టిఆర్ఎస్‌ నిర్ణ‌యాల‌పై సొంత పార్టీలోనే వ్య‌తిరేక స్వ‌రం..?

తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినాయ‌తక‌త్వం పార్టీ ప‌రంగా.. ప్ర‌భుత్వం ప‌రంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాల‌పై వ్య‌తిరేక స్వ‌రం క్ర‌మంగా పెరుగుతోందా.. ఇటీవ‌ల ప‌లు నిర్ణ‌యాలను పార్టీలోని కొంద‌రు నాయ‌కులు కూడా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అధినేత కేసీఆర్ కొన్ని విష‌యాల్లో లిబ‌ర‌ల్ గా ఉండ‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తుందంటున్నారు. క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి కానీ.. హ‌క్కుల‌ను హ‌రించేలా నిర్ణ‌యాలు ఉండ‌కూడ‌ద‌న్న భావ‌న పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కులు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. అయితే ఇదే విష‌యాన్ని అధినేత వ‌ద్ద ప్ర‌స్తావించ‌డానికి సంకోచిస్తున్నారు. చెప్పినా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న అభిప్ర‌య‌మే ఇందుకు కార‌ణమట.. కేసీఆర్‌తో స‌న్నిహితంగా ఉండే మంత్రులు సైతం త‌మ అభిప్రాయ‌ల‌ను వెల్ల‌డించ‌డానికి ముందుకురావ‌డం లేదని సమాచారం.

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అండ్ కో వ్య‌వ‌హారంలో కేసీఆర్ ప్ర‌భుత్వ వైఖ‌రి భిన్నంగా ఉంటే బాగుండేద‌ని పార్టీ నాయకులే అంటున్నారు. వారిపై సెష‌న్ మొత్తం వేటు వేయడాన్ని సొంత‌పార్టీలో స‌భ్యులు త‌ప్పుబ‌డుతున్నారు. వాస్త‌వంగా రేవంత్ రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డాన్ని న్యాయ‌ప‌రంగా స‌మ‌ర్ధించుకోవ‌చ్చు.. కానీ దీని వల్ల జ‌నాల్లో సానుభూతి వారికే ద‌క్కుతోందట. ఉద్దేశపూర్వ‌కంగానే టీడీపీ నేత‌ల‌ను స‌భ‌లో అడుగుపెట్ట‌కుండా చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.వాస్త‌వానికి రేవంత్ రెడ్డిని ఎంత‌దూరంగా ఉంచితే అంత మైలేజ్ పెరుగుతుంది. అలాంట‌ప్పుడు ఆయ‌న్ను స‌భ‌లో లేకుండా చేయ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఏంట‌ని అంత‌ర్గతంగా కొంద‌రు నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.
ఇక ధ‌ర్నాచౌక్ ఎత్తివేత వ్య‌వ‌హారం కూడా కేసీఆర్ తీరుపై విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఒక‌ప్పుడు తెలంగాణ ఉద్య‌మం న‌డిబొడ్డున హుస్సేన్ సాగ‌ర్ వేదిక‌గా సాగింది. సాగ‌ర‌హారం, సాగ‌ర‌మాల, మిలియ‌న్ మార్చ్ జ‌నాలు మ‌రిచిపోగ‌ల‌రా? ఇప్పుడు మాత్రం ఆందోళ‌న కారుల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా అడ్డుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అన్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఢిల్లీలో పార్ల‌మెంట్‌కు స‌మీపంలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నాల‌కు అనుమ‌తి ఇస్తారు. కానీ హైద‌రాబాద్‌లో ఆంక్ష‌లేంట‌న్న విమ‌ర్శ‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి పాల‌కులు కూడా ఇలాంటి జీవో తెచ్చి ఉంటే.. కేసీఆర్ అంగీక‌రించి ఉండేవారా? అని బీజేపీ, టీడీపీ, ప్ర‌జాసంఘాలు ప్ర‌శ్నిస్తున్నాయి. మిగ‌తా వాళ్ల సంగ‌తి ఎలా ఉన్నా.. సొంత పార్టీలోనే ఉద్య‌మకాలం నుంచి కేసీఆర్ వెంట ఉన్న‌వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. కానీ ఎవ‌రూ దీనిపై చ‌ర్చించే సాహ‌సం చేయ‌డం లేద‌ట‌. ఇక విమ‌ర్శ‌లు చేస్తే కేసులు పెట్టే చ‌ట్టం తీసుకొస్తామంటూ బెదిరింపు ధోర‌ణి కూడా స‌రికాద‌ని సీనియ‌ర్లు అంటున్నారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు స‌హ‌జం. అలాంట‌ప్పుడు కేసులు పెట్టే చ‌ట్టం తీసుక‌రావ‌డం అంటే మంచిదికాద‌న్న భావ‌న ఉంది. రాజ‌కీయాల్లో అధికారం శాశ్వ‌తం కాదు.. అలాంట‌ప్పుడు మ‌న‌కే సొంతం అన్న‌ట్టుగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంటే భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని పార్టీలో నాయ‌కులు ఆఫ్ ది రికార్డ్‌ హెచ్చ‌రిస్తున్నారట‌. అంతేకాదు అసెంబ్లీలో మంత్రులకు అవకాశం ఇవ్వకుండా అన్నీ  శాఖలపై ఆయనే మాట్లాడటం కూడా విమర్శల పాలవుతున్నారు. తంలో మీడియా కూడా కేసీఆర్ నిర్ణ‌యాల‌ను మాత్ర‌మే చూపించేది. విప‌క్ష నాయ‌కులు వాద‌న‌లు.. వ్య‌తిరేక‌త‌ల‌ను పెద్ద‌గా ప్ర‌సారం చేసేవి కావు.. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది..ఎక్క‌డ ఏం జ‌రిగినా ప్ర‌భుత్వం వ్య‌తిరేక ఉద్య‌మాల‌ను కూడా కావాల్సినంత ప్ర‌సారం ఇస్తున్నాయి. ప్ర‌తి నిర్ణ‌యం దానిపై విశ్లేష‌ణ‌లు జ‌నాల్లోకి వెళుతున్నాయి. పైగా హామీలు కూడా నిల‌బెట్టుకోవ‌డం సాద్యం కావ‌డం లేదు. గ‌తంలో ప్రాజెక్టులు రెండేళ్ల‌లో పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించినా ఇంకా పునాదులు ప‌డ‌లేదు. డ‌బుల్ బెడ్‌రూం ప‌థ‌కాలు గుదిబండ‌గా మారాయి. ఈ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల గొంత నొక్కాల‌ని చూస్తే.. హామీలు అమ‌లు చేయ‌లేక ప్ర‌త్య‌ర్ధుల‌ను టార్గెట్ చేశార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌న్న ఆందోళ‌న పార్టీ వ‌ర్గాల్లో ఉంది. మ‌రి ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాల‌పై స‌మీక్షించుకుంటుందా?

Recommended For You

Comments are closed.