చంద్ర‌బాబుకు 9 టెన్ష‌న్ ప‌ట్టుకుందా?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు 9 టెన్ష‌న్ ప‌ట్టుకుంది. పార్టీ వ‌ర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాదు పార్టీ నాయ‌కుల‌కు క‌వ‌ల‌ర‌పెడుతుంద‌ట‌. ఉమ్మ‌డి రాష్ట్రానికి 9 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా చేశారు. సిఎంగా 1999లో నేరుగా ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించారు. 9 ఏళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు. ఇప్పుడు ఈ 9 ఆయ‌న‌కు టెన్ష‌న్ పెంచుతుంది. దీనికి కార‌ణం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపి, బీజేపీ మిత్ర‌ప‌క్షాల‌కు భుజం కాచి అండ‌గా నిలిచిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్ర‌మంగా దూర‌మ‌వుతున్నారు. త‌న‌దారి ర‌హ‌దారి అంటూ సొంత‌దారిలో వెళుతున్నారు. ఇప్ప‌టికే పాచిపోయిన ల‌డ్డూ ఇస్తారా, ఉత్త‌రాది పాల‌కుల‌కు ద‌క్ష‌ణాది అంటే చిన్న‌చూపు త‌గ‌దంటూ మోడీపైనా, కేంద్రంపైనా తిరుగుబాటు జెండా ఎగ‌రేశారు. కేంద్రంతో తాడో పేడో అన్న‌ట్టు ఉన్నారు. ఇంత‌కాలం టీడీపీ ప‌ట్ల పెద్ద‌గా వ్య‌తిరేక‌త చూప‌లేదు. స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ ఉద్య‌మించడం… చంద్ర‌బాబు సానుకూలంగా స్పందించి ప‌రిష్కారం దిశ‌గా అడుగులు వేయడంతో అంత‌రం ఏర్పడ‌లేదు. కానీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో ముఖ్యంగా విశాఖ యూత్ చేప‌ట్టిన ర్యాలీ ప్ర‌భుత్వం అడ్డుకోవ‌డం.. ప‌వ‌న్ మ‌ద్ద‌తివ్వడాన్ని త‌ప్పుబ‌ట్ట‌డం ద్వారా అగాధం పెరిగింది. తీవ్ర‌స్థాయిలో మాట‌ల‌దాడి జ‌రుగుతోంది. టీడీపీ సైలెంట్‌గా ఉన్నా.. ప‌వ‌న్ మాత్రం దూకుడుగా వెళుతున్నారు. ఈ గ్యాప్ ఆలాగే సాగితే భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. 2009లో అన్న చిరంజీవి అధికారం అంద‌కుండా అడ్డుకున్నాడు… 2019లో త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓట్లు చీల్చితే ప‌రిస్థితి ఏంట‌ని భ‌య‌ప‌డుతున్నారు. చివ‌ర్లో ఈ తొమ్మిది అంకె చూసి టెన్ష‌న్ ప‌డుతున్నారు. 2009లో కొత్తగా రాజ‌కీయాల్లో వ‌చ్చిన ప్ర‌జారాజ్యం పార్టీనే ఓట్లు చీల్చి టీడీపీ కొంప ముంచింది. 2019లో కూడా జ‌న‌సేన రూపంలో అదే జ‌రుగుతుందా? అని ఆలోచ‌నలో ప‌డ్డారు. గెలుపు ధీమా ఉన్నా.. వ‌ప‌న్ క‌ళ్యాణ్ వైపు బీసీలు, ముఖ్యంగా కాపు ఓటుబ్యాంకు మ‌ళ్లితే ఇబ్బందులు త‌ప్ప‌వంటున్నారు. మ‌రి 9 టెన్ష‌న్ ఏం చేస్తుందో చూడాలి.

Recommended For You

Comments are closed.