గులాబీలో ఖ‌మ్మం గుబులు..!

ఖమ్మం రాజకీయాలు చక్క దిద్దడం టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తలకుమించిన భారంగామారాయి. ఇప్ప‌టికే స‌ర్వేల్లో ప్ర‌తికూల ప‌వ‌నాలు వీస్తున్న‌ట్టు సంకేతాలు అందాయి. ఎలాగైనా గెలుచుకుని ద‌క్షిణ తెలంగాణ‌లో కీల‌క జిల్లాగా ఉన్న ఖ‌మ్మంలో పాగా వేయాల‌ని చూస్తున్న అధినేత‌కు గ్రూపు రాజ‌కీయాలు ద‌డ పుట్టిస్తున్నాయి.. ఏమాత్రం బ‌లం లేని జిల్లాలో తుమ్మ‌ల రాక‌తో పార్టీకి బ‌లం, బ‌ల‌గం వ‌చ్చింది.. కార్పొరేష‌న్ ఎన్నిక‌లు స‌మ‌యంలో ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్‌, అంత‌కుముందు ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి చేరిక‌తో మ‌రింత ఊపు వ‌చ్చింది. ఇదంతా బ‌లంగా మారి.. 2019లో తిరుగులేని ఆధిక్యం సాధిస్తామ‌ని గులాబీ బాస్ భావించారు. కానీ అంచ‌నాలు త‌ల‌కిందులు అవుతున్నాయి. పార్టీకి ఎవ‌రైతే బ‌లం అనుకున్నారో.. వారే బ‌ల‌హీనంగా మారుత‌న్నార‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. స‌మ‌న్వ‌యం లోపించి.. జిల్లాలో మూడువ‌ర్గాలుగా విడిపోయింది పార్టీ. మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు, ఎంపీ పొంగులేటికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఎవ‌రి రాజ‌కీయం వారిదే.. తుమ్మ‌ల వ‌ర్గంగా ఉన్న కొంద‌రు ఎమ్మెల్యేల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో మారిస్తే త‌ప్ప‌.. తాను ఎంపీగా పోటీచేయ‌న‌ని పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కేసీఆర్‌కు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. తుమ్మ‌ల వ‌ర్గం కాకుండా… త‌న వ‌ర్గానికి చెందిన వారి పేర్లు ప్ర‌తిపాదించిన‌ట్టు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా తుమ్మ‌ల వ‌ర్గం త‌న‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని.. ఆయ‌న ఫిర్యాదు చేశార‌ట అటు ముచ్చ‌ట‌గా మూడోవ‌ర్గం పువ్వాడ అజ‌య్‌.. కొంత‌కాలంగా పువ్వాడ‌కు, తుమ్మ‌ల‌కు మ‌ధ్య గ్యాప్ భారీగా పెరిగింది. కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌లో ఇది మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. అప్ప‌టి నుంచి మంత్రిపై పువ్వాడ కారాలు మిరియాలు నూరుతున్నారు. వీరు ముగ్గురు క‌లిసి పార్టీ మీటింగ్ పెట్టిన సంద‌ర్భం అరుదు. పార్టీ కార్యాలయానికి రారు.. ఎవ‌రి క్యాంపు కార్యాల‌యం వారిదే. ఇక కొత్త‌గూడెం ఎమ్మెల్యే వెంక‌ట్రావు ఎవ‌రితోనూ స‌ఖ్య‌త‌గా ఉండ‌డం లేదు. ఆయ‌న రూటే స‌ప‌రేటు అంటున్నారు. అక్క‌డ ఎంపీ పొంగులేటి వ‌ర్సెస్ జ‌ల‌గం వార్ తారాస్థాయికి చేరింది. ఇలా ఎవ‌రికి వారు సొంత వ‌ర్గాల‌ను ప్రోత్స‌హించి పార్టీలో కేడ‌ర్ ను అయోమ‌యంలో ప‌డేస్తున్నారు.. వీరి తీరు ఇలాగే ఉంటే… జిల్లాలో ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేనంటున్నారు గులాబీ శ్రేణులు. కేసీఆర్ చ‌రిష్మా.. సంక్షేమ ప‌థ‌కాలు కూడా గెలిపించ‌లేవ‌ని అంటున్నారు.

Watch:

Recommended For You