జూపల్లి దారెటు.. చేతికి చిక్కుతారా.. కమలం గూటికి చేరతారా?

తెలంగాణ టిఆర్ఎస్‌ లో అసమ్మతి ఉండదు.. ఎవరైనా సర్దుకపోవాల్సిందే.. ఇది నిన్నమొన్నటి దాకా వినిపించిన మాట. కానీ ఇప్పుడు సీను మారింది. ఒక్కసారిగా పార్టీలో అసమ్మతిరాగం అందుకుంది. ఇతర పార్టీల వైపు గులాబీ నేతలు చూస్తున్నారు. ఇంతకాలం ఆపరేషన్‌ ఆకర్శ్‌ తో తిరుగులేదనుకున్న పార్టీలో వికర్శ్‌ కూడా మొదలైంది. పార్టీలో కొందరు నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇటీవల మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీ మారారు. మొదటి నుంచి తనకంటూ ప్రత్యేకవర్గం గ్రూపు ఉన్న సోమారపు సత్యనారాయణ ఇక్కడ ఇమడలేకపోయారు. ఇప్పుడు మరో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఆయనే కొల్లపూర్‌ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు జూపల్లి కృష్ణారావు. గత కొంతకాలంగా ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ సామాజిక వర్గానికి చెందిన కృష్ణారావు గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండేవారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో మంత్రిపదవి వదులుకుని టిఆర్ఎస్‌ లో చేరారు. కేసీఆర్‌ కూడా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. 2014లో మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్ధి హర్షవర్దన్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. టిఆర్ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్శ్‌ లో భాగంగా హర్షవర్దన్‌ రెడ్డి టిఆర్ఎస్‌ గూటికి చేరారు. దీంతో జూపల్లి ప్రాధాన్యత తగ్గింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం అని కేసీఆర్‌ అనడంతో కేడర్‌ కూడా జూపల్లి వైపు వెళ్లడం లేదు. ఇక పార్టీ అధినేత అపాయింట్‌ మెంట్‌ కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. యువనేతను కలిసేందుకు వెళితే… రెండుగంటల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని… పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇలా అవమానాలు పడుతూ ఉండడం కంటే పార్టీ మారడం మేలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గులాబీ పార్టీలో అవమానాలు భరించే పరిస్థితి లేదని సన్నిహితులతో అన్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆయన అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ ఏ పార్టీలో చేరితే బాగుంటుదన్న ఆలోచనలోపడ్డారట. బీజేపీ నేతలు టచ్‌ లోకి వచ్చినా.. కాంగ్రెస్‌ కే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో ఇప్పటికే డీకే అరుణ ఉన్నారు. ఆమె కుటుంబంతో బద్దవైరం ఉంది. మళ్లీ అక్కడకు వెళితే వర్గపోరు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని వెనకడుగు వేస్తున్నారు. అయితే నాగర్‌ కర్నూల్ జిల్లా తమకు అప్పగిస్తే చేరడానికి అభ్యంతరం లేదని.. గద్వాల జోక్యం లేకుండా చూడాలని కండీషన్‌ పెట్టినట్టు తెలుస్తోంది. బీజేపీ కంటే కాంగ్రెస్‌ మేలని… సేఫ్‌ జోన్‌ గా ఆయన అనుచరులు సూచిస్తున్నారు. గతంలో పనిచేసిన అనుభవం. పరిచయాలు అనుకూలంగా మారతాయంటున్నారు. మొత్తానికి త్వరలోనే ఏ పార్టీలో చేరేది చెబుతారని తెలుస్తోంది. ఆయన పార్టీ మారడం ఖాయమంటున్నారు. సొంతసామాజిక వర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వినోద్‌ వంటి నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఇవ్వడం లేదన్న భావనలో జూపల్లి ఉన్నారు. ఉద్యమసమయంలో అండగా ఉన్నా… కేవలం ఓడిపోయిన కారణంగా పక్కనపెట్టడంపై ఆయన రగిలిపోతున్నారట. అందుకే పార్టీ మారాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తనతో పాటు.. తన వారసుడికి కూడా రాజకీయ భవిష్యత్తు కల్పిస్తే చేరడానికి సిద్దమని ఇతర పార్టీలకు సంకేతాలు పంపినట్టు చెబుతున్నారు.

Recommended For You