ఖ‌మ్మం అసెంబ్లీ సీటు.. భ‌లే హాటు!

ఖ‌మ్మం ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్‌లో తీవ్ర‌పోటీ ఉంది. ఇక్క‌డి నుంచి పోటీచేసేందుకు నాయ‌కులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ప్ర‌స్తుతం టిఆర్ఎస్ సిట్టింగ్ సీటుగా ఉన్న ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో 2014లో కాంగ్రెస్ గెల‌చుకుంది. పువ్వాడ అజ‌య్ కుమార్ హ‌స్తం పార్టీ త‌ర‌పున పోటీ చేసి గెలిచారు. గులాబీ పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్శ్ లో భాగంగా.. ఖ‌మ్మం కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌కు ముందు పువ్వాడ అజ‌య్ అధికార‌పార్టీ గూటికి చేరారు. అంత‌వ‌ర‌కు ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో ఆధిప‌త్య చెలాయించిన తుమ్ముల నాగేశ్వ‌ర‌రావు.. అభివృద్ధి ప‌నుల‌కే ప‌రిమితం అయ్యారు. పార్టీ వ్య‌వ‌హారాల్లో జోక్యం త‌గ్గించారు. అంతా పువ్వాడ తానై నియోజ‌క‌వ‌ర్గంలో శాసిస్తున్నారు. పువ్వాడ పార్టీ మారినా.. కాంగ్రెస్ కు బ‌లం ఉంది.. మ‌ళ్లీ తామే గెలుస్తామ‌ని ధీమాగా ఉన్నారు. దీంతో హ‌స్తం త‌ర‌పున పోటీకి ప‌లువురు ప్ర‌ముఖులు పోటీప‌డుతున్నారు.
టీడీపీ నుంచి గులాబీ పార్టీలో చేరినా స‌రైన ప్రాధాన్య‌త లేని కార‌ణంగా అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వ‌ర‌రావు ఇటీవ‌ల కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయ‌నకు ఖ‌మ్మం టికెట్ ఇప్పిస్తాన‌ని రేణుకాచౌద‌రి భ‌రోసా ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న కూడా స‌న్నిహితుల వ‌ద్ద టికెట్‌పై ధీమాగా ఉన్నార‌ట‌. అంతే కాదు.. టిఆర్ఎస్‌లో ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు కొంద‌రు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి ముంద‌కొచ్చార‌ట‌. అయితే రాజ‌కీయంగా మ‌ద్ద‌తు మాత్ర‌మే కాదు.. డ‌బ్బు కూడా పెడితేనే విజ‌యం వ‌రిస్తుంది… సిద్దంగా ఉండాల‌ని ఆయ‌న‌కు కార్య‌క‌ర్త‌లు సూచిస్తున్నారు. పువ్వాడ‌కు పోటీ ఇవ్వాలంటే ఆర్ధిక అంగ‌బ‌లంతో సిద్దంగా ఉండాల‌ని పోట్ల ఈ సారి ఖ‌మ్మంలో ఎమ్మెల్యేగా గెల‌వాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక రేసులోకి ఖ‌మ్మం ప‌ట్ట‌ణానికి చెందిన ప్ర‌ముఖ ఆటోమొబైల్ వ్యాపారి వీవీసీ మోటార్స్ అధిప‌తి వి. రాజేంద్ర‌ప్ర‌సాద్( రాజా) కూడా రేసులోకి వ‌చ్చారు. కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. త‌న తండ్రి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. పైగా ఆర్ధికంగా, సామాజిక‌వ‌ర్గ ప‌రంగా ఉన్న ప‌రిచ‌యాల‌ను వాడుతున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి 2019 స‌రైన వేదికగా బావిస్తున్నారు. వీరితో పాటు… మ‌రికొంద‌రు గ్రానైట్ వ్యాపారులు కూడా టికెట్ రేసులో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని.. ఎమ్మెల్యే పువ్వాడ‌పై వ్య‌తిరేక‌త‌ను అనుకూలంగా మ‌లుచుకుని ఖ‌మ్మంలో పాగా వేయాల‌ని నేత‌లు భావిస్తున్నారు. మ‌రి అజ‌య్ ను ఢీకొట్టి వీరిలో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూడాలి.

Recommended For You