ఖ‌మ్మం ఖిల్లా గులాబీకి గుచ్చుకుంటుందా?

2019లో ఖ‌మ్మం కోట‌ను కొల్ల‌గొట్టాల‌ని చూస్తున్న టిఆర్ఎస్ కు స‌వాళ్లు స్వాగ‌తం ప‌లుకుతున్నాయా.. ద‌క్షిణ తెలంగాణ‌లో పాగా వేయాల‌నుకుంటున్న అధికార‌పార్టీకి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆశాజ‌నకంగా క‌నిపించారు. ఆయ‌న ద్వారానే ఖ‌మ్మం జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించుకుని.. గులాబీ జెండా ఎగ‌రేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా తుమ్మ‌ల చేరిక త‌ర్వాత జిల్లాలో పార్టీ బ‌ల‌ప‌డింది. వ‌ల‌స‌లు వెల్లువెత్తాయి. అంతా అనుకూలంగా మారుతుంద‌ని కేసీఆర్ భావించారు. అయితే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ బీపీ పెరుగుతోంది. ఆశించిన స్థాయిలో ప‌లితం వ‌స్తుందా.. రాదా అన్న టెన్ష‌న్ ప‌ట్టుకుంది. సండ్ర‌, సున్నం రాజ‌య్య‌, భ‌ట్టి మినహా జిల్లాలో ఎమ్మెల్యేలంతా అధికార‌పార్టీకే ఉన్నారు. కానీ వాటిల్లో మ‌ళ్లీ గెలుస్తామ‌ని ధీమాగా చెప్ప‌లేని ప‌రిస్థితులున్నాయి. అదే ఇప్పుడు పార్టీని క‌ల‌వ‌ర‌పెడుతోంది. నాలుగు గ్రూపులున్నాయి. న‌లుగురు నాయ‌కులు ఒక‌రిని మ‌రొక‌రిని ఓడించుకోవ‌డానికి కూడా సిద్ద‌ప‌డుతున్నార‌న్న ప్ర‌చారం ఉంది.

పాలేరు
పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అభివృద్ధి చేయ‌డంలో ముందున్నారు. ఆద‌ర్శ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దారు. కానీ ఆయ‌న్ను కూడా వ్య‌తిరేక‌త వెంటాడుతోంది. స్థానికంగా ప్ర‌బావితం చేయ‌గ‌ల‌ రెడ్డి సామాజికవ‌ర్గం ఈ సారి ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం బ‌లం, బ‌ల‌గం అంతా మోహ‌రించారు.. కానీ సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఈ ప‌రిస్థితులు ఉండ‌వు.. పైగా మాజీ ఎంపీ సురేంద‌ర్ రెడ్డి కుటుంబం రంగంలో దిగుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో అక్క‌డ గట్టిపోటీ త‌ప్ప‌దు. పైగా వామ‌ప‌క్షాల‌కు బ‌లం ఉంది. టీడీపీ ఓటుబ్యాంకు ఇంకా ఉంది. ఈ నేప‌థ్యంలో తుమ్మ‌ల క‌ష్ట‌ప‌డాల్పి ఉంటుంది.

ఖ‌మ్మం
ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో పువ్వాడ అజ‌య్ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేస్తూనే ఉన్నా.. స్థానికంగా వ్య‌తిరేక‌త బ‌లంగా ఉంది. స‌ర్వేలు కూడా ఆయ‌న‌కు ఆశాజ‌న‌కంగా లేవ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు మూడు వ‌ర్గాలున్నాయి… ఎంపీ. మంత్రి తుమ్మ‌ల వ‌ర్గాలు ఆయ‌న‌కు స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదు. ఇది ప్ర‌త్య‌ర్ధుల‌కు వ‌రంగా మారుతోంది.

వైరా
వైరాలో మ‌ద‌న్‌లాల్ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా లేదు. ప్ర‌తి మండ‌లంలో గ్రూపు రాజ‌కీయాలున్నాయి. ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి వ‌ర్గానికి ఎమ్మెల్యే వ‌ర్గానికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ప్లెక్సీలు చించుకునే ప‌రిస్థితి ఉంది. వీరి పంచాయితీ సీఎం వ‌ర‌కూ వెళ్లింది. పైగా ఎమ్మెల్యే నోటిద‌రుసు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇవి ఆయ‌న‌కు ప్ర‌తికూలంగా మారాయి. సీటు కూడా ఇవ్వ‌రంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. టికెట్ రేసులో చంద్రావ‌తి పేరు వినిపిస్తోంది. అటు బాలాజీ నాయ‌క్ తో పాటు.. మ‌రికొంద‌రు కూడా మ‌ద‌న్ లాల్ కు చెక్ పెట్టేందుకు శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నిస్తున్నారు.

మ‌ధిర‌
మ‌ధిర‌లో అధికార‌పార్టీకి స‌రైన అభ్య‌ర్ధి క‌నిపించ‌డం లేదు. కాంగ్రెస్ నాయ‌కుడు, ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క ఈ నాలుగేళ్ల‌లో మంచిపేరు తెచ్చుకున్నారు. అయితే ఆయ‌న‌కు పోటీ ఇవ్వ‌గ‌ల నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. గ‌తంలో వైసీపీ త‌ర‌పున పోటీచేసిన క‌మ‌ల్ రాజ్ ఉన్నా.. ఆర్ధికంగా, రాజ‌కీయంగా భ‌ట్టిని ఢీకొట్ట‌గ‌లిగే ప‌రిస్థితిలో లేరు.

స‌త్తుప‌ల్లి
స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య ప్ర‌జ‌ల్లో మంచి పేరు సంపాదించారు. ఆయ‌న‌కు మ‌ళ్లీ తిరుగులేద‌న్న ప్ర‌చారం ఉంది. కాంగ్రెస్ తో పొత్తు ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. లేక‌పోయినా ఆయ‌న హ‌స్తం గూటికి చేరి పోటీచేస్తారని తెలుస్తోంది. అదే జ‌రిగితే ఆయ‌న విజ‌యం న‌ల్లేరుమీద న‌డ‌కే అంటున్నారు. దీంతో అధికార టిఆర్ఎస్ ఇక్క‌డ పోటీ ఇవ్వ‌డం అనుమాన‌మే. పిడ‌మ‌ర్తి ర‌వి మ‌ళ్లీ టికెట్ ఆశిస్తున్నా.. ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతార‌న్న‌ది అనుమాన‌మే.

అశ్వారావుపేట‌
అశ్వారావుపేట‌లో తాటి వెంక‌టేశ్వ‌ర్లు తీవ్రం వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్నారు. ట్రైకార్ ఛైర్మ‌న్ గా ఉన్నా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి చేసిందేమీ లేదు. దీంతో ఆయ‌న‌కు ప్ర‌త్యామ్నాయంపై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు మ‌చ్చా నాగేశ్వ‌ర‌రావు పార్టీలోకి తీసుకుని పోటీచేయించాల‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు బావిస్తున్నారు. అదే జ‌రిగితే ఎమ్మెల్యే ఎంత‌వ‌ర‌కు స‌హ‌క‌రిస్తార‌న్న‌ది సందేహ‌మే. ఇక్క‌డ సిట్టింగుకు అవ‌కాశం ఇచ్చినా.. మంత్రి త‌మ్మల వ‌ర్గం స‌హ‌క‌రించ‌దు. ఇలా ఇక్క‌డా అధికార‌పార్టీకి ప్ర‌తికూల‌వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది.

కొత్త‌గూడెం
2014లో నేరుగా టిఆర్ఎస్ గెలుచుకున్న స్థానం కొత్త‌గూడెం. ఇక్క‌డ జ‌ల‌గం వెంక‌ట్రావు అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్నా.. ద్వితీయ‌శ్రేణి కేడ‌ర్ కు దూరం అయ్యారు. ఆయ‌నకు, కార్య‌క‌ర్త‌ల‌కు గ్యాప్ పెరిగింది. దీనిని ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అనుకూలంగా మ‌లుచుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రి కావాల‌నుకుంటున్న ఎంపీ.. కొత్త‌గూడెంపై క‌న్నేశారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్యా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక్క‌డ ఎవ‌రు పోటీచేసినా మ‌రొ వ‌ర్గం స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదు. పైగా ఇక్క‌డ టీడీపీ, వామ‌ప‌క్షాల‌కు బ‌ల‌మైన ఓటుబ్యాంకు ఉంది. కూటిమి ఏర్ప‌డితే అధికార టిఆర్ఎస్ కు గ‌డ్డు కాలమే.

పిన‌పాక‌లో పాయం వెంక‌టేశ్వ‌ర్ల‌కు మంచి పేరున్నా..పార్టీ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా లేదు.

భ‌ద్రాచ‌లంలో కూడా అధికార పార్టీకి ఆశించిన‌స్థాయిలో ప్ర‌జాద‌ర‌ణ లేదు. ఇక్క‌డ పోటీచేయ‌డానికి స‌రైన అభ్య‌ర్ధి కూడా క‌నిపించ‌డం లేదు.

ఇల్లెందులో కోరం క‌న‌క‌య్య కూడా తీవ్రంగా వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. అంద‌రికంటే ముందు టిఆర్ఎస్ లో చేరినా.. త‌ర్వాత కాలంలో ఆయ‌న ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌న్న ముద్ర ఉంది. ఇక్క‌డ ఈ సారి ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌డం అనుమాన‌మేనన్న అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

మొత్తం ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో టిఆర్ఎస్ ఎదురీదుతోంది. ముఖ్యంగా నాయ‌కులు టీడీపీ వీడి పార్టీ మారినా.. ప్ర‌జ‌లు మాత్రం ఇంకా టీడీపీ జ‌పం చేస్తున్నారు. వారికి సైకిల్ గుర్తు క‌నిపిస్తే మ‌రోపార్టీకి ఓటువేయక‌పోవ‌చ్చు. త‌మ పార్టీని గెలిపించుకునే స‌త్తా లేక‌పోవ‌చ్చు. కానీ ఓడించ‌డానికి స‌రిప‌డా ఓటుబ్యాంకు ఇంకా టీడీపీలో ఉందని రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. దీంతో పాటు.. ఇప్పుడు జిల్లాలో నాలుగు వ‌ర్గాలున్నాయి. తుమ్మ‌ల‌, ఎంపీ పొంగులేటి, పువ్వాడ అజ‌య్‌, జ‌ల‌గం వెంక‌ట్రావు వ‌ర్గాలు. ఒక‌రికి ఒక‌రంటే ప‌డ‌దు. ఒక‌రు ఇంకొక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భావం చూప‌గ‌ల నాయ‌కులు. ఒక‌రికి ఒక‌రు స‌హ‌క‌రించుకుంటే త‌ప్ప గెలిచే ప‌రిస్థితి ఉండ‌దు. మ‌రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అంద‌రినీ స‌మ‌న్వయం చేసుకుని అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని పోయి జిల్లాలో పార్టీని ఎలా గెలిపించుకొస్తారో చూడాలి. ఇది ఆయ‌న స‌మ‌ర్ధ‌త‌కు ప‌రీక్ష‌గా మారుతుందా?

Recommended For You