద్ద‌తిలో ఎలా ఇస్తార‌న్న ప్ర‌శ్న‌కు.. తెలివిగా స‌మాధానం చెప్పినంత మాత్రాన ప్ర‌జ‌లు అర్ధం చేసుకోలేనంత అమాయ‌కులు కాదు. ముస్లిం రిజ‌ర్వేష‌న్లు కాదు.. మైనార్టీల్లో వెన‌క‌బ‌డిన వ‌ర్గాల‌కు మాత్ర‌మే కోటాలు అని కేసీఆర్ చెబుతున్నారు. మ‌రి ఈ వ‌ర్గంలో క్రిమిలేయ‌ర్ పెడ‌తారా? ఇచ్చే రిజ‌ర్వేష‌న్లు కేవ‌లం ముస్లింల‌లో కొంత‌మందికి అమ‌లు చేస్తారా? అలా సాద్య‌మ‌వుతుందా? ఇవ‌న్నీ కేసీఆర్ ముందున్న స‌వాళ్లు. ఇక్క‌డే కాదు… అటు ఏపీలో కాపుల‌కు క‌ల్పిస్తామంటున్న వాటాలు కూడా ఇదే ప‌రిస్థితి. రాజ‌స్థాన్‌లో గుజ్జ‌ర్లు, మ‌హారాష్ట్ర‌లో మ‌రాఠాలు, గుజ‌రాత్‌లో ప‌టీదార్లు ఇలా అన్ని వ‌ర్గాలు రిజ‌ర్వేష‌న్లు అడుగుతున్నాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లో అగ్ర‌వ‌ర్ణాలు, నిమ్న‌వ‌ర్గాలు బేధం లేదు. కుల‌, మ‌తాల‌కు అతీతంగా పేద‌లంద‌రికీ ప్ర‌భుత్వం సంక్షేమం అందాల‌న్న‌ది కొంద‌రి వాద‌న‌.

నిజంగా రిజ‌ర్వేష‌న్ల ల‌క్ష్యం స‌మాన‌త్వం అని పాల‌కులు భావిస్తే పెంచాల్సింది కోటాలు కాదు.. కుల‌మ‌తాల‌కు అతీతంగా నాణ్య‌మైన విద్య‌, అంద‌రికీ ఉచితంగా అందించ‌డ‌డం. ప్ర‌పంచీక‌ర‌ణ‌లో తెలివితేట‌ల‌కు ప్రాధాన్య‌త పెరిగింది. అందుకు అనుగుణంగా విద్యావ్య‌వ‌స్థ‌ను మార్చి నిపుణుల‌ను త‌యారుచేయాలి. ఆ త‌ర్వాత ఎవ‌రికి స్థాయికి త‌గిన అవ‌కాశాల‌ను వారు అందిపుచ్చుకుంటారు. అలా కాకుండా… రిజ‌ర్వేష‌న్లే ఉండాల‌ని పాల‌కులు కోరుకున్నంత‌కాలం ఆర్ధిక అంత‌రాలు అలాగే ఉంటాయి. వ‌ర్గాలుగా, మ‌తాల‌వారీగా ప్ర‌జ‌ల మ‌ధ్య విభ‌జ‌న రేఖ‌లు కొన‌సాగుతాయి. మ‌రి ప్ర‌భుత్వాలు న‌డిపిస్తున్న పేద్ద‌లు దేశానికి.. భ‌విష్య‌త్తుకు ఏది మంచిదో అర్ధం చేసుకుని విధానాలు రూపొందించాలి. రిజ‌ర్వేష‌న్ల‌పై నిర్ణ‌యాలు తీసుకోవాలి. రాజ్యాంగం రాసిన నాటి రిజ‌ర్వేష‌న్ విధానంపై స‌మ‌గ్ర స‌మీక్ష జ‌ర‌గాలి. దేశ అవ‌స‌రాల‌కు అనుగుణంగా స‌వ‌రణ‌లు చేయాలి. అప్పుడే వీధికో ఉద్య‌మానికి తెర‌ప‌డుతుంది. కులాల కుంప‌ట్లు త‌గ్గుతాయి. మ‌తాల మంట‌లు ఆరిపోతాయి.

Recommended For You

Comments are closed.