మల్కాజ్ గిరిపై కాంగ్రెస్ సరికొత్త అస్త్రం..!

మ‌ల్కాజ్ గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో ఓ ప్ర‌చారం ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఎంపీ స్థానంపై చాలామంది రాష్ట్ర నాయ‌కులు క‌న్నేశారు. తాజాగా కాంగ్రెస్ ఇక్క‌డ పాగా వేయ‌డానికి ఓ సీనియ‌ర్ నాయ‌కురాలిని రంగంలో దింపుతున్న‌ట్టు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి, రాజ్య‌స‌భ ఎంపీ రేణుకా చౌద‌రిని మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దింపాల‌ని కాంగ్రెస్ భావిస్తోందట‌. ఇప్ప‌టికే ఆమెముందు కాంగ్రెస్ పెద్ద‌లు ఈ ప్ర‌తిపాద‌న‌ పెట్టిన‌ట్టు ప్ర‌చార‌ముంది. అర్బ‌న్ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంది. రేణుకాచౌద‌రి అయితే ఇక్క‌డ విజ‌యం వ‌రిస్తుంద‌ని పీసీసీ పెద్ద‌లు నివేదిక ఇచ్చార‌ట‌. పైగా రేణుకా చౌద‌రి గ‌తంలో హైద‌రాబాద్ బంజారాహిల్స్ కార్పోరేట‌ర్‌గా ప‌నిచేశారు.. టీడీపీ నేత‌ల‌తో సంబంధాలున్నాయి. బ‌ల‌మైన సామాజికవ‌ర్గానికి చెందిన కుటుంబం. సెటిల‌ర్స్ లో ఆమెకు మంచి పేరుంది. టీడీపీ ఓటుబ్యాంకు అనుకూలంగా మ‌లుచుకునే ఛాన్సుంది.  ఇవ‌న్నీ అధ్య‌య‌నం చేసి.. ఆమె పేరు ప‌రిశీలించిన‌ట్టు చెబుతున్నారు. అయితే ఖ‌మ్మం ఆడ‌బిడ్డ అని చెప్పుకుంటున్న ఆమె అక్క‌డి నుంచే పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. అయితే అధిష్టానం ఏం చెప్పినా స‌రే అంటున్న‌ రేణుకా చౌద‌రి… మ‌ల్కాజ్ గిరి పై పెద్ద‌గా వ్య‌తిరేక‌త చూప‌లేద‌ట‌. పోటీకి ఆమె కూడా సై అంటున్నార‌ట‌. రేణుకా మ‌ల్కాజ్ గిరికి షిఫ్ట్ అయితే.. ఖ‌మ్మం నుంచి నామా నాగేశ్వ‌ర‌రావును పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చే అంశాన్ని పీసీసీ పెద్ద‌లు చ‌ర్చిస్తున్నార‌ట‌. ఆయ‌నతో మంత‌నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్టు అస్త్రాలతో వ‌స్తోంది.. మ‌రి ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయ‌యో చూడాలి.

Recommended For You