ఒక్క‌ నిర్ణయం ఖ‌రీదు రెండేళ్లు సంక్షోభమా…!

అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. బాణం గురి త‌ప్పింది. ల‌క్ష్యం బ్లాకాసురులే అయినా అది దారి త‌ప్పి సామాన్యుల‌కు గుచ్చుకుంది. దీంతో దేశం మొత్తం విల‌విల్లాడుతోంది. మ‌న్ కి బాత్ కూడా మ‌నీకి బాత్ అయింది. న‌ల్ల‌వీరులు త‌ప్పించుకుంటున్నారు. క‌మీష‌న్లు ఇచ్చి బ్యాంకుల్లో య‌ధేచ్చ‌గా నోట్లు మార్చుకుంటున్నారు. బ్లాక్‌మ‌నీ అరిక‌డ‌తామ‌న్నారు.. క‌మీష‌న్ల రూపంలో మ‌ళ్లీ బ్లాక్‌మ‌నీ పెద్ద ఎత్తున చేతుల మారుతోంది. ఉన్న రోగానికి ముందు వేస్తే మ‌ళ్లీ సైడ్ ఎఫెక్ట్‌లు అంటుకున్న‌ట్టుంది ప‌రిస్థితి. ఇప్పుడు 30 శాతం క‌మీష‌న్ న‌డుస్తోంది.. మ‌రి ఇదంతా ఎక్క‌డ‌కు పోతుందో అంచ‌నా వేయ‌గ‌లిగారా? క‌మీషన్ల సంగ‌తి ప‌క్క‌న పెట్టినా సామాన్యుల ప‌రిస్థితి ఏంటి? క‌్ర‌మంగా మోడీకి వ్య‌తిరేకంగా స్వ‌రం ఎందుకు పెరుగుతుంది.

మోడీ నిర్ణ‌యాన్ని ఏ అంత‌ర్జాతీయ‌ ఆర్ధిక నిపుణులు కూడా స్వాగ‌తించ‌డం లేదు. అమ‌ర్య్తాసేన్ వంటి నోబుల్ అవార్డు గ్ర‌హీతులు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఒక‌ప్పుడు మోడీని నెత్తిన పెట్టుకున్న అంత‌ర్జాతీయ మీడియా కూడా ఇప్పుడు తూల‌నాడుతోంది. ఆర్ధికంగా ఎదుగుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా సంక్షోభంలోకి నెట్టుకున్నార‌ని క‌థ‌నాలు ప్ర‌చురించాయి. చైనాకు ధీటుగా ఎదుగుతోంది. అగ్ర‌రాజ్యాల కంటే జీడీపీ ఎక్కువ ఉంది. స‌రిగ్గా ప్ర‌పంచ‌దేశాల‌న్నీ పెట్టుబ‌డుల‌కు భార‌త్‌వైపు చూస్తున్నాయి. ఈ స‌మ‌యంలో మోడీ తీసుకున్న‌నిర్ణ‌యం ప్ర‌తికూలంగా మారింది. దేశంలో కొనుగోలు శక్తి లేన‌ప్పుడు ఏ వ్యాపారి ఇక్క‌డ పెట్టుబ‌డి పెడ‌తారు. ఉపాధి అవ‌కాశాలు ఎలా వ‌స్తాయి. మేక్ ఇన్ ఇండియాకు ఇది ప‌రీక్షా కాల‌మే అంటున్నారు. డిజిట‌ల్ ఇండియా అంటూ రాత్రికిరాత్రి అంద‌రూ ఆన్‌లైన్ బ్యాంకింగ్ వాడాల‌న‌డం సరి కాద‌ని గుర్తు చేస్తున్నారు. 86శాతం మంది ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా త‌మ సంప్ర‌దాయ ప‌ద్దుతుల‌ను మార్చుకోవాల‌ని ఒత్తిడి తేవ‌డం స‌బ‌బు కాదని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చైనా సంక్షోభం ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ‌చ్చింది. కానీ మ‌న‌ది స్వయంకృతాప‌రాధం అంటున్నారు.

ఏదైనా త‌న‌దాకా వ‌స్తే కానీ తెలీదంటారు.. ఇప్పుడు అంబానీలు, అదానీలు కూడా రిటైల్ వ్యాపారాలు ప‌డిపోవ‌డంతో మోడీ నిర్ణ‌యంపై పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌లు ఎవ‌రూ స‌మ‌ర్ధించ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. జ‌నాలు కొనుగోలుకు ఆస‌క్తి చూప‌డం లేదు. దీంతో న‌గ‌దు చ‌లామ‌ణి త‌గ్గిపోయి మార్కెట్‌లో సంక్షోభం త‌లెత్తుతోంది. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల నుంచి కోలుకోవ‌డానికి క‌నీసం రెండేళ్లు అయినా ప‌డుతుంద‌ని ఆర్ధిక వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. కేబినెట్‌లో కూడా క‌నీసం అభిప్రాయాలు విన‌కుండా.. ఏక‌ప‌క్షంగా తీసుకున్న నిర్ణ‌యంతో ప‌రిణామాలు ఎలా ఉంటాయో మోడీకి అర్ధం కావాలంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను అర్ధం చేసుకోకుండా అగ్ర‌దేశాల స‌ర‌స‌న నిల‌డబ‌డాల‌న్న తాప‌త్ర‌యంలో తీసుకున్న చారిత్రాత్మ‌క త‌ప్పిదం అన్న విమ‌ర్శ‌లు మోడీ ఎదుర్కొంటున్నారు. నిపుణులే కాదు… సామాన్య ప్ర‌జ‌లు కూడా మొద‌ట్లో నిర్ణ‌యాన్ని హ‌ర్షించినా… త‌ర్వాత ఏటీఎం, బ్యాంకుల వ‌ద్ద జ‌రుగుతున్న అవ‌మానాల‌తో బిత్త‌ర‌పోయి ఎందుకు స‌మ‌ర్ధించామా అని బాధ‌ప‌డుతున్నారు. నా డ‌బ్బు నేను డ్రా చేసుకోవ‌డానికి ఆంక్ష‌లా.. అన్న చిన్న వేద‌న వారిలో క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. క‌ష్ట‌ప‌డి సంపాదించిన ప్ర‌తిపైసాకు లెక్క చెప్పాలంటున్న మోడీ పట్ల మ‌ధ్య‌ త‌గ‌ర‌తిలో కూడా క్ర‌మంగా వ్య‌తిరేక‌త పెరుగుతోంది.

Recommended For You

Comments are closed.