అందుకే కేసీఆర్ ఆగ్ర‌హానికి గుర‌య్యారా?

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా కేసీఆర్ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిపై నిప్పులు చెరిగారు. ల‌క్ష కోట్లు రాష్ట్రానికి సాయం చేశామ‌ని అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆగ్ర‌హించిన కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుక‌ప‌డ్డారు. ప్రాజెక్టుల రీడిజైన్లుపై రాద్దాంతం చేసిన‌ప్పుడు కూడా కాంగ్రెస్‌పై ఈ స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌లేదు. కానీ అమిత్ షాపై ఉగ్ర‌రూపం చూపారు. కేసీఆర్ కౌంట‌ర్‌కు అన్ని వ‌ర్గాల నుంచి ఫుల్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే మోడీతో స్నేహం ఉంది.. షాతో వైరం అన‌డంతో కాస్త జ‌నాల్లో అనుమానాలు ఉన్నా.. కేసీఆర్ డేరింగ్ స్టెప్ అంటూ హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

అయితే కేసీఆర్ ఆగ్ర‌హానికి అస‌లు కార‌ణం వేరే ఉంద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. తెలంగాణ ప్ర‌భుత్వం ఆశ‌లు పెట్టుకున్న నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై బీజేపీ వెన‌క్కు త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సీట్లు పెంచ‌డానికి కేంద్రం సిద్దంగా లేద‌న్న సంకేతాలు కేసీఆర్‌కు అందాయ‌ట‌. ఇదే కేసీఆర్ ఆగ్ర‌హానికి కార‌ణ‌మంటున్నారు. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాలంటే సీట్లు పెంచితే ఇబ్బంది అవుతుంద‌ని రాష్ట్ర బీజేపీ నాయ‌కులు ఇచ్చిన నివేదిక ప్ర‌కారం అమిత్ షా ఈ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెంచితే అభ్య‌ర్ధులు దొర‌క‌ర‌ని.. త‌క్కువ సీట్లు ఉంటే పార్టీకి ఎక్కువ లాభ ఉంటుంద‌ని బీజేపీ భావించింద‌ట‌. పైగా సీట్లు పెంచితే ఎంఐఎం ఇప్పుడున్న 7 స్థానాల‌కు బ‌దులుగా 10కి పైగా గెలుచే చాన్స్ ఉంద‌ని అమిత్‌షాకు నివేదిక‌లు అందాయ‌ట‌. దీంతో తెలంగాణ‌లో త‌మ ఎదుగుద‌ల‌కు అడ్డుప‌డే నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ఫైల్ ప్ర‌స్తుతానికి కోల్డ్ స్టోరేజీకి పంపాల‌ని ఆయ‌న‌ నిర్ణ‌యించార‌ట‌. దాదాపు బిల్లు రెడీ అయి… పాస్ కావ‌డానికి సిద్దంగా ఉన్న స‌మ‌యంలో రెడ్ సిగ్న‌ల్ ప‌డ‌డంతోనే కేసీఆర్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు క‌థ‌నంలో సారాంశం. సీట్లు పెరుగుతాయ‌ని ధీమాగా ఉన్న స‌మ‌యంలో అమిత్ షా అడ్డుకున్నార‌న్న సంకేతాలు ఉండ‌డంతోనే కేసీఆర్ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడ్ని టార్గెట్ చేశార‌ని ద‌క్క‌న్ క్రానిక‌ల్ లో ఈ వార్త వ‌చ్చింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఇందులో నిజం లేద‌ని.. కేంద్రంలో రూలింగ్‌లో ఉన్న పార్టీ అధ్య‌క్షుడు త‌ప్పులు చెబితే వాటికి తిప్పికొట్టాల్సిన బాధ్య‌త‌ను కేసీఆర్ స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించార‌ని పార్టీ వ‌ర్గాలంటున్నాయి. మ‌రి ఏది నిజ‌మో త్వ‌ర‌లో తేల‌నుంది.

Other news:- తెలంగాణలో బతకలేరా? ఎందుకో ఈ వీడియో చూడండి…

Recommended For You

Comments are closed.