కోమటిరెడ్డి బీజేపీలో ఎందుకు చేరడం లేదంటే

మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు బీజేపీలోకి ఎందుకు చేరలేదని చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఆయన పార్టీ మారతారనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది. కాంగ్రెస్ ను వీడే కోమటిరెడ్డికి తెలంగాణలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు కమలం పెద్దలు సిద్దంగా ఉన్నారనే వాదనొచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా ఆయన కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంటారనుకున్నారు. కానీ పుకార్లకు తాత్కాలికంగా పుల్ స్టాప్ పడింది. ఇందుకు బలమైన కారణాలున్నాయంటున్నారు. ఇప్పటికిప్పుడు కోమటిరెడ్డి పార్టీ మారి..బీజేపీ కండువా కప్పుకుంటే సాంకేతికంగా ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడయ్యే వీలుంది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరకూడదు. గతంలో అలా చేయకపోయినా ఇటు కేసీఆర్,అటు చంద్రబాబులు ఫిరాయింపుదార్లకు మంత్రి పదవులు ఇచ్చారనుకోండి. అది వేరే సంగతి. తెలంగాణలో అధికారంలో ఉంది టీఆర్ఎస్ కాబట్టి. తాను పార్టీ మారితే కచ్చితంగా వేటు పడే వీలుందని కోమటిరెడ్డి భావిస్తున్నారట. అందుకే ఆ పని చేయడం లేదు. అంతే కాదు..కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులిచ్చింది. నేను గీతదాటలేదని సమాధానమిచ్చాడు మరోవైపు కోమటిరెడ్డి. దీంతో ఆయన పై చర్యలు తీసుకోలేకపోతోంది కాంగ్రెస్. కోమటిరెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపాలని విహెచ్ లాంటి నేతలు గట్టిగానే కోరుతున్నా..కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేయలేకపోతోంది. పార్టీ నుంచి వారికై వారే బయటకు పంపితే కోమటిరెడ్డి పని సులువవుతోంది. అప్పుడు ఏ పార్టీలోనైనా కోమటిరెడ్డి చేరవచ్చు. అందు కోసం ఎదురు చూస్తున్నాడు. సాంకేతిక కారణాలే తప్ప..కోమటిరెడ్డి చేరక పోవడానికి మరో అంశం లేదంటున్నారు. మరి దీని పై కోమటిరెడ్డి నోరు విప్పితేగానీ నిజాలు బయటకు రావు.
Also Watch:

Recommended For You