చంద్రబాబుకు వ్యతిరేకంగా పొలిటికల్ మూడ్…!

ఏపీలో రాజ‌కీయంగా త‌న‌కు తిరుగులేకుండా చేసుకోవాల‌న్న‌ది చంద్ర‌బాబు ఎత్తుగ‌డ‌. అప‌ర‌చాణక్యుడు ప్ర‌జ‌ల్లో ఉన్న న‌వ్యాంధ్ర సెంటిమెంట్ ఆయుధంగా మ‌లుచుకుని ప్ర‌త్య‌ర్ధుల‌ను బ‌ల‌హీనం చేయాల‌ని భావించారు. తానొక‌టి త‌లిస్తే.. దైవం మ‌రొక‌టి త‌ల‌చింద‌ని.. సిఎం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ విక‌టిస్తుంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ చంద్ర‌బాబు అంచ‌నాలు తలకిందులవుతున్నాయి. అటు రాజ‌కీయంగా.. ఇటు పాల‌నా ప‌రంగా సిఎం ఇర‌కాటంలో ప‌డుతున్నారు. చుట్టూ స‌మ‌స్యలు చుట్టుముడుతున్నాయి.

పాల‌న గాడి త‌ప్పుతోంది..
న‌వ్యాంధ్ర నిర్మాణం ఆయ‌న‌తోనే సాద్య‌మ‌ని జ‌నాలు విశ్వ‌సించి ఓటేశారు. అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోనే రాజ‌ధాని నిర్మాణం కోసం భూములు స‌మీక‌రించారు. కానీ అక్క‌డితోనే అభివృద్ధి ఆగిపోయింది. అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. కేంద్రం ఇచ్చిన 2వేల కోట్లు కూడా తాత్కాలిక భ‌వ‌నాల‌కు ఖ‌ర్చు చేశారు. 2018నాటికి శాశ్వ‌త పరిపాల‌నా భ‌వ‌నాలు పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇంకా ఏడాదిలో సాద్య‌మ‌వుతుందా? నారాయణ అనుభవ రాహిత్యమో.. అధికారుల అలసత్వమో అస‌లు భూముల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లే ప‌రిష్కారం కాలేదు. ప్రధాని వ‌చ్చి శంకుస్థాప‌న చేశారు.. ఆత‌ర్వాత చంద్ర‌బాబు మ‌రోసారి సీడ్ కేపిట‌ల్‌కు పూజ‌లు చేశారు. అరుణ్‌జైట్లీ వ‌చ్చి ప్ర‌భుత్వం భ‌వ‌నాల‌కు రాయి వేశారు. శంకుస్థాప‌న‌లు, పూజ‌ల‌తో మూడేళ్లు గ‌డిచాయి. ఇంకా ప‌ద‌వీకాలం రెండేళ్లు ఉంది. రెండేళ్ల‌లో వారి ప‌నితీరు.. మ‌రోద‌పా అధికారానికి మార్గాలు ప‌రుస్తుంది. కానీ ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్నాయి. రాజ‌ధాని నిర్మాణ‌మే కాదు.. ఐటీ రంగంలో త‌న‌కు అనుభ‌వం ఉంద‌ని.. హైటెక్ బాబు అని చెప్పుకున్నారు. స‌త్య‌నాదేళ్ల‌ను క‌లిసినా.. బిల్‌గేట్స్‌ను క‌లిసినా ఒక్క కంపెనీని కూడా తీసుక‌రాలేక‌పోయారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికే విదేశీ విమానాలు రాన‌ప్పుడు పెట్టుబ‌డులు మాత్రం ఎలా వ‌స్తాయి. దీంతో చంద్ర‌బాబు క‌ల్పించిన ఆశ‌లు ఒక్క‌క్క‌టిగా నీరుగారిపోతున్నాయి. రాజ‌ధాని ఇంకా డిజైన్ల ద‌గ్గ‌ర కుస్తీప‌డుతోంది. రావాల్సిన హీరో, ఏసియ‌న్ పెయింట్స్ వంటికంపెనీలు ముఖం చాటేశాయి.

ఆక‌ర్ష్ వికటిస్తోందా..!
అటు రాజ‌కీయంగా బ‌లం పెంచుకుని బ‌య‌ట‌ప‌డ‌దామ‌న్నా టీడీపీకి కాలం క‌లిసి రావ‌డం లేదు. ప్ర‌త్య‌ర్ధి పార్టీ నుంచి ఎమ్మెల్యేల‌ను తీసుకొచ్చినా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు రాజ‌కీయాల‌తో సుస్థిరంగా ఉన్న ఓటు బ్యాంకుకు చిల్లు ప‌డుతోంది. ఇప్పుడు గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి పార్టీ మారాడు.. రేపు క‌ర‌ణం బ‌ల‌రాం.. ఎల్లుండి ఇంకొక‌రు.. ఇలా చేజారిపోయే ప్ర‌మాదం వచ్చింది. నియోజ‌క‌వర్గాల పున‌ర్విభ‌జ‌న ఉంటుంద‌ని ఆశించినా.. బీజేపీ ఈ విష‌యంలో ముఖం చాటేస్తోంది. సానుకూల సంకేతాలు పంపడం లేదు. చట్టం చేసే సమయం కూడా మించిపోతోంది. దీంతో పార్టీకి తానే లేనిపోని వ‌ల‌స‌ల‌తో కుంప‌ట్ల రాజేసిన‌ట్టు అయింద‌న్న భావ‌న చంద్ర‌బాబులో క‌నిపిస్తోంది.

ముంచుకొస్తున్న శ‌త్రువు
ఇక చంద్ర‌బాబుకు స‌రికొత్త శ‌త్రువు త‌యార‌య్యారు. గ‌త ఎన్నిక‌ల్లో మిత్రుడుగా ఉండి.. కాపు ఓటుబ్యాంకుకు స‌హాయ‌కారిగా నిలిచిన ప‌వ‌ర్ క‌ళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌లు ల‌క్ష్యంగా బ‌రిలో దిగుతామంటున్నారు. టీడీపీతో క‌లిసి సాగ‌డం దాదాపు అసాద్యం అని ఆయ‌న మాట‌లు చెబుతున్నాయి. అంటే ఓటు చీల‌డం ఖాయం. అది టీడీపీకే న‌ష్ట‌మ‌ని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2009లో 18శాతం ఓట్లు చీల్చి.. టీడీపీకి మాన‌ని గాయం అన్న చిరంజీవి చేస్తే.. 2019లో జ‌న‌సేన అధినేత తమ్ముడు పవన్ త‌యార‌య్యారు.

జ‌గ‌న్‌కు ప్ల‌స్ అవుతుందా?

వాస్త‌వానికి జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో కాస్త సానుకూల‌త ఉంది. కానీ పాల‌న ప‌ట్ల అసంతృప్తిగా ఉన్నారు. న్యూట్ర‌ల్ ఓటింగ్ ఓసారి చూద్దం అని జ‌గ‌న్ వైపు మొగ్గుచూపి… ప‌వ‌న్ ఒంట‌రిగా పోటీచేస్తే టీడీపీకి క‌ష్టాలు.. వైసీపీకి ప‌గ్గాలు వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి. మ‌రి ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాల‌ను ఎవ‌రు ఎలా మ‌లుచుకుంటార‌న్న దానిపై ఆధార‌ప‌డి ఉంది. దీనికి కాల‌మే ప‌రిష్కారం చెబుతుంది.

Recommended For You

Comments are closed.