మాట‌ల్లో వేగం.. చేత‌ల్లో లేదా..?

తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన కేసులు రెండున్నాయి. న‌ర‌హంత‌కుడు న‌యీం దందాలు ఒక‌టైతే… రెండోది ఎంసెట్ లీకు. అత్యంత హేయ‌మైన ఈ కేసుల్లో ప్ర‌భుత్వం మొద‌ట్లో దూకుడుగానే వ్య‌వ‌హ‌రించింది. కేసులో సంచ‌నాలు రాబోతున్నాయ‌ని.. దుర్మార్గాల‌కు వంత‌పాడిన ప్ర‌ముఖుల భాగోతాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని భావించారు. కేసీఆర్ నుంచి పోలీసు అధికారుల ప్ర‌క‌ట‌న‌లు జ‌నాల్లో ఊహాగానాల‌కు తెర‌తీశాయి. కానీ స‌మ‌యం గ‌డిచేకొద్దీ కీల‌క కేసుల్లో ద‌ర్యాప్తు మంద‌గ‌మ‌నం ప‌ట్టింది. జ‌నంలో చ‌ర్చ మాయ‌మ‌వుతోంది. నోట్ల ర‌ద్దు అంశం కంటే ముందే వీటిపై చ‌ర్చ దాదాపు ముగిసిపోయింది. నోట్ల ర‌ద్దు అంశం తెర‌మీద‌కు వ‌చ్చిన త‌ర్వాత క‌నుమ‌రుగు అయింది. అసెంబ్లీలో చ‌ర్చ జ‌రిగితే కానీ నయీం కేసు జ‌నాల‌కు గుర్తుకు వ‌చ్చింది. నేర‌స్తుల‌ను వ‌ద‌ల‌మ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా… చ‌ర్చ‌కే ప‌రిమితం అన్న విమ‌ర్శ‌లు వినిపిస్త‌న్నాయి. నిజంగా నిందితుల చిట్టా విప్పి.. రాక్షాసుడి అవ‌స‌ర‌మైన‌ ర‌క్తం కోసం అమ‌యాకుల‌ను ఎర‌గా వేసిన పెద్ద మ‌నుషుల భాగోతం బ‌య‌ట‌కు తీస్తారా? ప్ర‌భుత్వం కానీ సిట్ కానీ ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. చోటా, గ‌ల్లీ నేత‌ల‌కు మాత్ర‌మే అరెస్టులు ఎందుకు ప‌రిమితమ‌య్యాయి.? ప‌్ర‌జాప్ర‌తినిధుల దాకా ఎందుకు రాలేదు. న‌యీం ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత వేలాది మంది సిఎం వ‌ద్ద‌కు వ‌చ్చి క‌న్నీళ్లు పెట్టుకుని మంచిప‌ని చేశార‌ని అభినందించార‌ట‌. అంత‌కంటే ఎక్కువ మంది న‌యీంకు స‌హ‌క‌రించిన వారి పేర్లు బ‌య‌ట‌పెట్టాల‌ని అడుగుతున్న‌ప్పుడు ఎందుకు స్పందించ‌డం లేదు. అధికారుల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అరెస్టు చేసి.. ఇంకా మంచి పేరు సంపాదించ‌వ‌చ్చు కదా? ఇందులో పోలీసులు, నాయ‌కులు ఉన్నారరు కాబ‌ట్టి న‌యీం కేసు ప‌క్క‌న పెడితే.. ఎంసెట్ లీకు వ్య‌వ‌హారం ప‌ట్ల కూడా ఉదాసీన‌త ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. నిందితుల‌కు స‌హ‌క‌రించిన బ‌డాబాబుల‌ను ఎందుకు అరెస్టు చేయ‌డం లేదు. పేప‌ర్ కొన్న త‌ల్లిదండ్రులు ఎంత‌మందిని ప‌ట్టుకున్నారు. అంటే తెలంగాణ ప్ర‌భుత్వం కూడా గ‌త పాల‌కుల్లాగే ఆధారాల‌తో అంద‌రి జాత‌కాల‌ను ద‌గ్గ‌ర పెట్టుకుని రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌నుకుంటుందా? ఎన్నిక‌ల అస్త్రాలుగా, రాజ‌కీయ వ్యూహాలుగా కేసుల‌ను మారుస్తుందా? సిబిఐ త‌ర‌హాలోనే తెలంగాణ‌కు సిట్‌లు, సిఐడీలు ప‌నిచేయ‌నున్నాయా? అలాకాద‌ని.. కేసీఆర్ ప్ర‌భుత్వం నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.  రెండేళ్లు మాత్రమే స‌మ‌య‌ముంది.

Recommended For You

Comments are closed.