గ‌తంలో పాలేరు…ఇప్పుడు రాష్ట్రమంతా..!

ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారంతో రాజ‌కీయపార్టీలు వ్యూహాలు, ప్ర‌తివ్యూహాల‌పై దృష్టి సారించాయి. అటు అధికార టిఆర్ఎస్ ఇప్ప‌టికే స‌ర్వేల పేరుతో సంద‌డి చేస్తోంది. ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌పై దృష్టి పెట్టింది. అటు పొత్తుల‌పై కూడా స‌మాలోచ‌న‌లు జ‌రుపుతోంది. బీజేపీ జ‌న‌చైత‌న్య యాత్ర‌తో ఇప్ప‌టికే జ‌నాల్లోకి వెళ్లింది. లెఫ్ట్ పార్టీల్లో సీపీఐ కాంగ్రెస్ తో జ‌త‌క‌ట్ట‌డానికి సిద్దంగా ఉంది. సీట్ల స‌ర్దుబాటుకు కూడా ఓకే చెబుతోంది. కానీ సీపీఎం మాత్రంగా ఇందుకు భిన్న‌మైన వైఖ‌రి తీసుకుంది. బ‌హుజ‌న లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో హ‌డావిడి చేస్తుంది. పొత్తుల‌కు స‌సేమిరా అంటోంది. వాస్త‌వానికి పొత్తులు లేకుండా సీపీఎం ఎన్ని ఫ్రంట్ లు పెట్టినా.. ఉప‌యోగం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. భ‌ద్రాచ‌లం సీటు కాపాడుకోవ‌డం వారికి క‌త్తిమీద సాముగా మారింది. క‌ర్నాటక‌లో కాంగ్రెస్ తో సీతారం ఏచూరి చేతులు క‌లిపినా.. ఇక్క‌డ రాష్ట్ర‌ నాయ‌క‌త్వం ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆస‌క్తిగా మారింది. ఒక‌వేళ మ‌హాకూట‌మి ఏర్ప‌డిన మాదారి రాదారి అంటోంది. దీంతో ఈ పార్టీ నాయ‌క‌త్వంపై కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం మొద‌లుపెట్టారు. ఇటీవ‌ల ఓ ఛాన‌ల్ లో జ‌రిగిన చ‌ర్చా వేదిక‌లో కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి కూడా సీపీఎం తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అధికార పార్టీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యం అంటూ బ‌య‌ట‌కు చెబుతున్నా.. అంత‌ర్గ‌తంగా టిఆర్ఎస్ తో ఒప్పందం ఉంద‌న్న అనుమానం ఆయ‌న‌ వ్య‌క్తం చేశారు. ఫ్రంట్ వ‌ల్ల ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలి.. అంతిమంగా గులాబీ పార్టీకే లాభం జ‌రుగుతుందంటున్నారు. వాస్త‌వానికి ఫ్రంట్ కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఖ‌మ్మం జిల్లా నాయ‌కుడు గ‌తంలో కూడా ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోపించారు. ఆయ‌న రాజ‌కీయాలు అంద‌రికంటే బిన్నంగా ఉంటాయ‌ని చెబుతుంటారు. గ‌తంలో జిల్లాలో చ‌క్రం తిప్పారు.. ఇప్పుడు రాష్ట్రంలో అదే త‌ర‌హా అగ్రిమెంట్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నారని కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాకు చెందిన ఓ కీల‌క అధికార పార్టీ నాయ‌కుడితో ఆయ‌న‌కున్న అంత‌ర్గ‌త అవగాహ‌న‌లో బాగంగానే పాలేరు ఉప ఎన్నిక‌లో కూడా కూట‌మితో క‌లిసిరాలేద‌ని గుర్తు చేస్తున్నారు. అన్ని పార్టీలు క‌లిస్తే గెలిచే అవ‌కాశం ఉన్నా.. అధికార పార్టీకి మేలు చేయ‌డానికి పాలేరులో త‌మ ఓట్లు కాపాడుకుంటామ‌న్న నినాదంతో బ‌రిలో దిగి.. ప‌రోక్షంగా స‌హ‌క‌రించార‌ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నాయ‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ్మినేని వీర‌భ‌ద్రంపై సీపీఐ నారాయ‌ణ చేసిన విమ‌ర్శ‌ల‌కు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా టిఆర్ఎస్ బ‌ల‌హీనంగా ఉన్న ఖ‌మ్మం జిల్లాలో టిఆర్ఎస్ కు స‌హ‌క‌రించేంద‌కే బ‌హుజ‌న్ ఫ్రంట్ అన్న అనుమానం కాంగ్రెస్ వ్య‌క్తం చేస్తుంది. మ‌ధిర‌, పాలేరు, ఖ‌మ్మం, భ‌ద్రాచ‌లం, వైరా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ఓటుబ్యాంకు ఉంది. దీనిని క్యాష్ చేసుకునే ఎత్తుగ‌డ అంటున్నారు. అయితే సీపీఎం నాయ‌కులు ఈ వాద‌న‌ను తొసిపుచ్చుతున్నారు. జాతీయ పార్టీ నిర్ణ‌యాల‌ ఆధారంగానే త‌మ పొత్తులుంటాయ‌ని అంటున్నారు. కేంద్ర నాయ‌క‌త్వం తీసుకునే నిర్ణ‌య‌మే త‌మ నిర్ణ‌యం అంటున్నారు. మొత్తానికి సీపీఎం రాష్ట్ర నాయ‌క‌త్వం చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. మ‌రి వీరి మ‌న‌సులో ఏముందో.. చూడాలి.

Recommended For You