కేసీఆర్ కూతురు… చంద్ర‌బాబు కోడ‌లు..!

దేశ వ్యాప్తంగా ఉన్న రాజ‌కీయ నాయ‌కులు.. త‌మ వార‌సుల‌తో పాటు… వార‌సురాళ్ల‌ను కూడా రాజ‌కీయాల్లోకి తీసుకొస్తున్నారు. అభిరుచి ఉంటే వారికి కుటుంబాలు కూడా అడ్డు చెప్ప‌డం లేదు. అలా వ‌చ్చిన వారిలో చాలామంది త‌మ‌ను తాము నిరూపించుకున్నారు. క‌రుణానిధి కూతురు కనిమొళి, శ‌ర‌ద‌ప‌వార్ కూతురు సుప్రియా సూలె ఎంపీలుగా ఇప్ప‌టికే ఆయా పార్టీల త‌ర‌పున హ‌స్తిన‌లో చ‌క్రం తిప్పుతున్నారు. పంజాబ్ ముఖ్య‌మంత్రి బాద‌ల్ కోడ‌లు, డిప్యూటీ సిఎం సుఖ్‌బీర్ సింగ్ భార్య హ‌ర‌సిమ్ర‌త్‌కౌర్ కేంద్రం మంత్రిగా ఉన్నారు. అఖిలేష్ స‌తీమ‌ణి డింపుల్ కూడా ఎంపీగా స‌మ‌ర్ధ‌త‌ను నిరూపించుకున్నారు. యూపీలో చ‌రిష్మా ఉన్న నాయ‌కురాలని ప్ర‌చారం చేస్తే మ‌హిళా ఓటుశాతం పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. కాశ్మీర్‌లో మ‌హ‌బూబా ముఫ్తీ సిఎంగా అయ్యారు. కుటుంబాల నుంచి మ‌హిళ‌లు రావ‌డం వ‌ల్ల పార్టీకి అద‌న‌పు బ‌లంగా మారుతోంది. మ‌హిళా ఓట్లు ఆక‌ట్టుకోవ‌డానికి కీల‌కంగా మారుతున్నారు. అయితే ఇక్క‌డ స‌మ‌ర్ధ‌త కూడా కీల‌క‌మే. కేవ‌లం వార‌స‌త్వం మాత్ర‌మే అర్హ‌త కాబోదు. త‌మ‌దైన ప‌నితీరుతో క్యాడ‌ర్‌కు అండ‌గా ఉన్నామ‌న్న ధైర్యం ఇవ్వాలి.

తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అలాంటి మ‌హిళా వార‌సుల అవ‌స‌రం ఉంద‌న్న వాద‌న‌లున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ సిఎం కేసీఆర్ కూతురు క‌విత పార్ల‌మెంట్ స‌భ్యురాలిగా మంచి పేరు పొందారు. ప్ర‌సంగాల‌తో అద‌ర‌గొడుతున్నారు. జాగృతి ద్వారా త‌న‌కంటే క్యాడ‌ర్‌ను సంపాదించుకున్నారు. హ‌స్తిన‌లో టిఆర్ఎస్ త‌రుపున‌ చ‌క్రం తిప్పుతున్నారు. మ‌రిన్ని కీల‌క బాధ్య‌త‌ల దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

ఇక మిగిలింది చంద్ర‌బాబు కుటుంబ‌మే.. నారా కుటుంబం నుంచి మ‌హిళ వార‌సురాలి అవ‌స‌రం ఉంద‌ని పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు. లోకేష్ స‌తీమ‌ణి బ్రహ్మ‌ణి విద్యావంతురాలు, తెలివైన ఎగ్జిక్యూటీవ్‌గా పేరు సంపాదించారు. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు కూడా ఉన్నాయి. ఖ‌చ్చితంగా రాజ‌కీయాల్లో రాణిస్తార‌ని.. రాజ్య‌స‌భ‌కు పంపి పార్టీ బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించాల‌ని నేత‌లు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో చ‌రిష్మా క‌ల‌ మ‌హిళా నాయ‌క‌త్వం అవ‌స‌రం ఉంద‌ని గుర్తు చేస్తున్నారు. దీనిని భ‌ర్తీ చేయ‌డానికి బ్ర‌హ్మ‌ణి స‌రైన వార‌సురాలు అని అంటున్నారు. త్వ‌ర‌లోనే బ్ర‌హ్మ‌ణి రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే వ్యాపారాల్లో ఉన్న యాజ‌మాన్య హ‌క్కుల‌ను ఇత‌ర కంపెనీల‌కు విక్ర‌యించి షేర్లుగా మ‌లుచుకుంటున్నార‌ని ఉద‌హ‌రిస్తున్నారు. వ్యాపారాల‌న్నీ చ‌క్క‌బెట్టిన త‌ర్వాత బ్ర‌హ్మ‌ణి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసే అవ‌కాశాలు లేక‌పోలేదని అంటున్నారు. పైగా ఇటీవ‌ల జాత‌కాల‌ను బాగా న‌మ్ముతున్న చంద్ర‌బాబుకు జ్యోతిష్యులు కూడా బ్ర‌హ్మ‌ణికి రాజ‌కీయ యోగం బాగుంద‌ని గుసుగుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి క‌విత‌తో పాటు.. త్వ‌ర‌లో బ్ర‌హ్మ‌ణి కూడా హ‌స్తిన రాజ‌కీయాల్లో మెరుస్తారా… మామ‌కు అండ‌గా.. భ‌ర్త‌కు చేదోడుగా రాజ‌కీయాల్లోకి త‌న‌వంతు పాత్ర పోషించ‌డానికి ఆమె సిద్దంగా ఉన్నార‌ని చూడాలి.

Recommended For You

Comments are closed.