చంద్రబాబుకు ఆముద్ర జగన్ వేయగలరా?

నవరత్నాలు అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌…. ముందుగా వేరే పనిలో పడ్డారా? ఆయన దృష్టంతా ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడేనా? తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు చూస్తే నిజమనిపిస్తున్నాయి. చంద్రబాబును అవినీతి పరుడిగా నిరూపించడానికి అమరావతి నుంచి హస్తిన దాకా జగన్‌ చేయని ప్రయత్నం లేదు. తన బలగాన్ని మొత్తాన్ని ఇదే పనిపై పురమాయించినట్టు కనిపిస్తోంది. కానీ ఆయన వ్యూహాలు రివర్స్‌ అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటీ సక్సస్‌ కావడం లేదు. దీంతో జగన్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీలో పద్దులపై జరగాల్సిన చర్చలు నీతి, అవినీతి చుట్టూ తప్పుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అంతా అవినీతిమయం అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు విమర్శలు ఎక్కుపెట్టారు. వేల కోట్ల అంచనాలు పెంచి.. టీడీపీ నేతలు కాంట్రాక్టులు తీసుకున్నారని… కోట్ల రూపాయలు దండుకున్నారని అసెంబ్లీలో ఆరోపించారు. దీనిపై టీడీపీ ధీటైనా సమాధానం ఇచ్చింది. పక్కా లెక్కలతో అసెంబ్లీకి వచ్చింది. దీంతో మంత్రుల వాదన తేలిపోయింది. సమాధానం ఇవ్వలేకపోవడంతో జగన్‌ ఆయా మంత్రులపై అసహనం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక పార్లమెంట్లో కూడా విజయసాయిరెడ్డి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా? సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని రాజ్యసభలో అడిగారు. ఎలాంటి అవినీతి అక్రమాలు తమ దృష్టికి రాలేదని క్లీన్ చిట్ ఇచ్చింది కేంద్రం. దీంతో పోలవరంలో అవినీతి జరిగిందని… చంద్రబాబును ఇరికించాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక తాజాగా పీపీఏ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఒప్పందాలను సమీక్షిస్తామని..అవినీతి బయటపెడతామని ప్రకటించారు. అయితే కేంద్రం దీనిపై సీరియస్‌ అయింది. ఒప్పందాలు సమీక్ష అంటే దేశంలోకి వచ్చే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని… వార్నింగ్ ఇచ్చింది. సంప్రదాయేతన ఇంధనంపై జాతీయ, అంతర్జాతీయ నిబంధనలకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. దీంతో ఆత్మరక్షణలో పడ్డ జగన్‌ మంత్రులతో లాభం లేదనకుని.. ఏకంగా అధికారులను, సలహదారుడు అజయ్‌ కల్లంను రంగంలో దింపారు. వారంతా వచ్చి ప్రెస్‌ మీట్‌ పెట్టారు. అయితే వారు చెప్పిన లెక్కలనే తీసుకుని… చంద్రబాబు రివర్స్‌ పంచ్‌ ఇచ్చారు. అసలు ఒప్పందాల పత్రాలను బయటపెట్టారు. అధికారులు చెప్పిన లెక్కలు తప్పని.. అసలు ఆ రేట్లకు విద్యుత్ కొనలేదని చంద్రబాబు ఆధారాలతో చూపించారు. పైగా అధికారులు మీడియా సమావేశం పెట్టి.. గత ప్రభుత్వాన్ని విమర్శించడం అవగాహన రాహిత్యం.. పెద్ద తప్పని కుండబద్దలు కొట్టారు. పైగా జగన్‌ కంపెనీలు కర్నాటకలో విద్యుత్ అమ్మిన రేట్ల కంటే తక్కువకే కొన్నామని ఎదురుదాడి చేశారు. దీంతో వైసీపీ ఇబ్బందుల్లో పడింది. మొత్తానికి ఏదో చేద్దామని… తొందరపాటు నిర్ణయాలతో జగన్‌ ప్రభుత్వం ఇక్కట్ల పాలవుతోంది. ప్రతి విషయంలో జగన్‌ తీసుకుంటున్ననిర్ణయాలు బెడిసికొడుతున్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన జగన్‌… చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ముందుగా సంక్షేమంపై దృష్టి పెట్టి… కొంతకాలం తర్వాత చంద్రబాబు అవినీతిపై దృష్టిపెడితే బాగుండేదని అంటున్నారు. రావడంతోనే సబ్‌ కమిటీలు, విచారణలు అంటూ చేసిన ప్రకటనలతో కక్ష పూరిత రాజకీయాల ముద్ర పడుతోంది. ఇది జగన్‌ ఫ్యూచర్‌ కు మంచిది కాదంటున్నారు. 30 అంశాలపై సబ్‌ కమిటీ వేసినా అతీగతీ లేదు. ఏం చేయడానికి వీల్లేదని అర్ధమయింది. పైగా రివర్స్‌ టెండరింగ్‌, జ్యడిషియల్‌ కమిటీ విచారణ పేరుతో ప్రకటన చేసినా.. న్యాయవ్యవస్థ ఇందుకుసిద్దంగా లేనట్టు తెలుస్తోంది. నేరుగా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదు… ఏదైనా ఫిర్యాదులు వస్తేనే పాలనపరమైన అంశాల్లోజోక్యం ఉంటుందని చంద్రబాబు అంటున్నారు. నిపుణులు కూడా చెబుతున్నారు. ముందు జగన్‌ పాలన పట్ల అవగాహన పెంచుకుని వ్యూహాత్మకంగా ఉండాలని సూచిస్తున్నారు. బీజేపీ కూడా జగన్‌ పై దాడి మొదలుపెట్టింది. ప్రత్యేకహోదా మరిచిపోవాలని స్పష్టం చేసింది. జీవీఎల్ కూడా అమరావతి విషయంలో ప్రజల్లో అనుమానాలున్నాయని.. రాజధాని ఉందా లేదా అని పార్లమెంట్‌ సాక్షిగా ప్రశ్నించారు. దీంతో జగన్‌ ముందు సరికొత్త సవాళ్లు వస్తున్నాయి. మరి చంద్రబాబే లక్ష్యంగా సాగుతున్న జగన్‌ జాగ్రత్త పడతారా? అసలు అంశాలపై దృష్టిపెడతారా? పద్మవ్యూహంలో చిక్కకుంటారా? చూడాలి.

Recommended For You