ప్రోత్సహించిన వలస‌లే త‌ల‌పోటుగా మారాయా?

ఏపీ ప్ర‌భుత్వానికి, అధినేత చంద్ర‌బాబుకు కొత్త క‌ష్టాలు వ‌చ్చిప‌డుతున్నాయి. పాల‌నాప‌రంగా మెరుగైన స్థితిలో ఉన్నామ‌ని సంతోషించేలోగా.. పార్టీలో కుమ్ములాట‌లు, క‌ల‌హాలు క‌ల‌త‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. ప్రతిపక్షం పైచేయి సాధిస్తోంది. ఒక‌ప్పుడు వ‌ల‌స‌ల‌తో పార్టీని తిరుగులేని శ‌క్తిగా మ‌లుచుకుందామ‌ని టీడీపీ నేతలు భావించారు. కానీ అదే ఇప్పుడు రివ‌ర్స్ అయి పార్టీ ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. అధినేత వెంట‌నే ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. లేదంటే ఇది మ‌రింత రెచ్చి.. 2019లో పార్టీనే ఓడిస్తుందన్న అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు పార్టీలో సీనియ‌ర్ల‌కు ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ప్రతిపక్షానికి బలం ఇస్తున్నాయి.

భూమా నాగిరెడ్డి పార్టీలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌ర్నూలు జిల్లాలో టీడీపీకి బ‌లం పెరిగింది. శిల్పా, భూమా కుటుంబాల మ‌ధ్య రాజీ ప్ర‌య‌త్నాలు చేశారు. భూమా మ‌ర‌ణంతో మ‌ళ్లీ ఆధిప‌త్య రాజ‌కీయాలు బలహీనతగా మారాయి. ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ వ‌స్తే టికెట్ విష‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు పార్టీకి త‌ల‌పొటుగా మారింది. ఎవ‌రికి వారు ప‌ట్టుబ‌డుతుండ‌డంతో ఎటూ తేల్చ‌లేకపోతున్నారు. తండ్రి సెంటిమెంట్‌.. అటు శిల్పాను కాదంటే ఓడిపోతామ‌న్న భ‌యం వెంటాడుతున్నాయి.

క‌ర్నూలు జిల్లాలో ఆదినారాయ‌ణ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంపై రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గంలో ఆగ్ర‌హం నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది. ఆయ‌న‌కు హామీ ఇచ్చినా శాంతించే ప‌రిస్థితి లేదు. అనుచ‌రులు స‌సేమిరా అంటున్నారు. మూడు ద‌శాబ్ధాలు ఎవ‌రితో ఫైట్ చేశారో వారిని పార్టీలోకి తీసుకొచ్చి మంత్రి ప‌ద‌వి ఇస్తే ఉండే క‌ష్టం వారి మాట‌ల్లో బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది.

ఇక నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణ రెడ్డిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇస్తే ఆయ‌న‌పై సిబిఐ కేసులు చుట్టుకున్నాయి. ప్ర‌మాణ స్వీకారం కాక‌ముందే పార్టీ నుంచి తొల‌గించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. గంటా, సుజ‌నాల‌ను కూడా టార్గెట్ చేయ‌డానికి ఆయ‌న విప‌క్షానికి అస్త్రంగా మారారు.
ఇక ప్ర‌కాశం జిల్లాలో గొట్టిపాటి, క‌ర‌ణం కుటుంబాల మ‌ధ్యఆధిపత్యయుద్ధం హ‌త్య‌ల‌కు దారి తీసింది. మొత్తం ముగ్గురు ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్ర‌తిష్ట మంట‌గ‌లిసింది. హ‌త్యా రాజ‌కీయాలు పడగవిప్పడం చంద్ర‌బాబుకు ఇబ్బందిగా మారింది. ఇది మరవకముందే క‌ర్నూలు జిల్లాలో వైసీపీ నాయ‌కుడు పత్తికొండ ఇన్ ఛార్జ్ నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య రాష్ట్ర రాజ‌కీయాల‌ను వేడెక్కించింది. చంద్ర‌బాబు అవినీతి, అక్ర‌మాలు, హ‌త్యా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటారో… అవే ఆయ‌న ప్ర‌భుత్వాన్ని వెంటాడుతున్నాయి. నాడు వ‌ల‌స‌ల‌తో బ‌ల‌ప‌డదామ‌ని భావించారు. అవే ఇప్పుడు బ‌ల‌హీన‌తలుగా మారాయి. మ‌రి ఈ గండం నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారా? లేదంటే ప్రతిపక్షాలకు బలం  ఇచ్చినట్టే అవుతుంది.

Recommended For You

Comments are closed.