చంద్రబాబు వ్యూహంలో చిక్కిన వైసీపీ

చంద్రబాబు వ్యూహంలో చిక్కిన వైసీపీ
తన సరికొత్త వ్యూహంతో మాజీ సిఎం చంద్రబాబు అటు వైసీపీతో పాటు ఇటు బీజేపీని కూడా దెబ్బకొట్టారని చెప్పాలి. చలో ఆత్మకూరు అంటూ తమ పార్టీకి చెందిన వైసీపీ బాధితులను వారి ఊళ్లలోకి తీసుకెళ్లే పని మొదలుపెట్టిన టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వైసీపీపై రాజకీయ దాడిని ముమ్మరం చేశారు. కొంతకాలంగా నుంచి సైలెంట్ ఉన్న టీడీపీ శ్రేణులను తన కొత్త రాజకీయ వ్యూహం ద్వారా యాక్టివ్ చేయడంతో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇదే విషయం రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తమ పార్టీ శ్రేణులపై అధికార పార్టీ దాడులు చేస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చలో ఆత్మకూరు ద్వారా చంద్రబాబు ఎంతో కొంత విజయం సాధించారని చెప్పకతప్పదు. తమ రాజకీయ కార్యాచరణ ద్వారా వైసీపీని కొంతమేర ఆత్మరక్షణలో పడేయడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. అయితే చలో ఆత్మకూరు ద్వారా చంద్రబాబు వైసీపీని టార్గెట్ చేశారనే విషయం బయటకు కనిపిస్తున్నా… అంతర్లీనంగా మాత్రం ఆయన బీజేపీకి కూడా చెక్ చెప్పే ప్రయత్నం చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల తరువాత టీడీపీ కాస్త స్తబ్దుగా ఉండటంతో… ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ వైపు చూశారనే టాక్ ఉంది. పార్టీని మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి తీసుకురావడం రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం టీడీపీనే అనే అంశాన్ని చలో ఆత్మకూరు ద్వారా మరోసారి పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. ఈ రకమైన రాజకీయ దూకుడు కొనసాగిస్తే… టీడీపీ నేతలు బీజేపీ వైపు వెళ్లే విషయంలో పునరాలోచనలో పడతారన్నది చంద్రబాబు ఆలోచన. రాష్ట్రంలో కేవలం ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్ప… రాజకీయ కార్యాచరణ విషయంలో బీజేపీకి ఇప్పటికీ ఓ క్లారిటీ లేకపోవడం టీడీపీకి కలిసొచ్చే అంశమని తెలుస్తోంది. మొత్తానికి చలో ఆత్మకూరు కార్యక్రమం ద్వారా చంద్రబాబు పత్యక్షంగా వైసీపీని, పరోక్షంగా బీజేపీని దెబ్బకొట్టారని అర్థమవుతోంది. ఇప్పుడే కాదు ముందు ముందు బాబు ఇలాంటి కార్యక్రమాలతోనే వైసీపీని ఇబ్బంది పెడతారంటున్నారు. అదే సమయంలో పార్టీ క్యాడర్ ను కాపాడుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారని తెలుస్తోంది. బాబు ఇచ్చిన పిలుపుకు వైసీపీ కచ్చితంగా స్పందించాల్సిన పరిస్థితిని తీసుకువస్తోంది. గతంలో టీడీపీ నేతలు తప్పు చేసినా..ఇప్పుడు వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చూసి..అవన్నీ కొట్టుకుపోయేలా కనిపిస్తున్నాయి. దటీజ్ 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అంటున్నారు.

Recommended For You