పోలీస్‌.. లైఫ్‌లో నో రిలీఫ్

వేళాపాలా లేని విధులు. స‌మ‌య పాల‌న పాటించ‌డం సాద్యం కాని బాధ్యతలు. ఊరు దాటినా డ్యూటీలో ఉన్న‌ట్టే. ఎక్క‌డ ఉన్నా క్ష‌ణాల్లో వాలిపోవాల్సిన బతుకులు. పావుగంట సేపు ఎండ‌లో ట్రాఫిక్ ఆగిపోతే ఒంటిపై చెమ‌ట‌ను తుడుచుకుంటూ పోలీసులు ఏడ చ‌చ్చారు.. ట్రాఫిక్ కంట్రోల్ చేయరా? అంటూ ఎదురుగా వాళ్లు ప‌డుతున్న క‌ష్టాన్ని చూస్తూ కూడా మ‌న‌సులో తిట్టుకుంటాం. మ‌న బాధ అర‌గంట మాత్ర‌మే కానీ వాళ్లు గంట‌ల కొద్దీ ఎండ‌లో మండుతూ, వానకు తడుస్తూ వ‌చ్చి పోయే వాహ‌నాల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తూ ప‌డే శ్ర‌మ రోజంతా. ఉద‌యం నుంచి సాయంత్రం దాకా.. ఒక్కోసారి అర్ధ‌రాత్రి దాకా డ్యూటీలోనే మ‌గ్గిపోవాల్సిందే. సిటీలో తిరుగుతూ ప్ర‌జ‌ల ర‌క్ష‌ణే ధ్వేయంగా ముందుకు సాగే వారి సేవ‌లు మ‌రిచిపోగ‌ల‌మా.. తీవ్ర‌వాదులు న‌డిరోడ్డు మీద తిరుగుంటే తిర‌గ‌బ‌డి వారిని చంపి ప్రాణాలు వ‌దిలిన సిద్ద‌య్య వంటి వాళ్ల త్యాగాల‌ను యాది చేసుకోకుండా ఉండ‌గ‌ల‌మా? అవును పోలీసులు మ‌న కోసం.. మ‌న ప్రాణ‌, మాన, థ‌న ర‌క్ష‌ణ కోసం ఉన్నారు. వారికి క‌డుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది మ‌న‌మే. త‌ప్పులు అన్ని చోట్లా ఉంటాయి. అంద‌రూ ఒకలా ఉండ‌రు. ఒక‌రు త‌ప్పు చేశార‌ని మొత్తం కుటుంబాన్ని త‌ప్పుబ‌ట్ట‌డం పొరపాటు అలాగే పోలీసుల్లో ఒక‌రిద్ద‌రు క‌క్కుర్తి ప‌డినా మిగిలిన వాళ్లు మంచోళ్లు కాద‌ని అన‌డం స‌మంజ‌స‌మూ కాదు.

రోడ్డు మీద ప‌హ‌రా కాస్తుంటే ఆప‌కుండా ఢీకొట్టి పోయే వాహ‌నాలు, అడ‌వుల్లో కాప‌లా కాస్తే మ‌ట్టుబెడుతున్న స్మ‌గ్ల‌ర్లు, న‌గ‌రాల్లో రెచ్చిపోతున్న తీవ్ర‌వాదులు ఇవ‌న్నీ త‌ట్టుకుని మ‌న‌కు సేవ‌లు అందిస్తున్నారు. ఒకప్పుడు శాంతిభద్రతలు మాత్రమే వారి విధగా భావించేవారు. కానీ ఇప్పుడు సమాజంలో వారు భాగం అవుతున్నారు. పుష్కరాలు వస్తే  పెద్దలు, పిల్లలకు సాయంగా ఉండి వారికి దగ్గరుండి స్నానం చేయిస్తున్నారు. గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హరిత హారం వంటి పర్యావరణ కార్యక్రమాలను బాధ్యతగా తీసుకుంటున్నారు. జనంలో మమేకం అయి ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు వమ్మో పోలీస్.. ఇఫ్పుడు మన పోలీస్. అలాంటి వారిని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం మ‌న‌కూ ఉంది. ఏపీ డీజీపీ సాంబ‌శివ‌రావు చెప్పిన‌ట్టు పోలీసులు ప‌నిలేక కొలెస్ట్రాల్ పెర‌డ‌గం లేదు. స‌మ‌యానికి నిద్రాహారాలు లేక అలా లావెక్కుతున్నారు. అది బలుపు కాదు.. కడుపులో వ్యాధి రూపంలో పెరుగుతున్న బలహీనత.

విజ‌య‌వాడ‌లో 5వేల మంది పోలీసుల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేస్తే అందులో 37శాతం మంది వివిధ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలింది. అందులో 80శాతం మందికి తమ ఒంట్లో వ్యాధులు ఉన్నట్టు కూడా తెలియ‌దు. అందుకే ఇప్పుడు రాష్ట్రం మొత్తం పోలీసుల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయించాల‌ని ఏపీ డీజీపీ నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వాలు కూడా వారి ప‌ట్ల శ్ర‌ద్ద పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఎక్క‌డైనా ఉద్యోగి బాగుంటే ఆ వ్య‌వ‌స్థ మెరుగ్గా ఉంటుంది. పోలీసులు ఆరోగ్యంగా ఉంటే.. శాంతి భ‌ద్ర‌తలు ఇంకా మెరుగ్గా ఉంటాయి. మరి పోలీసులకే కాదు.. వారి కుటుంబాలకు భ‌రోసా ఇవ్వాల్సిన బాధ్య‌త మ‌న‌పైనా ఉంది. దేశ రక్ష‌ణ‌లో సైనికులు ఎంత కీల‌క‌మో.. అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌లో మ‌న పోలీసులు అంతే అవ‌స‌రం.

పోలీస్ అమ‌ర‌వీరుల దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రజారక్షణలో సేవలందిస్తున్న పోలీసులకు వందనాలు. అమ‌ర‌వీరుల‌కు న్యూజ్ అప్‌డేట్స్ నివాళులు అర్పిస్తోంది.

Recommended For You

Comments are closed.