ఏపీ ఎగ్జిట్ పోల్స్ 19నే.. తెలంగాణ లెక్క కూడా అప్పుడే?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తాను చేయించిన సర్వే.. ఎగ్జిట్ పోల్స్ వివరాలు కూడా ఈ నెల 19న మీడియా సమక్షంలో వెల్లడిస్తానని లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు.  సర్వే నివేదిక వచ్చిందని..అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో బయటపెట్టడం సాధ్యం కాదని అంటున్నారు. చివరి దశ ఎన్నికల ముగిసిన రోజే సాయంత్రం బహిర్గతం చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన త్వరలోనే ఇండియాకు రానున్నారు. లగడపాటి రాజగోపాల్ అమెరికా పోవడానికి కారణం కూడా సర్వేనంటున్నారు. ఇక్కడ ఉంటే నాయకులు ఫోన్లు చేసి రిపోర్ట్ అడుగుతున్నారట…

పార్టీ సంగతి అలా ఉంటే.. వ్యక్తిగతంగా తామె గెలుస్తామా లేదా అని విసిగిస్తున్నారట. అందుకే ఫ్యామిలితో అమెరికా చెక్కేశారు. గత 20  ఏళ్లుగా సర్వేలు ఖచ్చితంగా చెప్పిన లగడపాటి తెలంగాణ విషయంలో మాత్రం బోల్తా పడ్డారు. మహాకూటమి వస్తుందని చెప్పారు. కానీ టిఆర్ఎస్ స్వీప్ చేసింది. అయినా  ఆయన ఏపీపై ఇచ్చే సర్వే కోసం జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. అంతేకాదు. బెట్టింగ్ రాయుళ్లు కూడా ఆయన్న ఇచ్చే లీకులు  ఆధారంగా పందేలు కాస్తున్నట్టు తెలుస్తోంది. మరి లగడపాటి సర్వే ఏం చెబుతోంది? ఆయన అమెరికాలో టీడీపీ కార్యకర్తల కార్యక్రమంలో పాల్గొని తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తారా అంటూ పెదవి విరుస్తున్నారు వైసీపీ నాయకులు. ఇక తెలంగాణలో తన లెక్క తప్పడానికి కారణాలు కూడా ఆయన వివరించనున్నారట. సర్వేలు ఎందుకు తేడా వచ్చింది… అసలు ఏం జరిగింది అనే అంశాలపై స్పష్టత  ఇస్తానని… సమగ్ర సమాచారం అంతా వచ్చిందని అంటున్నారు. మరి ఆంధ్రా అక్టోపస్ ఏం చెబుతారో చూడాలి.

Also Watch:

Recommended For You