కేటీఆర్ కోసం కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలుసా..!

కేసీఆర్ పార్టీలో స‌మ‌ర్ధ‌నాయ‌కుల వేట‌లో ఉన్నారా? అవును 31 జిల్లాల్లో పార్టీకి బ‌ల‌మైన పునాదులు వేసి.. ఎన్నిక‌ల్లో గెలిపించ‌గ‌ల నాయ‌కుల వేట‌లో ఉన్నార‌ట‌. ఆర్ధిక బ‌లంతో పాటు.. ప్ర‌జాబ‌లం ఉన్న నాయ‌కుల‌ను పార్టీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా త‌యారుచేసే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఇందులో భాగంగా పార్టీలో యాక్టీవ్‌గా ఉన్న‌వారికే బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించారు. ఇదే స‌మ‌యంలో ప‌నితీరు బాగాలేని వారిని పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంచాల‌ని భావిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఉద్య‌మ ప్ర‌భావం.. కేసీఆర్ ఇమేజ్ పార్టీని గెలిపించింది. కానీ వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో వాటితో పాటు.. స్థానిక జిల్లా నాయ‌కుల ప్ర‌భావం, క్యాడ‌ర్ కూడా కీల‌కం కానుంది. ఇప్పుడున్న నాయ‌కుల‌తో య‌ధాత‌థంగా ఎన్నిక‌ల‌కు వెళితే చాలా జిల్లాల్లో ఎదురీత త‌ప్ప‌ద‌ని భావించిన కేసీఆర్ స‌రికొత్త వ్యూహం అమ‌లు చేస్తున్నారు. స‌మ‌ర్ధులు పార్టీని గెలిపించ‌గ‌ల నాయ‌కులకు ఆయా జిల్లాల‌ పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించారు. ఈ ప‌ని ఇప్ప‌టికే త‌న‌యుడు కేటీఆర్‌కు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. కేటీఆర్ ప్ర‌తి జిల్లా నుంచి నివేదిక‌లు తెప్పించుకుని.. ఎవ‌రు పార్టీని న‌డిపించ‌గ‌ల‌రు. క్యాడ‌ర్‌లో న‌మ్మ‌కం క‌లిగించ‌డంతో పాటు.. ఆర్ధిక అవ‌స‌రాలు తీర్చ‌గ‌ల‌ర‌న్న అంశాల‌పై వివ‌రాలు సేక‌రిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప్ర‌క్రియ దాదాపు పూర్తి కావొచ్చింద‌ట‌. చాలా జిల్లాల్లో అన‌ధికారికంగా నాయ‌కుల‌కు సంకేతాలు కూడా పంపారు. కార్య‌చ‌ర‌ణ‌కు కూడా దిగిన‌ట్టు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపు నుంచి పార్టీని గెలిపించే వర‌కూ వారే బాధ్య‌త వ‌హించేలా ఆదేశాలు వెళుతున్నాయి. ఎమ్మెల్యేల ప‌నితీరు భాగాలేని చోట‌.. వెంట‌నే కొత్త నాయ‌క‌త్వం త‌యారుచేసి.. రంగంలో దింపాల‌ని కేటీఆర్ వారిని దిశానిర్దేశం చేశార‌ట‌. పార్టీ అవ‌స‌రాల‌కు గుర్తించి కార్య‌క్ర‌మాలు రూపొందించ‌డం… అవ‌స‌ర‌మైతే రాష్ట్ర నాయ‌క‌త్వంతో సంప్ర‌దించి క‌ఠిన నిర్ణ‌యాలు అయినా తీసుకోవడం చేయాల్సి ఉంటుంద‌ట‌. ఇప్పుడు జిల్లాల బాధ్య‌త‌లు తీసుకుంటున్న వారిలో ఎక్కువ‌గా యువ నాయ‌కులే ఉన్న‌ట్టు స‌మాచారం. వారంతా భ‌విష్య‌త్తులో కేటీఆర్‌కు స్పెష‌ల్ టీంగా ఉండేలా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నారు. అంటే అటు స్వామికార్యం.. స్వ‌కార్యం నేరవేరుతోంది. సీనియర్లు, ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌ పోషించి మొద‌టి నుంచి పార్టీలో ఉన్న‌వారికి అవ‌స‌ర‌మ‌తై నామినేటెడ్ ప‌ద‌వుల్లో ఉంచి. జిల్లా, రాష్ట్ర పార్టీ కీల‌క స్థానాల్లో కొత్త ర‌క్తం ఎక్కించే వ్యూహంలో కేసీఆర్ ఉన్నారు. తాజా ఆప‌రేష‌న్‌తో పార్టీకి జిల్లాల్లో స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌క‌త్వంతో పాటు.. కేటీఆర్‌కు ప‌ట్టు చిక్కుతుంద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. మ‌రి వ్యూహం 2019లో వ‌ర్కువుట్ అవుతుందా?

Recommended For You

Comments are closed.