హ‌రీష్‌పైనే న‌మ్మ‌కం పెట్టుకున్న కేసీఆర్‌..!

సిద్ధిపేట ఎమ్మెల్యే , మంత్రి హరీష్ రావు ఆ నియోజకవర్గ అభివృద్ధితో దూసుక‌పోతున్నారు. ఉత్త‌మ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దుతున్నారు. ప్ర‌భుత్వం ఏ ప‌థ‌కం అమ‌లు చేసినా సిద్దిపేట నెంబ‌ర్‌వ‌న్‌గా ఉంటోంది. హ‌రిత‌హారం, మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాల్లో రాష్ట్రానికే ఆద‌ర్శంగా నిలుస్తోంది. ఈ నేప‌థ్యంలో సిఎం కేసీఆర్ హ‌రీష్ భుజ‌స్కందాల‌పై మ‌రో బాధ్య‌త‌ను పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 100 శాతం క్యాష్ లెస్ నియోజకవర్గంగా సిద్దిపేట‌ను చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదట్లో 500 రూపాయలు మాత్రమే వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత నెమ్మదిగా అవి కూడా లేకుండా చేసి.. అంతా ఆన్ లైన్ ట్రాన్సశాక్షన్స్ చేసేలా చేస్తారు. హరీష్‌పై ఉన్న న‌మ్మ‌కంతోనే కేసీఆర్ సిద్దిపేట‌ను ఎంపిక చేశారు. ఇది స‌క్స‌స్ అయితే దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కూ 2వంద‌ల కుటుంబాలున్న గుజ‌రాత్ అకోద‌ర గ్రామం మాత్ర‌మే క్యాస్‌లెస్‌గా ఉంది.. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం అంతా అంటే కేసీఆర్ ఇమేజ్‌ను మ‌రింత పెంచుతుంది. అందుకే మ‌రోసారి హ‌రీష్‌రావుపై కేసీఆర్ న‌మ్మ‌కం పెట్టారు.

వాస్త‌వానికి ఈ బాధ్య‌త‌ను సిరిసిల్ల ఎమ్మెల్యే, ఐటీ మంత్రి కేటీఆర్‌కు అప్ప‌గిస్తార‌ని భావించారు. సిరిసిల్ల‌ను ఎంపిక చేస్తార‌ని అనుకున్నారు. రాష్ట్రంలో టెక్నాల‌జీ, ప‌రిశ్ర‌మ‌లకు సంబంధించి వ్య‌వ‌హారాలు కేటీఆర్ చూస్తున్నారు. ఆయ‌న ప‌రిధిలో ఉన్న శాఖ‌ల కాబ‌ట్టి త్వ‌ర‌గా అమ‌లు చేయ‌డానికి అవకాశం ఉంద‌ని కొంద‌రు నేత‌లు సూచించారు. కానీ కేసీఆర్ మాత్రం హ‌రీష్‌రావుకే మొగ్గుచూపిన‌ట్టు తెలుస్తోంది. దీనికి కార‌ణం ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డుల కోసం కేటీఆర్ త‌ర‌చుగా విదేశాలు వెళుతుంటారు. ఇక్క‌డ‌కు వ‌చ్చే పారిశ్రామిక వేత్త‌ల కోసం స‌మ‌యం కేటాయించాల్సి వ‌స్తుంది. పైగా మున్సిప‌ల్ శాఖ కూడా ఆయ‌న చేతుల్లో ఉంది. వీటి దృష్ట్యా కేటీఆర్ స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతే పైలెట్ ప్రాజెక్టుపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. కేసీఆర్ భావించారు. సిద్దిపేట అంటే కేసీఆర్‌కు అత్యంత ఇష్ట‌మైన నియోజ‌క‌వ‌ర్గం. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తోనే హ‌రీష్‌రావు చేతుల్లో క్యాష్‌లెస్ పైలెట్ ప్రాజెక్టు పెట్టారు.

Recommended For You

Comments are closed.