స్వామికార్యం.. స్వ‌కార్యం..!

పాత‌నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంలో న‌రేంద్ర‌మోడి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న ఎంచుకున్న స‌మ‌యం కూడా అన్ని విధాలా అధ్బుతం అంటున్నారు ఆర్ధిక‌, రాజ‌కీయ విశ్లేష‌కులు. విపక్షాల‌ను ఇరుకున పెట్ట‌డం ద్వారా రాజ‌కీయంగా స‌క్స‌స్ అయ్యారు. బ‌డ్జెట్‌కు ముందు లోటు లేకుండా క‌రెంట్ ఖాతా స‌హా ఆర్ధిక ఇబ్బందులు అధిగ‌మించేందుకు బ్లాక్‌మ‌నీని త‌న ఖాతాలో వేసుకునే ప‌క్కా ప్ర‌ణాళిక అమ‌లు చేశారు. ఏమైనా మోడీ ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అంటారు దీనిని నిజం చేసి చూపించారు.

యూపీ పార్టీలే టార్గెట్..!
బ్లాక్‌మ‌నీ ల‌క్ష్యంగా పాత‌ నోట్లు ర‌ద్దు చేసినా బీజేపీకి అనుకూలంగా ఉండేలా స‌రైన స‌మ‌యం చూసి ఈ అస్త్రాన్ని వ‌దిలిన‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. యూపీ ఎన్నిక‌లు పార్టీకి అత్యంత కీల‌కం. అక్క‌డ అధికారం ల‌క్ష్యంగా పార్టీ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతుంది. అయితే అక్క‌డున్న కుల‌, మ‌త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు బీజేపీకి ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేక‌పోతున్నాయి. మోడీ ఇమేజ్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌లిసొచ్చినా.. అసెంబ్లీకి వ‌చ్చేస‌రికి స‌మీక‌ర‌ణాలు మారిపోతున్నాయి. మాయావ‌తి మ‌రోసారి ద‌ళిత‌, బ్ర‌హ్మాణ అస్త్రాల‌ను ప్ర‌యోగిస్తున్నారు. ఎస్సీ సంప్ర‌దాయ‌, మైనార్టీ ఓటుబ్యాంకుల‌ను న‌మ్ముకుంది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే పార్టీలు ఫండ్‌ను సిద్దం చేసుకున్నాయి. వాటిని చీల్చి త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాలంటే బీజేపీ స‌రికొత్త వ్యూహాల‌ను అనుస‌రించాల్సిందే. ఓటుకు నోటు రాజ‌కీయాలు చేసే ప్రాంతీయ పార్టీల‌కు పాత‌నోట్లు ర‌ద్దు నిర్ణ‌యం వెలువ‌రించ‌డం సరైన మందుగా భావించారు. ఇంకొక‌టి భారీగా ఎన్నిక‌ల కోసం డ‌బ్బులు సిద్దం చేసుక‌న్న పార్టీలు ఆర్ధికంగా న‌ష్టం జ‌రుగుతుంది. ఎస్పీ, బిఎస్పీలు ఎన్నిక‌ల ఖ‌ర్చుల‌కు మ‌ళ్లీ నిధులు స‌మీక‌రించ‌డం అంత‌సుల‌భం కాదు.. ఇలా యూపీ ఎన్నిక‌లు అనుకూలంగా మ‌లుచుకున్నారు మోడీ. వాస్త‌వానికి కాస్త ఆల‌స్యంగా అమ‌లు కావాల్సిన విధాన‌ప‌ర నిర్ణ‌యం యూపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ముందుగానే అమ‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ రాజ‌కీయ అవ‌స‌రాలు ముందుకునెట్టిన‌ట్టు తెలుస్తోంది. అందుకే నోట్ల స‌ర్దుబాటు కాస్త ఇబ్బంది అయిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చార‌ముంది. బ్లాక్‌మ‌నీకి వ్య‌తిరేకంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో ఆమేజ్ పెరుగుతుంది. అది బీజేపీకి బ‌లంగా మారుతోంది.

బ‌డ్జెట్‌కు ముందు…!
ఇక త్వ‌ర‌లో కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్నారు. ముంద‌స్తుగా ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టి.. ప్ర‌భుత్వ ఖాతాలో జ‌మ అయ్యే న‌ల్ల‌ధ‌నాన్ని కూడా లెక్క‌క‌ట్టి వ‌చ్చే ఆర్ధిక సంవ‌త్స‌రానికి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం మోడీ ల‌క్ష్యమ‌ని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. జిఎస్టీ అమ‌ల్లోకి వ‌స్తే రాష్ట్రాల‌కు త‌గ్గుతున్న ఆదాయాన్ని భ‌రిస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. న‌ల్ల‌ధ‌నంగా వ‌చ్చిన డ‌బ్బులో కొంత భాగం రాష్ట్రాల‌కు కేటాయించ‌డం ద్వారా భ‌ర్తీ చేయాల‌ని మోడీ నిర్ణ‌యించారు. ఇలా కేంద్రంపై అద‌న‌పు భారం ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. తాజా నిర్ణ‌యంతో ఆర్ధిక వ్య‌వ‌స్థ కాసుల‌తో క‌ల‌క‌ళ‌లాడునుంది. ప్ర‌పంచ‌శ‌క్తిగా, అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ల్లో ఒక‌టిగా ఎద‌గ‌డానికి ఈ నిర్ణ‌యం కూడా దోహ‌ద‌ప‌డుతుంద‌ని మోడీ బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు.

మొత్తానికి న‌ల్ధ‌ధ‌నంపై యుద్ధం అంటూ మోడీ స్వ‌కార్యం, స్వామికార్యం నెర‌వేర్చుకుంటున్నారు. ఏ ప్ర‌భుత్వం అయినా విధాన ప‌ర నిర్ణ‌యం తీసుకునేట‌ప్పుడు రాజ‌కీయంగా త‌న‌కు ఎంతో కొంత ప్ర‌యోజ‌నం ఉండాల‌ని కోరుకుంటుంది. ఇప్పుడు బీజేపీ ప్ర‌భుత్వం కూడా ఎంతోకొంత ల‌బ్ది పొందిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Recommended For You

Comments are closed.