ఖ‌మ్మం అసెంబ్లీలో గెలుపును శాసించేదెవరు?

ఖ‌మ్మం అసెంబ్లీ సీటుపై జిల్లాలో ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ జ‌రుగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ అభ్య‌ర్ధుల కంటే డ‌బ్బే ఫ‌లితాన్ని శాసించ‌నుంద‌ని బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా పోటీచేసి గెలుపొందారు. అయితే త‌ర్వాత కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న అధికార పార్టీ టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. గ‌తంలో ఉన్నంత సానుకూలతలు ఇప్పుడు క‌నిపించ‌డం లేద‌ని సొంత పార్టీ నేత‌లే చెబుతున్నారు. అభివృద్ధి విష‌యంలో అందరి కంటే ముందున్నా.. వ్య‌తిరేక‌త ప‌వ‌నాలు మాత్రం వీస్తున్నాయి.

పార్టీ మార‌డం మైన‌స్ అయిందా?
పార్టీ మారార‌న్న వ్య‌తిరేక‌త నియోజ‌క‌వ‌ర్గం ఓట‌ర్ల‌లో బ‌లంగా ఉంది. అయితే ఇది పువ్వాడ అజ‌య్ ఒక్క‌డికే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఉన్న స‌మ‌స్యే ఆయ‌న‌కూ ఉంది. ఇక కాంగ్రెస్ లో ఉన్న‌ప్పుడు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన కేడ‌ర్ అంతా ఆయ‌న‌తో పాటు రాలేదు. కొంత‌మంది ఇంకా ఆ పార్టీలోనే ఉన్నారు. దీనికి తోడు నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపు రాజ‌కీయాలు. తుమ్మ‌ల వ‌ర్గం, ఎంపీ వ‌ర్గం ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసే అవ‌కాశాలున్నాయి. గ‌తంలో తుమ్మ‌ల‌ను కాద‌ని.. ద‌గ్గ‌రైన కార్పొరేట‌ర్లు మ‌ళ్లీ ఆయ‌న‌కు దూరమ‌య్యారు.

టీడీపీ ఫ్యాక్ట‌ర్
ఇక న‌గ‌రంలో ఇప్ప‌టికీ టీడీపీకి బ‌ల‌మైన ఓటుబ్యాంకు ఉంది. గ‌త‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 60వేల ఓట్ల ఆ పార్టీకి వ‌చ్చాయి. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఈ మెజార్టీ త‌గ్గి 20వేల‌కు ప‌రిమితం అయింది నిజ‌మే. కానీ కార్పొరేష‌న్ లో టీడీపీని అభ్య‌ర్ధుల‌ను గెలిపించినా వాళ్లు అధికార పార్టీ గూటికి చేర‌తార‌న్న ఉద్దేశంతో టీడీపీ అభిమానులు పైతం టిఆర్ఎస్ కార్పొరేట‌ర్ల‌ను గెలిపించారు. పైగా టీడీపీకి చెందిన వారే పార్టీ మారి అధికార పార్టీ అభ్య‌ర్ధులుగా ఉన్నారు కాబ‌ట్టి రాజీప‌డ్డారు. కానీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈ ప‌రిస్థితి ఉండ‌దు. టీడీపీ ఓటుబ్యాంకు పువ్వాడ‌కు క‌లిసిరావ‌డం దాదాపు అసాధ్యం. అటు లెఫ్ట్ పార్టీలు కూడా పువ్వాడ‌కు మ‌ద్ద‌తు ఇచ్చేప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

మ‌రి పువ్వాడకున్న బ‌లమేంటి?

పువ్వాడ అజ‌య్ కుమార్ కు ప్ర‌తికూల‌త‌లున్నాయి. కానీ ప్ర‌త్య‌ర్ధి పార్టీల్లో స‌రైన అభ్య‌ర్ధి లేరు. ఇది ఆయ‌న‌కు వ‌రంగా మారుతోంది. ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో మానుకొండ రాధాకిషోర్ ఉన్నారు. కానీ ఆర్ధికంగా పువ్వాడ‌ను ఢీకొట్ట‌లేరు. ఈ మ‌ధ్య పార్టీలో చేరిన పోట్ల నాగేశ్వ‌ర‌రావు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆర్ధికంగా బ‌ల‌మైన అభ్య‌ర్ధి అవుతారు.. కానీ రాజ‌కీయంగా ఆయ‌న వెన‌క‌బ‌డ‌టానికి కార‌ణమే డ‌బ్బులు తీయ‌క‌పోవ‌డం. గ‌తంలో కూడా ఆర్ధికంగా వ‌న‌రులున్నా.. ఖ‌ర్చు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా అవ‌కాశాలు కోల్పోయార‌న్న ముద్ర ఉంది. ఇప్పుడు కూడా పువ్వాడ‌తో పోటీగా డ‌బ్బులు పెట్ట‌లేర‌న్న అభిప్రాయముంది. ఈ సారి పువ్వాడ‌ను ఓడించాలంటే ఎవ‌రైనా ఆయ‌న‌కంటే ఎక్కువ ఖ‌ర్చు చేయ‌గ‌ల‌గిన‌వారు రావాలంటూ జిల్లాలో బ‌హిరంగంగానే చర్చ జ‌రుగుతోంది. అయితే ఓ ప్ర‌ముఖ‌ మీడియా సంస్థ అధినేత, జిల్లాకు చెందిన వ్య‌క్తిని కాంగ్రెస్ పెద్ద‌లు రంగంలో దింపుతారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆయ‌న ఎంపీ సీటు అడుగుతున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఖ‌మ్మం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో శాసించేది డ‌బ్బే అంటున్నారు. మ‌రి ఎవ‌రు ఎంత ఖ‌ర్చు పెట్ట‌డానికి రెడీ అవుతున్నారో.. పెరుమాళ్ల‌కెరుక‌..

Recommended For You