స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ కూడా నిరూపించుకోవాలా?

యూరీ ఘ‌ట‌న త‌ర్వాత దేశ యావ‌త్తు ఉడికి పోయింది. పాకిస్తాన్ కుట్ర‌లపై ప్ర‌తిఒక్క‌రూ ర‌గిలిపోయారు. ప్ర‌తీకారం తీర్చుకోవాల్సిందే అన్న వాద‌న తెర‌మీద‌కు వ‌చ్చింది. అలాగ‌ని యుద్ధం చేయ‌లేని ప‌రిస్థితి. పాకిస్తాన్ కొత్త‌గా మునిగేది లేదు..కానీ యుద్ధంలో గెలిచినా తీవ్రంగా న‌ష్ట‌పోయేది భార‌త్. సందేహం లేదు. అలాగ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మౌనంగా ఉన్నా అది దేశ ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు పోతాయి. మోడీకి ఇది అగ్నిప‌రీక్షే. అందుకే త‌న‌దైన శైలిలో స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌తో స‌మాధానం చెప్పారు. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్ర‌వాదుల‌ను తుద‌ముట్టించారు. సీక్రెట్ ఆప‌రేష‌న్ ద్వారా ప‌క్కాగా స్కెచ్ వేసి తెల్లారే స‌రికి ఆప‌రేష‌న్ ముగించారు. దీనికి యావ‌త్ దేశం పొంగిపోయింది. అన్ని పార్టీలు ముక్త‌కంఠంతో స్వాగ‌తించాయి. దేశ పరాక్ర‌మానికి జేజేలు ప‌లికారు.

అయితే న‌రేంద్ర మోడీ అఖిల‌ప‌క్షం పెట్టిన త‌ర్వాత కొంత‌మంది ఆయన‌ వ్య‌తిరేకుల్లో సందేహాలు మ‌దిలో మెదులుతూనే ఉన్నాయి. అదే స‌ర్జిక‌ల్ స్ల్రైక్స్ అసలు జ‌రిగియా? జ‌రిగితే ఎందుకు ఆధారాలు బ‌య‌ట‌పెట్ట‌లేదు. ఇదే సందేహంతో బ‌య‌ట‌కు వ‌చ్చారు. కానీ ఈ వేడిలో అనుమానాలు వ్య‌క్తం చేస్తే దేశ ప్ర‌జ‌లంతా కూడా త‌మ‌ను త‌ప్పుగా అర్ధం చేసుకుంటార‌ని మౌనం దాల్చారు. కానీ ఇటు అంత‌ర్జాతీయ మీడియా, అటు పాకిస్తాన్ నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న సందేహాల‌ను ఆధారంగా చేసుకుని ఇప్పుడు త‌మ బాణాలు క్ర‌మంగా వ‌దులుతున్నారు. మేము అడ‌గ‌డం లేదు. అంత‌ర్జాతీయ మీడియాలో వ‌స్తున్న క‌థనాల‌కు స‌మాధానం చెప్పాలంటూ కాంగ్రెస్, ఆప్ వంటి బీజేపీ వ్య‌తిరేక పార్టీలు స్వ‌రం పెంచుతున్నాయి. భార‌తీయ సైన్యం ప‌రాక్ర‌మాలు మాకు తెలుసు. కానీ స‌ర్జిక‌ల్ దాడుల‌కు సంబంధించి ఒక్క ఆధారం కూడా ఎందుకు విడుద‌ల చేయ‌లేదంటూ విపక్షాలు ప్ర‌శ్నించ‌డం మొద‌లుపెట్టాయి.

వీరందరిలో సందేహాలు ఒక‌టే.. గ‌తంలో మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దులో దాడులు చేసిన‌ప్పుడు భారీగా ప్ర‌చారం చేశారు. పాకిస్తాన్ విష‌యంలో ఎందుకు ఆధారాలు బ‌య‌ట‌పెట్ట‌డం లేదంటున్నాయి. అస‌లు జ‌ర‌గ‌లేదు మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నారు అని పాకిస్తాన్ ప‌త్రిక‌లు అంటున్నాయి. కానీ ఈ వాద‌న‌లో నిజంలేదు. మ‌య‌న్మార్ విష‌యంలో ఎవ‌రికీ అభ్యంత‌రాలు లేవు. పైగా భార‌త్ ఆదేశంలో క‌లిసి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంది. పాకిస్తాన్ విష‌యం అలా కాదు.. రెండూ అణుబాంబులు క‌లిగిన దేశాలు. ఉద్రిక్త‌త‌లు ఉన్నాయి. పాకిస్తాన్ తీవ్ర‌వాదుల‌ను ఏరివేయ‌డానికి అని చెప్పినా అంగీక‌రించ‌దు. అందుకే ఆప‌రేష‌న్ ర‌హ‌స్యంగా ఉంచారు. తెలిసిన త‌ర్వాత ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు ఎంత ఏ స్థాయిలో ఉన్నాయో జనాలకు అర్ధ‌మైంది. వాళ్లు చెబుతున్న‌ట్టు వీడియోలు, ఫొటోలు వంటి ఆధారాలు బ‌య‌ట‌పెడితే టెన్ష‌న్ మ‌రింత పెర‌గ‌దా? అందుకే మోడీ ఇంత క్లిష్ట ప‌రిస్థితుల్లో కూడా స‌మ‌న్వ‌యంతో ఉన్నారు. ఇది అర్ధం చేసుకోకుండా కేవ‌లం విదేశీ ప‌త్రిక‌ల‌ను ఆధారంగా చేసుకుని ఇలాంటి సున్నిత అంశాల‌పై స్పందించ‌డం స‌రికాద‌న్న వాద‌న‌లున్నాయి.

వాస్త‌వానికి మోడీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌పై త‌ప్పుదారి ప‌ట్టించాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాక‌పోయినా.. రేప‌టికి అయిన వాస్తవాలు పక్కా ఆధారాలు బయ‌ట‌ప‌డ‌తాయి. నిజం కాద‌ని తెలిస్తే మోడీ ఆయన ప్రభుత్వం చ‌రిత్రలో హీనులుగా మిగిలిపోతారు. మోడీ త‌న‌కు తానుగా రాజ‌కీయంగా ఉరి బిగించుకోరు.. పైగా దేశభక్తి విష‌యంలోఆయన రాజీప‌డే వ్య‌క్తి కాదు. సో.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేయ‌కుండానే చేశామ‌ని చెప్పుకునేంత అసమర్ధ నాయకుడు కాదు. ఆయన వల్లే పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లి భారత సైన్యాలు దాడులు చేసినా ఏ దేశం ఖండించలేదు. పైగా సమర్ధించాయి. మ‌రి మోడీ పై విమ‌ర్శ‌ల‌కు, అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల క‌థ‌నాల‌కు ఎలా స్పందిస్తార‌న్న‌ది చూడాలి.

Recommended For You

Comments are closed.