పాలేరు బాట‌లో జ‌ల‌గం ఫ్యామిలీ..!

ఖ‌మ్మం రాజ‌కీయాల్లో జ‌ల‌గం – తుమ్మ‌ల కుటుంబానికి మ‌ధ్య రాజకీయ శ‌త్రుత్వం అంద‌రికీ తెలిసిందే. వెంగ‌ళ‌రావుతో ఢీ అంటే ఢీ అన్న‌ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. మాజీసీఎం వార‌సుల‌తో కూడా ఫైట్ చేసి ఓడించారు. జిల్లాలో వెంగ‌ళ‌రావుకు ఎంత‌పేరుందో.. తుమ్మ‌ల కూడా అదే స్థాయిలో గుర్తింపు.. పేరు సంపాదించారు. స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో మొద‌లైన వీరి ఆధిప‌త్య పోరాటానికి ఇక పాలేరు వేదిక కానుంద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. మాజీ మంత్రి జ‌ల‌గం వెంగ‌ళ‌రావు త‌న‌యుడు  జ‌ల‌గం ప్ర‌సాద్ మ‌ళ్లీ రాజ‌కీయ రంగ ప్ర‌వేశ చేయ‌డానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. త‌మ్ముడు వెంక‌ట్రావు కొత్త‌గూడెం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న టిఆరెస్ పార్టీలో ఉన్నారు. అయితే ప్ర‌సాద్ మాత్రం త‌ను మొద‌టి నుంచి కాంగ్రెస్ వాదినేనని.. మ‌ళ్లీ కాంగ్రెస్ త‌ర‌పునే పోటీచేస్తాన‌ని తాజాగా ప్ర‌క‌టించారు. అనుచ‌రుల‌తో మంత‌నాల్లో ఉన్నారు. ఎంపీగా పోటీ చేయాల‌ని భావించినా… ఇక్క‌డ పోటీ ఎక్కువగా ఉంది.. రేణుకాచౌద‌రి ఇప్ప‌టికే ప్ర‌చారంలో దిగారు. ఆమెకు పోటీగా పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి కూడా ఎంపీ సీటు కావాలంటున్నారు. ఇక పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్ర‌మార్క కూడా త‌న భార్య‌కు ఖ‌మ్మం ఎంపీ సీటు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఇక నామా నాగేశ్వ‌ర‌రావు కూడా సీటు ఇస్తే హ‌స్తం గూటికి చేరడానికి సిద్దంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఎంపీగా కంటే.. పాలేరు ఎమ్మెల్యే సీటు సేఫ్ అనుకుంటున్నారు జ‌ల‌గం ప్ర‌సాద్‌. అక్క‌డ కాంగ్రెస్ కు పెద్ద‌గా పోటీ లేదు. పీసీసీ కూడా బ‌ల‌మైన నాయ‌కుడి వేట‌లో ఉంది. తుమ్మ‌ల‌కు ఢీకొట్టాలంటే పెద్ద నాయ‌కుడు కావాల‌ని చూస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌ల‌గం ప్ర‌సాద్‌ పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది. పైగా త‌న శ‌త్రువు అయిన తుమ్మ‌లపై పోటీకి త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అయితే కాంగ్రెస్ ఆయ‌న‌కు అవ‌కాశం ఇస్తుందా లేదా అన్న‌ది చూడాలి. మాజీ ఎంపీ సురేంద‌ర్ రెడ్డి త‌న‌యుడు ర‌ఘురాంరెడ్డి ఇక్క‌డ తుమ్మ‌ల‌పై పోటీచేస్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. స్థానికులు పైగాఆర్ధికంగా, రాజ‌కీయంగా పలుకుబ‌డి ఉన్న సురేంద‌ర్ రెడ్డి కుటుంబం సీటు అడిగితే కాంగ్రెస్ కాద‌న‌దు.. కానీ వారు అంత సుముఖంగా లేరు. ఆ కుటుంబం వ‌ద్దు అంటేనే జ‌ల‌గం ప్ర‌సాద్ పేరు ప‌రిశీల‌న‌కు వ‌స్తుంద‌ని తెలుస్తోంది. మ‌రి గ‌తంలో పార్టీ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలకు పాల్ప‌డి ఆయ‌న 1999లో బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యారు. ఆత‌ర్వాత అడ‌పాద‌డ‌పా క‌నిపించారు కానీ రాజ‌కీయంగా ఉనికి చాటుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. జిల్లాలో ఆయ‌న్ను చాలామంది మ‌రిచిపోయారు.. మ‌రి మ‌ళ్లీ తండ్రి వార‌స‌త్వం గుర్తుచేసి జిల్లాలో త‌న ముద్ర వేస్తారా.. చూడాలి.

See also:

Recommended For You