ప్రాంతీయ‌పార్టీల గుండెల్లో రైళ్లు…!

యూపీ ఫ‌లితాల‌తో దేశంలోని ప్రాంతీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్ చేసి మ‌రీ బీజేపీ దూసుకొస్తోంది. ఇంత‌కాలం కుటుంబ పాల‌న‌ల‌కు, వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు ప‌ట్టం క‌ట్టిన ప్రాంతీయ పార్టీల‌కు బీజేపీ చెక్ పెడుతోంది. ప్రాంతీయ వాదాలు, కుల‌, మ‌తాలు, ఉచిత హామీల‌తో అధికారం త‌మ గుప్పిట్లో పెట్టుకున్న పార్టీల ఆట‌లు ఇక ఎంతోకాలం సాగవ‌న్న సంకేతాలు జ‌నం తీర్పు ఇస్తోంది. పార్టీలు బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తార‌ని యూపీ ఫ‌లితాలు స్ప‌ష్టం చేశాయి. కుటుంబ క‌ల‌హాలు, అభివృద్ధికి దూరంగా మ‌తం, కుటుంబ‌స‌భ్యుల‌కే డ‌జ‌న్ల కొద్దీ సీట్లు ఇస్తూ రాజ‌కీయాల‌ను అప‌హ‌స్యం చేసి ఎస్పీకి ప్ర‌జ‌లు గ‌ట్టిగానే బుద్ది చెప్పారు. అటు పంజాబ్‌లో కూడా కాంగ్రెస్ విజ‌యానికి స‌రిగ్గా ఇవే కార‌ణాలు. బాద‌ల్ కుటుంబం నుంచి చెప్పుకోలేని బాధ‌లు ప‌డ్డ ప్ర‌జ‌లు అకాళీద‌ల్‌ను  ఘోరంగా ఓడించారు. ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కించుకునేందుకు ఈ రెండు పార్టీలు క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. కేవ‌లం ఎన్నిక‌ల నాటికి ఉచిత హామీలు ఇచ్చి.. కుల‌, మ‌త రాజ‌కీయాల‌తో ప్రోత్స‌హించి గ‌ట్టెక్క‌వ‌చ్చ‌న్న అభిప్రాయం ప్రాంతీయ పార్టీల్లో బ‌లంగా ఉంది. సిద్దాంతాలు, విధానాలు లేకుండా జ‌నాల‌ను ఇంకా ఓటుబ్యాంకుగా చూస్తున్నారు. కానీ ఇక ఎంత‌మాత్రం ఇలాంటి రాజ‌కీయాల‌ను స‌హించ‌బోమ‌ని.. భావిత‌రాల‌కు ఏది మంచిద‌నుకుంటే ఎవ‌రు అభివృద్ది చేస్తార‌ని విశ్వాసం క‌లిగితే వారికే ఓటేస్తామ‌ని యూపీ ఓట‌ర్లు స్ప‌ష్టం చేశారు. అధికారంలో ఉన్న‌వారు అడ్డగోలు నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడితే ప్ర‌త్యామ్నాయం వైపు చూస్తామ‌ని  పంజాబ్  జ‌నాలు తీర్పునిచ్చారు. ద‌శాబ్దాలుగా విసిగిన యూపీ ప్ర‌జ‌లు మార్పు కోరుకున్నారు. అభివృద్ధి లేకుండా కేవ‌లం సెక్యుల‌ర్ అనే ప‌దాలు వినీ వినీ విసిగిపోయారు. అందుకే ఈ తీర్పు ఇచ్చారు. ఇత‌ర రాష్ట్రాల్లోని  ప్రాంతీయ శ‌క్తుల‌కు ఇదో గుణ‌పాఠంగా మారుతుంది. పార్టీల‌కు విధానాలు కావాలి. విద్యా, వైద్యం, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేవిధంగా మానిఫెస్టో నింపాలి. అలా కాకుండా కుక్క‌ర్లు… కంప్యూట‌ర్లు.. సైకిళ్లు, బైకులు అంటే ఉచిత‌ హామీల‌తో దార్శ‌నిక ప‌త్రాలు నింపుతున్నారు. క‌ష్ట‌ప‌డి ఎలా వ్య‌క్తిగ‌త స‌దుపాయాలు స‌మ‌కూర్చుకునే విధంగా  ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నం ఉండాలి. వారికి చేదోడుగా ఉండాలి. కానీ.. ఉచితంగా ఇచ్చి.. మౌలిక స‌దుపాయాల‌కు ఖ‌ర్చు చేయాల్సిన డ‌బ్బును ఇలా అప్ప‌నంగా ఓటుబ్యాంకు కోసం దోచిపెట్ట‌కూడ‌ద‌ని ఇక‌నైన పార్టీలు గుర్తించాలి. ఓటుబ్యాంకు రాజ‌కీయాలు మానుకోవాలి. యూపీ నుంచి పాఠాలు నేర్చుకుంటే పార్టీలుంటాయి.. లేదంటే క‌నుమ‌రుగువుతాయి. మిగిలినా తోక‌పార్టీలుగా మిగులుతాయి.

Recommended For You

Comments are closed.