నామినేటెడ్ ప‌ద‌వుల‌పై హ‌రీష్ అల‌క‌?

హ‌రీష్‌రావును కేసీఆర్ ఆకాశానికి ఎత్తేస్తారు. ఆయ‌న పనితీరును కొనియాడ‌తారు. సిద్దిపేట జిల్లా ప్రారంభోత్స‌వంలో ఒక‌రినొక‌రి అనుబంధం చూసి రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ళ్లు చెమ‌ర్చాయి. కార్య‌క‌ర్త‌లు కూడా తెగ సంతోష‌ప‌డ్డారు. దీంతో కొంత‌కాలం క్రితం వ‌చ్చిన రూమ‌ర్స్‌కు బ్రేకులు ప‌డ్డాయి. కేటీఆర్ వ‌చ్చిన త‌ర్వాత హ‌రీష్‌రావును ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఊహాగానాలు వినిపించాయి. పైగా హ‌రీష్‌రావుకు మైనింగ్ శాఖ తీసేసిన త‌ర్వాత మ‌రీ ఇబ్బందిప‌డ్డార‌ని వార్త‌లు రాశారు. అదంతా నిజం కాద‌ని తేలిపోయింది. అంతా స‌ర్దుకుంది అనుకుంటున్న స‌మ‌యంలో కొత్త చిక్కులు వ‌చ్చాయి. మ‌ళ్లీ వార్త‌లు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

పార్టీలో హ‌రీష్‌రావుకంటూ సొంత‌ క్యాడ‌ర్ ఉంది. ప్ర‌తిజిల్లాలో ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక‌ వ‌ర్గం ఉంది. కేసీఆర్ త‌ర్వాత అంత‌టిస్థాయిలో ప‌రిచ‌యాలు ఉన్న వ్య‌క్తి కూడా హ‌రీష్‌రావు. కానీ ఆయ‌న త‌న‌వాళ్ల‌కు ఏమీ చేయ‌లేక‌పోతున్నార‌ట‌. దీనిపై ఆయ‌నే కాదు.. ఆయ‌న వ‌ర్గం కూడా అసంతృప్తిగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కోపం కాదు కానీ అల‌క లాంటిద‌ని చెబుతున్నారు. ఇందుకు కార‌ణం నామినేటెడ్ పోస్టులే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ట‌. ఇటీవ‌ల వ‌ర‌స‌గా కార్పోరేష‌న్లు, దేవస్తానం, మార్కెట్‌యార్డు క‌మిటీ ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తున్నారు. ఉద్య‌మంలో ప‌నిచేసిన వారికి, మొద‌టి నుంచి న‌మ్మ‌కంగా ఉన్న‌వారికే కేసీఆర్ ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారు. ఇందులో సందేహం లేదు. అయితే ఇందులో కూడా హ‌రీష్‌రావుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారికి కాకుండా.. కేటీఆర్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేవారికి ప‌ద‌వులు ఇస్తున్నార‌ని కొంద‌రు వాపోతున్నార‌ట‌. ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ వంటివాళ్లు చాలాకాలంగా ప‌ద‌వి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ హరీష్‌రావుకు న‌మ్మ‌క‌స్తుడు కావ‌డంతోనే అన్ని అర్హ‌త‌లు ఉన్నా ప‌ద‌వి ద‌క్క‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా మ‌రికొంత మంది కూడా హ‌రీష్‌రావు వ‌ద్ద గోడు వెళ్ల‌బోసుకుంటున్నార‌ట‌. అయితే దీనిపై మామ‌ను అడ‌గ‌లేక‌.. వీరికి స‌మాధానం చెప్ప‌లేక హ‌రీష్‌రావు ఇబ్బందిప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి అల్లుడి క‌ష్టాన్ని మామ అర్ధం చేసుకుంటారా.. చూడాలి.

Recommended For You

Comments are closed.