మోడీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం సెల్ఫ్‌గోలా?

యూపీ ఎన్నిక‌ల‌కు ముందు న‌రేంద్ర‌మోడీ సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నారా.. బ్లాక్‌మ‌నీపై యుద్ధం ప్ర‌క‌టించ‌డం ద్వారా యూపీలో ప్ర‌త్య‌ర్ధుల‌ను ఇరుకున పెడ‌దామ‌నుకున్న బీజేపీకే వ్య‌వ‌హారం తిర‌గ‌బ‌డిన‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. యూపీ ఎన్నిక‌ల‌కు జ‌న‌వ‌రిలో షెడ్యూల్ రానుంది. ఫిభ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌ర‌గుతాయి. దాదాపు అన్ని పార్టీలు ఆర్ధికంగా రెడీ అయ్యాయి. నిధులు స‌మ‌కూర్చుకుని సిద్దంగా ఉన్నాయి. అభ్య‌ర్ధులు కూడా టికెట్ల కోసం కోట్ల రూపాయల న‌ల్ల‌ధ‌నం సంచులు ఇళ్ల‌లో పెట్టుకున్నారు. ప్రాంతీయ పార్టీలు బిఎస్సి, అధికార ఎస్పీ ఈ విష‌యంలో అంద‌రికంటే ముందున్నాయి. అందుకే మోడీ బ్లాక్‌మ‌నీపై యుద్ధం విష‌యంలో యూపీ ఎన్నిక‌లు కూడా ఓ భాగ‌మే. ఇక్క‌డ ప్ర‌త్య‌ర్ధుల‌ను ఆర్ధికంగా దెబ్బ‌తీయ‌డంతో పాటు.. తన నిర్ణయంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తి, సంప‌న్న‌, యువ వ‌ర్గాల‌కు ద‌గ్గ‌ర కావాల‌ని చూశారు. త‌న ఇమేజ్ కూడా ఆకాశ‌మంత పెరుగుతుంద‌ని ఆశించారు. రాత్రికి రాత్రి నిర్ణ‌యం ప్రకటించారు.

రైట్ డెసిషన్.. రాంగ్ టైం

నిర్ణ‌యం స‌రైందే కానీ.. స‌మ‌య‌మే రాంగ్ అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. మోడీ భవిష్యత్తు ప‌రిణామాల‌ను ఊహించ‌లేక‌పోయారన్న వాద‌న‌లున్నాయి. బ్లాక్‌మ‌నీ రాయుళ్లు బ‌య‌ట‌ప‌డ‌తార‌ని భావించారు. కానీ సామాన్యులు ఇలా బారులు తీరి.. ప‌డిగాపులు కాసి.. అస‌హ‌నానికి గురిఅవుతారని ఊహించలేకపోయారు. ముందుగా స్వాగ‌తించిన చంద్ర‌బాబే అస‌హ‌నానికి గుర‌య్యానంటుంటే.. ప్ర‌జ‌లు ఇంకెంత ఆగ్ర‌హంగా ఉండి ఉండాలి. అయితే ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింది. జ‌నాల్లో మోడీ నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త క్ర‌మంగా బ‌ల‌ప‌డుతోంది. ముందుగా స్వాగ‌తించిన వారంతా త‌మ‌దాకా వ‌స్తే కానీ త‌త్వం బోధ‌ప‌డ‌లేద‌న్న‌ట్టు నిర‌స‌న‌ గ‌ళం పెంచుతున్నారు. విద్యాప‌రంగా వెన‌క‌బ‌డి ఉన్న యూపీలో ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. ప్రత్యర్ధులు బలంగా మార్చుకుంటున్నారు. ఇది ఎన్నిక‌ల్లో బీజేపీకి ప్ర‌తికూలంగా మారే ప్ర‌మాదముందని రాజ‌కీయ వ‌ర్గాలంటున్నాయి. అప్ర‌మ‌త్త‌మైన బీజేపీ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల్లో ప‌డింది. మంత్రులు, నాయ‌కులు మీడియాకు అందుబాటులోకి వ‌స్తున్నారు. ఏ ప‌త్రిక‌ను, ఛాన‌ల్‌ను వ‌ద‌ల‌డం లేదు. అటు అమిత్ షా కూడా అరుణ్‌జైట్ల‌తో స‌మావేశ‌మై భ‌విష్య‌త్తుపై చ‌ర్చించారు.

బ్యాంకులూ దారి తప్పించాయి..

వాస్త‌వానికి ఏ వ‌ర్గాన్ని టార్గెట్ చేసి.. క్రేజ్ సంపాదించాల‌ని భావించారొ అదే బ్లాక్ రాయుళ్లు కాలుమీద కాలేసుకుని డ‌బ్బు మార్చుకుంటున్నారు. సంపన్నులు బ్యాంకు ముఖం చూడడం లేదు. కానీ పొట్టికూటికోసం ప‌నిచేసేవాళ్లు.. రైతులు, బిడ్డ‌ల చ‌దువులు, పెళ్లిళ్ల‌కు డ‌బ్బులు దాచుకున్న పేద‌లు రోడ్డున‌ప‌డ్డారు. మోడీ ఆలోచించి ఇంకొంచెం క‌స‌ర‌త్తు చేసి జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే ఈ గండం నుంచి బ‌య‌ట‌ప‌డేవారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో అగ్గికి ఆజ్యం పోసిన‌ట్టు ఎస్‌బిఐ లాంటి త‌ల‌కుమాసిన బ్యాంకులు పెద్ద‌ల రుణాలను రైట్ ఆఫ్ చేసి విప‌క్షాల‌కు మ‌రింత అస్త్రం అదించాయి. బ్యాంకింగ్ రంగంలో, ఆర్ధిక వ్య‌వ‌హారాల్లో రైట్ ఆఫ్‌ స‌హ‌జ‌ప్ర‌క్రియే కానీ ఎస్‌బిఐ తీసుకున్న నిర్ణ‌యం స‌మ‌యం మోడీ మెడ‌కు చుట్టుకుంది. ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పేద‌లు డిపాజిట్ చేస్తున్నారు క‌దా అని పాత బ‌కాయిల‌ను బ్యాలెన్స్ షీట్ నుంచి ప‌క్క‌న పెట్టారు. నిజం కాకపోవచ్చు కానీ ర‌ద్దు చేస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌నాల్లోకి పోయింది. అది కూడా మోడీకి వ్య‌తిరేకంగా మారింది. మ‌రి బీజేపీ, మోడీ ఈ గండం నుంచి క్షేమంగా ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.?

Recommended For You

Comments are closed.