స‌త్కారాల‌కు ఆయ‌న అర్హుడేనా?

చాలాకాలంగా తెలుగు రాష్ట్రాల్లో చీఫ్ సెక్ర‌ట‌రీలు ఎవ‌రు వ‌స్తున్నారో.. ఎవ‌రు పోతున్నారో చాలామందికి తెలియ‌దు. ఎంతోమంది వ‌చ్చారు. ప‌ద‌వీవిర‌మ‌ణ చేశారు. ఇందులో కొద్దిమంది మాత్ర‌మే త‌మ‌దైన ముద్ర వేయ‌గ‌లిగారు. ఈ జ‌న‌రేష‌న్‌లో త‌న‌దైన ప‌నితీరుతో గుర్తింపు పొంది జ‌నాల్లో కూడా విశ్వాసం పొంద‌గిలిగిన వారిలో ఇద్ద‌రు ముగ్గురు కంటే ఎక్కువ ఉండ‌రు. నాడు చంద్ర‌బాబు హ‌యంలో చేసిన మోహ‌న్ కందా, ఆత‌ర్వాత తెలుగు రాష్ట్రాలు విడిపోయిన త‌ర్వాత రాజీవ్ శ‌ర్మ‌. ఇలా కొద్ది మందిమాత్ర‌మే మ‌నకు ఎప్ప‌టికీ గుర్తుండిపోతారు. బుధవారం పదవీవిరమణ చేసిన రాజీవ్ శర్మ నిజంగా ఈ రెండున్నరేళ్లలో తెలంగాణకు విసృతమైన సేవ‌లు అందించారు. ఒక ఐఏఎస్ ఇంత‌గా క‌ష్ట‌ప‌డ‌తారా అని చాటిన వ్య‌క్తిగా చెప్ప‌వ‌చ్చు. అనుక్ష‌ణం రాష్ట్రం కోసం ప‌నిచేశారు. కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రానికి అన్నీ తానై చ‌క్క‌దిద్దారు. ఉద‌యం సిఎంతో స‌మీక్ష‌లో ఉండేవారు. సాయంత్రం ఢిల్లీ హొంశాఖలో క‌నిపించేవారు.ఉద్యోగుల పంపిణీ ఒక ఎత్తు అయితే. జిల్లాల విభ‌జ‌న‌లో ఆయ‌న చూపిన చోర‌వ అనిర్వ‌చ‌నీయం. సిఎం ఏ ప‌థ‌కం ప్ర‌క‌టించినా దీనికి స‌మ‌గ్ర‌రూపం తీసుక‌రావ‌డం సంబంధిత అధికారుల‌కు అప్ర‌మ‌త్తం చేయ‌డం ఆయ‌న‌కు మాత్ర‌మే సాద్య‌మైంది. విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌కుండా..వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి అప‌కీర్తి మూట‌గ‌ట్టుకోకుండా అంద‌రికీ అందుబాటులో ఉంటూ రాష్ట్రానికి పెద్ద‌గా వ్య‌వ‌హ‌రించారు.

కొత్త‌గా ఏర్పడిన రాష్ట్రంలో అన్నీ స‌మ‌స్య‌లే ఉంటాయి. వాటిని ప‌రిష్క‌రించ‌డం అంత సుల‌భం కాదు. ఇదే త‌ల‌కు మించిన భారం. ఇక సిఎం కేసీఆర్ వంటి వాళ్ల ద‌గ్గ‌ర ప‌నిచేయ‌డం క‌త్తిమీద సాములాంటిదే. స‌హ‌జంగా కేసీఆర్ అప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితుల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఒక్కోసారి ఎంత పెద్ద నిర్ణ‌యం అయిన స‌రే.. అప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌టిస్తారు. అయినా ఓపికగా రాజీవ్‌శ‌ర్మ వాటిని అమ‌లుచేసిన తీరు అధ్బుతం. జిల్లాలపై రోజుకో నిర్ణ‌యం తీసుకున్నా.. డ్రాఫ్టుల్లో మార్పులు చేసినా స‌హ‌నంతో అధికార‌యంత్రాంగాన్ని ముందుకు న‌డిపించిన తీరు అమోఘం. సివిల్ స‌ప్లైస్ క‌మీష‌న‌ర్‌గా ఐపీఎస్‌ను నియ‌మిస్తే.. ఐఏఎస్‌లు ఆందోళ‌న‌కు దిగారు. వారిని వారించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. మ‌రొక‌రు అయితే రాష్ట్రం కోసం అంత‌గా చేయ‌లేరోమో అని స్వ‌యంగా సిఎం అన్నారంటే రాజీవ్‌శ‌ర్మ క‌ష్టం అర్ధ‌మ‌వుతుంది.

చీఫ్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వీవిర‌మ‌ణ చేస్తే అంత హ‌డావిడి చేయాలా అని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. కానీ రాజీవ్‌శ‌ర్మ రాష్ట్రానికి చేసిన సేవ‌ల‌కు ఇది స‌ముచిత‌మే. సందేహం లేదు. ఓ అధికారి త‌న బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారని అనుకోవ‌చ్చు. కానీ ఎంత‌మంది చీప్ సెక్ర‌ట‌రీలు మ‌న‌కు గుర్తుంటున్నారు. ఇప్ప‌టికీ మోహ‌న్‌కందా పేరు ఎలా గుర్తు ఉంటుంది. భ‌విష్య‌త్తులో రాజీవ్‌శ‌ర్మ అలానే గుర్తుండిపోతారు సందేహం లేదు. అందుకే ఆయ‌న అన్ని విధాలా స‌త్కారాల‌కు, కీల‌క ప‌ద‌వుల‌కు అర్హుడు.

Recommended For You

Comments are closed.