కొత్త పార్టీ పెట్టి కేసీఆర్‌ను ఢీకొట్ట‌గ‌ల‌రా?

తెలంగాణ‌లో రాజ‌కీయంగా ఇప్పుడు అనిశ్చితి ఏమీలేదు. త‌మిళ‌నాడు త‌ర‌హాలో ఎలాంటి సంక్షోబాలు క‌నిపించ‌డం లేదు. పైగా రాజ‌కీయంగా కేసీఆర్ త‌న పార్టీని సుస్థిరం చేయ‌డ‌మే కాదు.. ఇత‌ర పార్టీల్లో స‌మ‌ర్ధులైన నేత‌ల‌ను త‌న దారికి తెచ్చుకుని తిరుగులేకుండా చేసుకున్నారు. అటు కాంగ్రెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా త‌డ‌బ‌డుతున్నా.. నేత‌ల‌కు కొద‌వ‌లేదు. పైగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరిగితే అందిపుచ్చుకోవ‌డానికి సిద్దంగా ఉంది. పైగా తెలంగాణ ఇచ్చిన సానుభూతి కూడా అద‌నపు బ‌లం.  ఈ రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య బ‌ల‌మైన క్యాడ‌ర్ బీసీ వ‌ర్గాల్లో ప‌ట్టు ఉన్న తెలుగుదేశం పార్టీనే త‌ట్టుకోలేక చ‌తిక‌ల‌ప‌డుతోంది. చంద్ర‌బాబు ఆశ‌లు వ‌దులుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో మేమున్నామంటూ కొంద‌రు రాజ‌కీయ పార్టీలు పెట్ట‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. వాస్త‌వానికి తెలంగాణ‌లో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కొత్త‌పార్టీకి అవ‌కాశాలు త‌క్కువే. కేవ‌లం ఉద్య‌మ నాయ‌క‌త్వ అనుభ‌వ‌మే పార్టీ ఏర్పాటుకు అర్హ‌త కాదు. కేసీఆర్ ఉద్య‌మంతో పాటే రాజ‌కీయ‌పోరాటం చేశారు. వైఎస్‌, చంద్ర‌బాబు, కిర‌ణ్‌కుమార్ రెడ్డి వంటి క‌రుడుగ‌ట్టిన స‌మైక్య‌వాదుల‌ను ఢీకొట్టారు. అంతే కాదు.. త‌న‌కు బ‌లం ఉంది.. కుటుంబ అండ ఉంది. దీని వ‌ల్లే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను త‌ట్టుకుని ఎన్నిక‌ల క్షేత్రంలో నిలిచారు గెలిచారు. కానీ ఇప్పుడు పార్టీలు పెడ‌తామంటున్న ఉద్య‌మ క్యాడ‌ర్ పార్టీని స‌మ‌ర్ధ‌వంతంగా న‌డిపించే శ‌క్తియుక్తులు అనుమాన‌మే. కేసీఆర్‌కు రాజ‌కీయాల్లో అరుదైన ల‌క్ష‌ణాలున్నాయి. వైఎస్‌లా ధైర్యం ఉంది.. చంద్ర‌బాబు చాణ‌క్యం ఉంది. రెండు క‌లిస్తే కేసీఆర్. ఇప్పుడు తెలంగాణ‌లో అలాంటి నాయ‌కుడిని ఢీకొట్టి న‌డిపించ‌గ‌లిగిన వారు మ‌రొక‌రు క‌ష్ట‌మే. పార్టీలు పెడ‌తామంటున్న వారికి అస‌లు జ‌నాల్లో ఇమేజ్ లేదు. పైగా చాలామందికి వారి పేర్లు కూడా తెలీదు. ఇది పార్టీ పెట్టాల‌నుకుంటున్న వారికి కూడా తెలిసిన విష‌య‌మే. పైగా రాజ‌కీయ పార్టీ న‌డ‌ప‌డం అంటే అంత సుల‌భం కాదు.. ఆర్ధిక వ‌న‌రుల అవ‌స‌రం ఉంటుంది. వాటికోసం జ‌నాల వ‌ద్ద చందాల‌కు తిర‌గాల్సిన ప‌రిస్థితి. ఇది ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు సంకేతాలు పంపే అస్కారం ఉంది. డ‌బ్బులు దండుకోవ‌డానికే పార్టీనా అన్న మాట‌లు ఎదుర‌వుతాయి. తెలంగాణ ఉద్య‌మంలో యాక్టీవ్‌గా ప‌నిచేశామ‌ని.. రాజ‌కీయాల్లో భాగ‌స్వామ్యం ఉండాల‌ని కోరుకోవ‌డం త‌ప్పు కాదు. దీనికోసం కొత్త పార్టీని పెట్టాల‌నుకోవ‌డ‌మే సాహ‌సం. ప్ర‌స్తుత న‌డుస్తున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో  ఉన్నపార్టీల్లోఏదో ఒక‌టి ఎంచుకుని ప‌నిచేయ‌డం మేలంటున్నారు విశ్లేష‌కులు. సొంతంగా ఎద‌గాల‌నుకోవ‌డం ఆకాశానికి నిచ్చెన వేయ‌డ‌మే అంటున్నారు. మొత్తానికి 2019 నాటికి తెలంగాణ‌లో చాలాపార్టీలే పోటీకి సిద్ద‌మ‌వుతున్నాయి. తెలుగు చాన‌ల్స్, పార్టీలు ఇబ్బడిముబ్బ‌డిగా పెరిగిపోతున్నాయి. మ‌నుగ‌డ గురించి ఆలోచించ‌డం లేదు.

Recommended For You

Comments are closed.