ఊరిస్తున్న ఖ‌మ్మం ఎంపీ సీటు.. అగ్రనేతల పాట్లు…!

ఖ‌మ్మం లోక్‌స‌భ సీటు తెలంగాణ‌లోని ప‌లు పార్టీల అగ్ర‌నేత‌ల‌కు ఊరిస్తోంది. ఇక్క‌డ పోటీచేయ‌డానికి కీల‌క నేత‌లు ఆస‌క్తిచూపిస్తున్నారు. మ‌రికొంద‌రు పార్టీ కోసం పోటీచేయాల్సిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ, టిఆర్ఎస్ నాయ‌కుడు పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి మ‌ళ్లీ పోటీచేయ‌డంపై సందేహాలున్నాయి. ఆయ‌న కొత్త‌గూడెం ఎమ్మెల్యే సీటుపై క‌న్నేశారు. అధికార పార్టీలో మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు క‌నిపించ‌డం లేదు. అయితే కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు అండ‌గా ఉండాల‌ని బావిస్తే తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును ఎంపీగా బ‌రిలో దింపే అవ‌కాశాలున్నాయి. పైగా ఖ‌మ్మం జిల్లాలో పార్టీ ప‌టిష్టంగా ఉంద‌ని చాటాలంటే ఎంపీ సీటు కీల‌కం. గ‌తంలో వైసీపీ త‌ర‌పున గెలిచిన శ్రీనివాస‌రెడ్డి కారెక్కారు. 2019లో సొంతంగా గెల‌వాల‌న్న ల‌క్ష్యంతో ఉంది. కానీ ఇక్క‌డున్న ప‌రిస్థితుల్లో ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. తుమ్మ‌ల అయితేనే స‌మ‌ర్ధుడు అన్న భావ‌న‌లో కేసీఆర్ ఉన్నారు. మ‌రి తుమ్మ‌ల ఎంత‌వ‌ర‌కు మొగ్గుచూపుతార‌న్న‌ది చూడాలి.
ఇక ఈ సీటుపై కాంగ్రెస్ నాయ‌కులు చాలామందే ఆశ‌లు పెట్టుకున్నారు. స‌ర్వేలు అనుకూలంగా ఉండ‌డంతో ఇక్క‌డ నుంచి పోటీచేయ‌డానికి ఆస‌క్తిచూపుతున్నారు. ఇప్ప‌టికే ఖ‌మ్మం ఆడ‌బిడ్డ‌ను సీటు నాదేనంటున్నారు రేణుకాచౌద‌రి. జిల్లాలో విసృతంగా పర్య‌టిస్తూ.. పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న అనుచ‌రుల‌ను స‌మాయ‌త్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి కూడా ఖ‌మ్మం ఎంపీగా పోటీ చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అదిష్టానం వ‌ద్ద ఇప్ప‌టికే ఆయ‌న లాబీయింగ్ మొద‌లుపెట్టారు. ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్ర‌మార్క కూడా త‌న స‌తీమ‌ణి కోసం ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. రాహుల్ వ‌ద్ద త‌న‌కున్న ప‌లుకుబ‌డి ఉప‌యోగిస్తున్నారు. ఇక మ‌రో ఇద్ద‌రు ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌లు అయిన వీవీసీ మోటార్స్ అధినేత వీవీ. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గాయ‌త్రి గ్రానైట్స్‌ ర‌విచంద్ర‌ కూడా ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. వీరి సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. ఇటీవలే మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టీవ్ అయిన మాజీ మంత్రి జ‌ల‌గం ప్ర‌సాద్ కూడా తెర‌మీద‌కు వ‌చ్చారు. జిల్లా వ్యాప్తంగా త‌మ కుటుంబానికున్న ప‌రిచ‌యాల‌ను క‌దుపుతున్నారు. అవ‌కాశం ఇస్తే ఎంపీగా పోటీచేస్తానని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే కాంగ్రెస్ లో అగ్ర‌నాయ‌కుల‌తో కూడిన‌ జాబితా పెద్ద‌గానే ఉన్నా.. పొత్తులు ఉంటే మాత్రం వారి ఆశ‌లకు గండిప‌డుతుంది. టీడీపీతో పొత్తు ఉంటే.. నామా నాగేశ్వరావు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. టీడీపీతో పొత్తు లేక‌పోయినా.. కాంగ్రెస్ లో చేరి పోటీచేయ‌డానికి ఆయ‌న‌ మంత్రాంగం జ‌రుపుతున్నారు. పార్టీ ఏదైనా పోటీ ఖాయ‌మంటున్నారు. అటు సీపీఐ కూడా పొత్తుల్లో భాగంగా సీటు త‌మ‌కు కేటాయించాల‌ని కోరే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే పువ్వాడ నాగేశ్వ‌ర‌రావు పేరు వినిపిస్తోంది. రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పినా.. తిప్పుతున్న నాయ‌కులంతా ఖ‌మ్మం సీటుపై ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి ప్ర‌జ‌ల మ‌న‌సులో ఎవ‌రున్నారో చూడాలి. బ‌హుజ‌న ఫ్రంట్ పేరుతో సొంతంగా పోటీచేస్తామ‌ని చెబుతున్నా మాజీ ఎంపీ త‌మ్మినేని వీర‌భ‌ద్రం పోటీకి పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడిని రంగంలో దింపే అవ‌కాశాలున్నాయి.

Recommended For You