అమ్మో అమెరికా అంటున్న పేరెంట్స్…!

డాల‌ర్ల వేట ముగుస్తోంది.. అమెరికా అంటేనే ప‌డిచ్చిపోయే భారతీయులు ఇప్పుడు భ‌య‌ప‌డిపోతున్నారు. క‌ల‌ల ప్ర‌పంచంగా భావించిన అగ్ర‌రాజ్యం ఇక న‌ర‌క‌కూపంగా మారుతుంద‌న్న వాస్త‌వాన్ని యువ‌త గుర్తిస్తున్నారు. ఆర్ధికంగా, సామాజికంగా, రాజ‌కీయంగా అమెరికా అంత సేఫ్ కాద‌న్న భావ‌న క‌లిగిస్తున్నాయి ప‌రిస్థితులు. ఒక్క కార‌ణం అయితే.. స‌ర్దుకోవ‌చ్చు.. కానీ ముప్పేట దాడి జ‌రుగుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ నిపుణుల స్వ‌ర్గాధామంగా విల‌సిల్లిన అమెరికా.. ఆప్పుడు కాదు పొమ్మంటోంది. అమెరికా గ్రేట్ అగెయిన్ అంటూ అధికారంలోకి వ‌చ్చిన ట్రంప్.. మొత్తం వ్య‌వ‌స్థ‌నే మార్చివేస్తున్నారు. విదేశాల నుంచి వ‌ల‌స వ‌చ్చిన‌ మేధావుల‌ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. ముందుగా నిపుణులు రావాలంటే ల‌క్ష డాల‌ర్ల‌కు పైగా వేత‌నం ఉండాల‌న్నారు. వీసాకు ఫీజు భారీగా పెంచారు. స్థానికుల‌కు 50శాతం తీసుకోవాల్సిందేన‌న్న ఆంక్ష‌లు పెట్టారు. తాజాగా నిపుణుల స‌తీమ‌ణులు లేదా భ‌ర్త‌లు ఉద్యోగం చేయ‌డానికి వీలు లేకుండా వీసా నిబంధ‌న‌లు క‌ఠినంత‌రం చేస్తున్నారు. ఆర్ధిక భ‌రోసాను తుంచేస్తున్నారు. అమెరికాలో ఉండాలంటే ఇద్ద‌రూ ఉద్యోగం చేయాల్సిందే.. ఓ మోస్త‌రు ఉద్యోగి అయితే ఖ‌ర్చులకు చాల‌క‌ అడుక్క‌తినాల్సిందే. అందుకే వెన‌క్కు వ‌చ్చేయ‌డం మేలంటూ కొంద‌రు త‌ట్టా బుట్టా స‌ర్దుకుంటున్నారు. దీనికి తోడు తుపాకీ మాఫియా కూడా భ‌య‌పపెడుతోంది. త‌ర‌చుగా మ‌న యువ‌కుల ప్రాణాల‌ను అక్క‌డి గ‌న్ క‌ల్చ‌ర్‌ బ‌లితీసుకుంటోంది. స‌ప్త స‌ముద్రాల ఇవ‌త‌ల ఉన్న‌ త‌ల్లిదండ్రులకు క‌డుపుకోత మిగుల్చుతోంది. సూదూరంగా అయినా సంతోషంగా ఉన్నార‌ని రాజీప‌డుతున్న త‌ల్లిదండ్రులు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వ‌స్తుందోన‌న్న భ‌యంతోనే గ‌డుపుతున్నారు. మొబైల్ లో వీడియో కాల్ చేసి ఏరోజుకారోజు హ‌మ్మ‌య్య అనుకుంటున్నారు. ప్ర‌మాదాలు, దాడులు ఇలా అక్క‌డ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నార‌ని ఆందోళ‌న ఇక్క‌డివారిలో త‌ప్ప‌డం లేదు. అమెరికాలో దాడులు జ‌రిగాయంటే ఇక్క‌డున్న వారి బంధువుల‌ గుండెలు గుబేలుమంటున్నాయి. దీనికి తోడు అమెరికాలో కూడా నీచ సంస్కృతి.. తెలుగువారి మీద చెడు ముద్ర ప‌డుతోంది. క‌ల్చ‌ర‌ల్ ముసుగులో జ‌రుగుతున్న వ్య‌భిచారం ప్ర‌తిష్ట‌ను మంట‌గ‌లిపింది. ఒకప్పుడు అబ్బో అమెరికా అనేవారు.. ఇప్పుడు అమ్మో అమెరికా అనాల్సి వ‌స్తుంది. అయితే అక్క‌డ ఉన్న‌వాళ్లంతా అలా ఉన్నార‌ని కాదు.. మంచి తెలివైన వాళ్లు.. వాళ్ల‌కు ఇక్క‌డా మెరుగైన‌ అవ‌కాశాలు ఉంటాయి. కానీ భ‌విష్య‌త్తులో ప‌దిమందికి ఉపాధి ఇవ్వ‌డానికి సంపాదించుకుందామ‌ని వెళ్లేవాళ్లే. వాళ్ల‌ను త‌ప్పుబ‌ట్ట‌డానికి ఏమీ లేదు. కానీ అక్క‌డ ప‌రిస్థితులే మారిపోయాయి. ఒక‌ప్పుడు కాక‌ర్లు సుబ్బారావు స‌హా ఇప్పుడు హైద‌రాబాద్ లో ప్ర‌ముఖ ఆసుపత్రులు న‌డుపుతున్న వారంతా అమెరికా నుంచి వ‌చ్చిన వారే మెజార్టీ. ఇక ఐటీ రంగంలో కూడా చాలామంది ఇక్క‌డ‌కు వ‌చ్చి కంపెనీలు పెట్టారు. సుంద‌ర్ పిచాయ్‌,. స‌త్య నాదేళ్ల వంటి వాళ్లు అక్క‌డే ఉండి మ‌న‌వాళ్ల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. అలాంటి వాళ్ల వ‌ల్ల‌ మ‌న‌దేశంలో అవకాశాలు పెరిగాయి. కానీ ఇప్పుడు ఈ ప‌రిస్థితులు లేవు.. సంపాదించుకోవ‌డానికి ఛాన్సు లేదు. లోక‌ల్ సెంటిమెంట్ తో టాలెంట్ ను కూడా అడ్డుకుంటున్నారు. అందుకే ఒక‌ప్పుడు అమెరికా.. ఇప్పుడు అమ్మోరికా..!

Recommended For You