
కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు 9నెలలు కావొస్తుంది. అయినా పూర్తిస్థాయి కేబినెట్ ఇంకా నోచుకోలేదు. పంచాయితీ, పార్లమెంట్, ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలతో ఇంతకాలం వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవు. అయినా కేసీఆర్ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చాలామంది సీనియర్లకు కేసీఆర్ స్వయంగా మాటిచ్చారు. మరికొందరు సమీకరణాల్లో అవకాశం దక్కుతుందని ఎదురుచూస్తున్నారు. కానీ కేసీఆర్ ఎటూ తేల్చలేకపోతున్నారు. కేబినెట్ విస్తరణ చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇదిగో ముహూర్తం అదిగో ముహూర్తం అంటూ లీకులే కానీ… ఆచరణలోకి రాలేదు. లేదు. అయితే కేసీఆర్ వెనక్కు తగ్గడానికి కారణాలివేనంటూ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలామంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్నవారికి ఈ సారి అవకాశం ఇవ్వలేదు. విస్తరణలో కూడా చోటు కల్పించకపోతే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనన్న ఆందోళన ఉంది. కడియం శ్రీహరి వంటి నేతలపై ఇప్పటికే బీజేపీ కన్నేసింది. కీలక సామాజిక వర్గాలకు చెందిన ఇతర నేతలకు బీజేపీ రాంమాథవ్ టచ్ లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ విషయంలో ఏమాత్రం తొందరపడ్డా.. సీనియర్లు షాకిచ్చే అవకాశముంది. ఇప్పటికే జితేందర్ రెడ్డి వంటివాళ్లు వెళ్లి… మిగతా నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నాయకులు ఆశగా ఉన్నారు. నిరుత్సాహపరిస్తే ప్రత్యామ్నాయం చేసుకునే ఛాన్సుంది. ఇప్పటికే సోమారపు సత్యనారాయణ జంప్ చేశారు. ఇప్పటికే డిఎస్ కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసి నిజామాబాద్ లో కవితను ఓడించి.. కొడుకు అరవింద్ ను గెలిపించుకున్నారు. దీంతో మళ్లీ అలాంటి పొరపాటు జరగకుండా కేసీఆర్ జాగ్రత్తపడుతున్నట్టు తెలుస్తోంది. ఆలస్యమైనా ఫర్వాలేదు.. కానీ కేబినెట్ సమీకరణాల విషయంలో జాగ్రత్త పడాలని నిర్ణయానికి వచ్చారు. ఇక మరో పెద్ద సవాలు హరీష్ రావు. కొంతకాలంగా హరీష్‌రావును పక్కనపెడుతున్నారన్న చర్చ బలంగా వినిపిస్తోంది. కేటీఆర్ కు ప్రమోషన్ ఇచ్చిన కేసీఆర్… అల్లుడు హరీష్ ను నియోజకవర్గానికి పరిమితం చేశారు. సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. ఇంతకాలం లైట్ గా తీసుకున్న కేసీఆర్.. బీజేపీ రాకతో సీరియస్ గా దృష్టిపెట్టారు పైగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన్ను ఆలోచనలో పడేశాయి. కేబినెట్ విస్తరణలో హరీష్‌రావుకు అవకాశం ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలుంటాయి.. ఒకవేళ తీసుకుంటే.. కేటీఆర్ కు ఎలాంటి ఇబ్బంది ఉంటుందనే అంశాలపై కేసీఆర్ మథనం సాగిస్తున్నట్టు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడినదగ్గర నుంచి కవిత కూడా చాలా సైలెంట్ అయ్యారు. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే కవితకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎలా అకామిడేట్ చేయాలా అని సన్నిహితుల వద్ద చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కేబినెట్ పై ఇంతా నా ఇష్టం.. అనుకునే స్టేజి నుంచి… సమీకరణాలు మహాకష్టం అనేస్తాయికి కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆలస్యం అవుతుందని అంటున్నారు. పార్టీని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ లెక్కలన్నీ సరిచూసుకుని ఎప్పుడు ముహూర్తం పెడతారో చూడాలి.